అదే జనగళం
సాక్షి, విజయవాడ : జిల్లా అంతటా సమైక్య నినాదం.. అదే జనగళమైంది. గత 27 రోజులుగా ఎవరి నోట విన్నా సమైక్యాంధ్ర నాదమే మార్మోగుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఉద్యోగులు, విద్యార్థులు అనే తేడా లేకుండా రోడ్లపైకి వచ్చి వివిధ పద్దతుల్లో నిరసనలు తెలియజేస్తున్నారు. రిలే నిరాహారదీక్షలు, మానవహారాలు, రోడ్డు దిగ్బంధాలు, వంటావార్పులతో రోడ్లన్నీ పోరు హోరుతో మోతెక్కిపోతున్నాయి. సోమవారం కూడా జిల్లా వ్యాప్తంగా సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది.
హోరెత్తిన నూజివీడు..
నూజివీడులో జేఏసీ పిలుపు మేరకు పట్టణంలోని విద్యాసంస్థలన్నీ కలసి అరలక్ష గళ ఘోష నిర్వహించాయి. సమైక్య నినాదంతో పట్టణం హోరెత్తింది. చిన్నగాంధీబొమ్మ సెంటరులో బస్టాండు రోడ్డు, హనుమాన్‌జంక్షన్ రోడ్డు, విస్సన్నపేట రోడ్డు ఎటుచూసినా విద్యార్థులమయం అయ్యింది. విద్యార్థులు రంగురంగుల దుస్తులు ధరించి ప్రజలను ఆకట్టుకున్నారు. సమైక్యవాదులు చల్లపల్లిలో పదివేల మందితో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. చల్లపల్లి ప్రధాన సెంటర్లో 216 జాతీయ రహదారిని దిగ్బంధించారు.
రెండుగంటల పాటు ఆందోళన చేపట్టడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. సమైక్యాంధ్ర నినాదాలతో ఈ ప్రాంతం మార్మోగింది. జగ్గయ్యపేటలో జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. ముక్త్యాలలో ఉద్యోగ జేఏసీ సంఘ ఆధ్వర్యంలో వంటావార్పు, ర్యాలీలు, మానవహారం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వత్యవాయి మండలంలోని మక్కపేటలో గ్రామస్తులు, విద్యార్థులు మానవహారాన్ని నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కైకలూరు తాలూకా సెంటర్లో జేఏసీ ఆధ్వర్యంలో 13వ రోజు రిలే దీక్షల్లో పీఈటీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అక్కడే ఉదయం రహదారిపై ధ్యానం చేశారు.
బార్ అసోసియేషన్ సభ్యులు మోకాళ్లపై నడిచారు. కలిదిండిలో జేఏసీ ఆధ్వర్యంలో రెండువేల మందితో భారీ ర్యాలీ జరిగింది. ముదినేపల్లిలో జూనియర్ కళాశాల అధ్యాపకులు రోడ్డుపై పాఠాలు చెప్పారు. ఉపాధ్యాయులు ర్యాలీ చేశారు. మైలవరంలో ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ ర్యాలీ నిర్వహించి మైలవరంలోని ప్రధాన వీధుల్లో తిరిగి రాష్ట్రం విడిపోతే వచ్చే ఇబ్బందులను ప్రజలకు తెలియజేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆర్టీసీ ఉద్యోలు రిలే దీక్షలో పాల్గొన్నారు. మైలవరంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. సమైక్యాంధ్ర కోసం జి.కొండూరు జాతీయ రహదారిపై పులివాగు వద్ద ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. నందిగామ గాంధీ సెంటర్లో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల్లో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తెలంగాణ న్యాయవాదుల దాడిని నిరసిస్తూ గుడివాడలో జేఏసీ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలో ఆర్టీసీ జేఏసీ మహిళా కండక్టర్లు పాల్గొన్నారు. విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, వంటావార్పు నిర్వహించారు. ఆర్టీవో జేఏసీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆటోలు, కార్లతో ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేశారు. పట్టణంలో న్యాయవాదులు న్యాయదేవిత విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.
విజయవాడలో..
విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో దుర్గాఘాట్‌లో జలదీక్ష నిర్వహించారు. విద్యార్థి జేఏసీ కన్వీనర్ దేవినేని అవినాష్ పిలుపు మేరకు నగరంలోని వివిధ కళాశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థులు ఈ దీక్షలో పాల్గొన్నారు. 13 జిల్లాల సహకార సిబ్బంది వేలాదిగా సహకార బ్యాంకు నుంచి ర్యాలీ చేశారు. 28న లక్షమంది విద్యార్థులతో సమైక్య విద్యార్థి గర్జన నిర్వహించాలని విద్యార్థి జేఏసీ నిర్ణయించింది.