క్షీరపురిలో మహాకుంభాభిషేకం
పాలకొల్లు సెంట్రల్ :
పంచారామ క్షేత్రాల్లో ఒకటైన పాలకొల్లు క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 20, 21 తేదీల్లో మహాకుంభాభిషేకం నిర్వహించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలను గజల్స్ శ్రీనివాస్ బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. క్షీరా రామలింగేశ్వర స్వామి క్షేత్రంలో మహాకుంభాభిషేకం నిర్వహించడం ఇదే ప్రథమమని ఆయన చెప్పారు. ఈ మహత్కార్యానికి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపనందేంద్ర సరస్వతి, కాకినాడ శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానంద సరస్వతి చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. గోగుల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, సేవ్ టెంపుల్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. నుదురుపాటి శ్రీనివాస శర్మ, సేవ్ టెంపుల్స్ జిల్లా అధ్యక్షుడు మేడికొండ శ్రీను, చల్లా ఆదినారాయణ, చల్లా గోపాలకష్ణ, బొక్కా రమాకాంత్, రావూరి చాచా, సోమంచి శ్రీనివాసశాస్త్రి, తాళ్లూరి సుబ్బారావు, బోణం చినబాబు తదితరులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.