gajwel assembly
-
మెదక్ లోకసభకు కేసీఆర్ రాజీనామా!
-
మెదక్ లోకసభకు కేసీఆర్ రాజీనామా!
న్యూఢిల్లీ: మెదక్ లోక్‌సభ స్థానానికి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ రాజీనామా సమర్పించారు. నరేంద్రమోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవ్వడానికి దేశ రాజధానికి వెళ్లిన కేసీఆర్ తన రాజీనామ లేఖను లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు అందచేశారు. తాజా ఎన్నికల్లో కేసీఆర్ మెదక్ లోకసభ స్థానానికి, గజ్వేల్ అసెంబ్లీ స్థానాల నుంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన కేసీఆర్ టీఆర్ఎస్ శాసనసభ పక్ష నాయకుడిగా ఎంపికయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత జూన్ 2 తేదిన తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో గజ్వేల్ శాసన సభ్యుడిగా కొనసాగతూ.. మెదక్ లోకసభకు రాజీనామా చేశారు. -
గజ్వేల్ లో చెమటోడుస్తున్న కేసీఆర్!
మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంపై అందరి దృష్టి నెలకొంది. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పోటీలో నిలవడమే ఇందుకు ప్రధాన కారణం. ముఖ్యమంత్రి పదవిపై కన్నేసిన కేసీఆర్ ఈ స్థానం నుంచి విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. అయితే గజ్వేల్ విజయం కేసీఆర్ కు అంత సులభంగా దక్కే అవకాశాలు కనిపించడం లేదనే అభిప్రాయం నెలకొంది. గజ్వేల్ నియోజకవర్గం నుంచి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తో పాటు కాంగ్రెస్ పార్టీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే టి. నర్సారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దొంతి పురుషోత్తం రెడ్డి, టీడీపీ, బీజేపీ కూటమి నుంచి ప్రతాప్ రెడ్డిలు బరిలో ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధికి ఈ నియోజకవర్గం సమీపంలో ఉండటంతో అర్బన్ ఓటర్ల ప్రభావం ఎక్కువగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని కాంగ్రెస్ తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తుండగా, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో తమ పాత్ర ప్రధానమైందని టీఆర్ఎస్ తన వాదనతో ప్రచారంలో ముందుకు వెళ్లోంది. ఇదిలా ఉండగా బీజేపీ, టీడీపీల పొత్తు అంశంతో మోడీ హవాను విజయంగా మలుచుకోవాలని ఆ కూటమి అభ్యర్థి ప్రతాప్ రెడ్డి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరిస్తూ వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి దొంతి పురుషోత్తం రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. బహుముఖ పోటి నెలకొన్న నేపథ్యంలో ఓటర్లు ఎలా స్పందిస్తారనే అంశంపై బేరిజు వేసుకుంటూ నాయకులు తమ విజయానికి వ్యూహా రచన చేస్తున్నారు. టీఆర్ఎస్ కు విజయం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారడంతో ఆపార్టీ సీనియర్ నేత హరీష్ రావు ఈస్థానంపైనే ప్రధాన దృష్టిని కేంద్రికరించారు. కేసీఆర్ తెలంగాణ ప్రాంతంలో పర్యటిస్తుండటంతో ఆయన విజయానికి అన్నితానై హరీష్ వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో కవిత నిజమాబాద్ లోకసభ బరిలో ఉండటం, సిరిసిల్లా స్థానం నుంచి పోటీ చేస్తున్న కేటీఆర్ అస్వస్థతకు గురికావడంతో ప్రచారం భారమంతా హరీష్ పైనే పడింది. అన్ని పార్టీల అభ్యర్ధులు తమ బలాన్ని విజయానికి అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ తన విజయానికి చెమట్చోల్సి వస్తోంది. స్వంత జిల్లాలో సునాయాస విజయం దక్కుతుందని భావించిన కేసీఆర్ కు మిగితా పార్టీల నుంచి ఊహించని పోటి ఎదురవ్వడం టీఆర్ఎస్ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. అందరి దృష్టి కేంద్రీకృతమైన గజ్వేల్ నియోజకవర్గంపై గులాబి బాస్ తన జెండాను ఏ రేంజ్ లో ఎగురవేస్తారో వేచి చూడాల్సిందే. -
