గాలి జనార్దనరెడ్డికి ఐటీ నోటీసులు
రికార్డుల పరిశీలన
బెంగళూరు/సాక్షి, బళ్లారి: కోట్లు ఖర్చు పెట్టి కూతురి పెళ్లిని వైభవంగా నిర్వహించిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డికి ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోమవారం నోటీసులు జారీ చేశారు. అలాగే జనార్దన రెడ్డికి సంబంధించిన కార్యాలయాలపైనా ఐటీ అధికారులు దాడులు చేశారు. బెంగళూరు, హుబ్బళ్లి నుంచి బళ్లారికి వచ్చిన అధికారులు ముందుగా ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ), అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీ (ఏఎంసీ) కార్యాలయాల్లో రికార్డులు పరిశీలించారు. అనంతరం గాలి జనార్దనరెడ్డి నివాసానికి వెళ్లి నోటీసులిచ్చారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఏం కొన్నారు? ఎవరి దగ్గర కొన్నారు? అనే ప్రశ్నావళిని జనార్దన రెడ్డికి ఇచ్చారు.
ఈ నెల 25 లోపు సమాధానాలు చెప్పాలని ఆదేశించారు. అలాగే పెళ్లిలో అలంకరణ, వంటకాలు, వీడియో ఫొటోగ్రఫీ పనులు చూసుకున్న 10 ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థల కార్యాలయాల్లోనూ సోదాలు చేశారు. వీటిలో 7 బెంగళూరులో ఉండగా, 3 హైదరాబాద్కు చెందినవి. దాడుల విషయం తెలుసుకుని మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బళ్లారికి చేరుకున్న జనార్దనరెడ్డి ఇక్కడ ఉండేందుకు కోర్టు గడువు ముగియడంతో పెళ్లి కార్యక్రమాలు ముగించుకుని రాత్రి బెంగళూరుకు వెళ్లారు.