మయన్మార్ ఆపరేషన్ వీరులకు శౌర్య పతకాలు
ఇద్దరికి కీర్తిచక్ర, 10 మందికి శౌర్య చక్ర
న్యూఢిల్లీ: మణిపూర్‌లో దొంగదెబ్బతో సైనికులను బలితీసుకున్న ఉగ్రమూకలను మయన్మార్‌లోకి వెళ్లి మరీ హతమార్చిన 21 పారా రెజిమెంట్‌కు చెందిన 8 మంది సాహస జవాన్లను శౌర్య పతకాలు వరించాయి. మరో ఇద్దరికి కీర్తిచక్ర, 10 మందికి శౌర్య చక్ర పురస్కారాలు లభించాయి. మయన్మార్‌లో నక్కిన ఉగ్రవాదులను హతమార్చిన భారత బృందానికి నేతృత్వం వహించిన 21 పారాచూట్ రెజిమెంట్‌కు చెందిన లెఫ్ట్‌నెంట్ కల్నల్, శౌర్య చక్ర అవార్డు గ్రహీత నెక్టార్ శాన్‌జెన్‌బామ్‌ను, జమ్మూకశ్మీర్‌లో గత అక్టోబరులో ఉగ్రవాదులతో వీరోచిత పోరులో నేలకొరిగిన సుబేదార్ రాజేశ్‌కుమార్‌ను(మరణానంతరం) కీర్తిచక్ర వరించింది. 21 పారా రెజిమెంట్‌కు చెందిన 10 మందికి శౌర్య చక్ర పురస్కారాలు లభించాయి.
వీరితో సహా విధి నిర్వహణలో అసమాన ధైర్యం ప్రదర్శించిన మొత్తం 67 మంది జవాన్లు గ్యాలంటరీ అవార్డుల(శౌర్య పురస్కారాలు)కు ఎంపికయ్యారు. వీరందరి పేర్లను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం ఆమోదించారు. ఈ ఏడాది భారత్ తీరం వైపు వచ్చిన పాక్ పడవ మునిగిపోవడంలో కీలక పాత్ర పోషించిన కోస్ట్‌గార్డ్ కమాండెంట్, కమాండర్లను కూడా గ్యాలంటరీ అవార్డులు వరించాయి. అయితే, ఆ పడవను పేల్చేయాలని తానే ఆదేశించినట్లు కోస్ట్‌గార్డ్ డీఐజీ బీకే లోషాలీ చెప్పగా, పాక్ సిబ్బందే తమ పడవను కాల్చేశారని ప్రభుత్వం చెప్పడంతో ఈ అంశం వివాదాస్పదం అయింది.
కాగా యెమెన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను కాపాడేందుకు చేపట్టిన ఆపరేషన్‌కు తోడ్పడిన ముగ్గురు నేవీ అధికారులూ సాహస పురస్కారాలకు ఎంపికయ్యారు. మొత్తంగా 49 మందికి సేనా పతకాలు, ఇద్దరికి నవో సేనా పతకాలు, ముగ్గురికి వాయు సేనా పతకాలు లభించాయి. ఫ్లైట్ లెఫ్ట్‌నెంట్ గండికోట జగన్ మోహన్‌ను వాయు సేనా పతకం(గ్యాలంటరీ) వరించింది. మరో 20 మంది సేవా పతకాలకు ఎంపికయ్యారు. కాగా, యాంటీ నక్సల్ ఆపరేషన్లలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన జార్ఖండ్ పోలీసు అదనపు ఎస్పీ, సీఆర్పీఎఫ్ అధికారి ప్రకాశ్ రంజన్ మిశ్రా మళ్లీ గ్యాలంటరీ అవార్డు(పోలీసు మెడల్)కు ఎంపికయ్యారు. పోలీసు లేదా పారా మిలటరీ బలగాల నుంచి ఏడోసారి సాహస పురస్కారం పొందిన ఏకైక వ్యక్తిగా రంజన్ నిలిచారు.