ఈ కాంట్రాక్టు మాకొద్దు!
గజ్వేల్: టెండర్ ప్రక్రియలో జాప్యం ఫలితంగా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ రోడ్డు విస్తరణ వ్యవహారంలో ప్రతిష్టంభన నెలకొంది. తొమ్మిది నెలల క్రితం రూ.7.7 కోట్ల నిధులు ఈ రోడ్డుకు మంజూరు కాగా, అధికారులు గత నెలలో ఓసారి ఈపనులకు టెండర్ పిలిచారు. అయినా స్పందన లేకపోవడంతో మరోమారు టెండర్లను పిలుస్తున్నారు. ఈసారైనా టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందా....? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
మృత్యుమార్గం
మూడు కిలోమీటర్ల పొడవున ఉన్న గజ్వేల్-ప్రజ్ఞాపూర్ రహదారి మరమ్మత్తులోపం కారణంగా అధ్వాన్నంగా తయారైంది. ఎక్కడపడితే అక్కడ గుంతలు ఏర్పడి వాహనచోదకులకు శాపంగా మారింది. ఈ క్రమంలో వరుసగా ప్రమాదాలు చోటుచేసుకుంటుండడంతో పలువురు మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో 2001 సంవత్సరంలో ఈ రోడ్డును పూర్తి స్థారుులో విస్తరించడానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
విస్తరణ పూర్తి చేసి గజ్వేల్ గుమ్మటం నుంచి ప్రజ్ఞాపూర్ చౌరస్తా వరకు డివైడర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విస్తరణ వల్ల ప్రజ్ఞాపూర్‌లో రోడ్డుపక్కన ఇళ్లు కోల్పోతున్న వారు కోర్టుకెక్కి స్టే తీసుకురావడంతో ఈ వ్యవహారం పెండింగ్‌లో పడింది. ఫలితంగా డివైడర్ల ఏర్పాటు పట్టణంలోని గుమ్మటం నుంచి ఇండేన్ గ్యాస్ కార్యాలయం వరకే పరిమితమైంది. డివైడర్ల నిర్మాణానికి నోచుకోని ప్రజ్ఞాపూర్ నుంచి గ్యాస్ కార్యాలయం వరకు తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ రోడ్డును పూర్తిస్థాయిలో విస్తరించడానికి సర్కార్ తొమ్మిది నెలల క్రితం రూ.7.7 కోట్లు మంజూరు చేసింది. దీంతో అధికారులు కూడా పనులకు గత నెలలో టెండర్లు పిలిచారు.
అయితే ఈ పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపలేదు. 2008-09 నాటి రేట్లతోనే ఈ పనులు చేయాలన్న నిబంధనతో తాము నష్టపోతామని, అందువల్లే ఈ రోడ్డు పనుల నిర్మాణానికి ఎవరూ ముందుకు రావడం లేదని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం సిమెంట్, స్టీలు, కూలీల ధరల్లో 15 శాతం పెరుగుదల ఉన్నా....పాత రేట్లు ఎలా కట్టిస్తారని ప్రశ్నిస్తున్నారు.
పరిస్థితి ఇలా ఉండగా, అధికారులు గజ్వేల్-ప్రజ్ఞాపూర్ రహదారి నిర్మాణానికి తాజాగా రెండోసారి టెండర్లు పిలిచారు. టెండర్ వేసేందుకు మరో వారం రోజులే గడువుందని ఆర్అండ్బీ డిప్యూటీ ఈఈ నర్సింహులు చెబుతున్నారు. ఈలోగా ఎవరైనా టెండర్ వేస్తారా...? లేదా అన్నది తెలియడం లేదు. నగర పంచాయతీ ప్రజలు మాత్రం ఈ సారైనా టెండర్లు పూర్తయి రోడ్డు నిర్మాణం పూర్తయితే తమ కష్టాలు తీరుతాయని ఆశతో ఎదురుచూస్తున్నారు.