శ్రీకాంత్ x కశ్యప్
మారిన్‌తో సైనా తుదిపోరు
లక్నో: సయ్యద్ మోడి స్మారక ఇండియన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ టైటిల్ భారత ఆటగాళ్ల ఖాతాలోకే చేరనుంది. హైదరాబాద్‌కే చెందిన ఇద్దరు అగ్రశ్రేణి క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్ ఆదివారం జరిగే టైటిల్ పోరుకు సిద్ధమయ్యారు. గతేడాది రన్నరప్‌గా నిలిచిన శ్రీకాంత్ వరుసగా రెండో ఏడాది ఫైనల్లోకి దూసుకెళ్లడం విశేషం. 2012లో చాంపియన్‌గా నిలిచిన కశ్యప్ రెండోసారి అంతిమ సమరానికి సిద్ధమయ్యాడు.
శనివారం జరిగిన సెమీఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ ఐదో ర్యాంకర్ శ్రీకాంత్ 12-21, 21-12, 21-14తో ప్రణయ్ (భారత్)పై నెగ్గగా... మూడో సీడ్, ప్రపంచ 15వ ర్యాంకర్ కశ్యప్ 18-21, 22-20, 21-7తో రెండో సీడ్, ప్రపంచ 10వ ర్యాంకర్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)ను ఓడించాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ శ్రీకాంత్, కశ్యప్ తొలి గేమ్ కోల్పోయి తర్వాతి రెండు గేములను సొంతం చేసుకోవడం విశేషం.
మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సైనా నెహ్వాల్ (భారత్), ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) మధ్య టైటిల్ పోరు జరుగనుంది. సెమీఫైనల్స్‌లో టాప్ సీడ్ సైనా 21-10, 21-16తో నిచావోన్ జిందాపోన్ (థాయ్‌లాండ్)పై గెలుపొందగా... మూడో సీడ్ పి.వి.సింధు 13-21, 13-21తో మారిన్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయింది. మారిన్ చేతిలో సింధుకిది వరుసగా మూడో పరాజయం కావడం గమనార్హం. గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మారిన్ చేతిలోనే సింధు ఓడిపోయింది.
జ్వాల జంట ఓటమి
మహిళల డబుల్స్ సెమీఫైనల్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (భారత్) జంట 16-21, 21-19, 21-13తో అమిలియా అలిసియా-ఫీ చో సూంగ్ (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సుమిత్ రెడ్డి-మనూ అత్రి (భారత్) ద్వయం 12-21, 18-21తో ఇవనోవ్-సొజొనోవ్ (రష్యా) జంట చేతిలో ఓటమి పాలైంది. మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో కె.మనీషా-మనూ అత్రి (భారత్) జంట 24-22, 21-19తో డ్రెమిన్-దిమోవా (రష్యా) జోడీని ఓడించి ఫైనల్‌కు చేరింది.