ఏసీబీ వలలో ఇద్దరు మున్సిపల్ అధికారులు
విజయనగరం: విజయనగరం మున్సిపాలిటీకి చెందిన ఇద్దరు అధికారులు గురువారం ఏసీబీకి చిక్కారు. కొత్త ఇంటికి పన్ను విధించేందుకు రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా గాజులరేగ రైల్వేగేటు సమీపంలో ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ లక్ష్మీపతి అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక కేఎల్‌పురంలో కె.శ్రీనివాసరావు బంధువులు ఇల్లు నిర్మించుకున్నారు. ఆ కొత్త ఇంటికి పన్ను విధించాలని బంధువుల తరఫున శ్రీనివాసరావు జూన్ 3న దరఖాస్తు చేసుకున్నారు.
రూ.10 వేలు లంచం ఇస్తే పన్ను తక్కువ విధిస్తామని మున్సిపల్ ఆర్ఐ పి.ఈశ్వరరావు, బిల్లు కలెక్టర్ డి.వెంకటేశ్వరరావు చెప్పారు. దీంతో శ్రీనివాసరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. గురువారం గాజులరేగ సమీపంలో విధినిర్వహణలో ఉన్న ఆర్ఐ ఈశ్వరరావు సూచనల మేరకు బిల్లు కలెక్టర్ డి.వెంకటేశ్వరరావు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నగదు స్వాధీనంచేసుకుని వారిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ చెప్పారు.