గజ్వేల్ పక్కా
* కేసీఆర్ మదిలో అదే! *ఈ సెగ్మెంట్ నుంచే పోటీ? * మొదట చొప్పించడం.. *తరువాత చెప్పించడం.. * అదే గులాబీబాస్ స్టైల్.. * దశలవారి ప్రచార తీరుపై విస్మయం సంగారెడ్డి: కేసీఆర్ తన మనుసులో మాటేది నేరుగా చెప్పరు. తన‘మనో వాంఛ’ను ముందు ప్రజల్లోకి చొప్పించి.. వారి నోటితోనే చెప్పించడం కేసీఆర్ స్టైల్.. ఇప్పుడు ఫాంహౌస్ స్క్రిప్టు.. డెరైక్షన్‌లో అదే నాటకం నడుస్తోంది. గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు కేసీఆర్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆయన గజ్వేల్ అసెంబ్లీ స్థానంతో పాటు, మెదక్ పార్లమెంటు నుంచి పోటీ చేయడం దాదాపు ఖరారైంది. కానీ ఆయన దానికి ఒప్పుకోరు. ప్రజలు కోరితేనే కేసీఆర్ గజ్వేల్ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారు. ఇందుకోసం ఒక బ్రహ్మాండమైన స్క్రిప్టు రచించి అమలు చేస్తున్నారు. మొత్తం నాలుగు దశలో సాగే ఈ నాటకాన్ని రక్తి కట్టించేందుకు టీఆర్ఎస్ నేతలు ఎవరి పాత్రలు వాళ్లు పోషిస్తున్నారని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. మొదటి దశ.. టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు గడిచిన నెల రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. దీన్ని టీఆర్ఎస్ నేతలే విస్తృతంగా ప్రచారం చేశారు. కేసీఆర్‌కు ఫాంహౌస్ అన్నా... ఈ నియోజకవర్గమన్నా అత్యంత ఇష్టమని, నియోజకవర్గం మీదున్న మమకారంతోనే ఇక్కడ ఫాంహౌస్‌ను ఏర్పాటు చేసుకున్నారని, గజ్వేల్ పై పట్టుసాధించేందుకే ఆయన స్థానికంగా ఉండి రాజకీయాలు నడిపారని చాలాకాలంగా ప్రచారంలో ఉంది. రెండవ దశ.... కేసీఆర్ గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ప్రజల నుంచి విన్నపాలు వెల్లువెత్తుతున్నాయని పది రోజుల నుంచి విస్తృతంగా ప్రచారం సాగుతోంది.. నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. వారంతా కేసీఆర్‌ను ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు వివిధ పత్రికల్లో వచ్చింది. కేసీఆర్ మాత్రం వాళ్ల ఒత్తిడి పట్ల ఏమాత్రం స్పందించ లేదు. మూడో దశ... మూడో దశలో టీఆర్ఎస్ నేతలు రంగ ప్రవేశం చేశారు. నియోజకవర్గంలో సభలు పెట్టారు. గజ్వేల్ నుంచి కేసీఆర్ పోటీ చేయాలని ప్రజలంతా కోరకుంటున్నారని, ప్రజల ఆకాంక్షను పార్టీ అధినేత తప్పకుండ గౌరవిస్తారని ప్రకటించారు. ఒకవేళ ఆయన ఒప్పుకోకపోతే తామంతా కలిసి ఆయనపై ఒత్తిడి పెంచుతామని, గజ్వేల్ నుంచే పోటీ చేయించే ప్రయత్నం చేస్తామంటూ వారు నాటకాన్ని మరింత రక్తి కట్టించారు. అంతిమ దశ... అంతిమ దశలో కేసీఆర్ రంగ ప్రవేశం చేసి ప్రజల ఆకాంక్షను శిరసావహిస్తున్నట్లు ప్రకటించి, గజ్వేల్ అసెంబ్లీ బరిలో నిలబడతారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నాటకం మూడో దశలో ఉందని త్వరలోనే కేసీఆర్ ఈ నాటకానికి తెర దించుతూ... గజ్వేల్ అసెంబ్లీ తెర మీదకు వస్తారని వారు చెప్తున్నారు. ఓటర్ల మైడ్‌సెట్‌ను దారి మళ్లించి, ఓట్లు కొల్లగొట్టడంలో కేసీఆర్ మంచి దిట్ట అని వారు అంటున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో బలహీనంగా ఉన్న పార్టీని బలోపేతం చేసేందుకే కేసీఆర్ ఈ వ్యూహం పన్ని ఉండవచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.