డిప్యూటీ మేయర్ కుమారుల వీరంగం
అనంతపురం సెంట్రల్: నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ గంపన్న కుమారులు వీరంగం సృష్టించారు. కొంతమంది పోకిరీలను వెంట బెట్టుకుని తాగి గొడవ చేస్తుండడంతో అడ్డుకునేందుకు ప్రయత్నించిన ముగ్గురు యువకులపై ఇష్టానుసారంగా దాడి చేశారు. ఈ ఘటన బుధవారం రాత్రి విద్యుత్‌నగర్ సర్కిల్ సమీపంలో చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు... డిప్యూటీ మేయర్ గంపన్న కుమారులు రఘు, ధను మరో పదిమంది యువకులను వెంట బెట్టుకొని విద్యుత్‌నగర్ సర్కిల్ ప్రాంతంలో హల్చల్ చేశారు.
సమీపంలోని క్యాంటీన్ నిర్వాహకుడు రాజేష్ వారిని వారించాడు. తాగి గొడవ చేస్తుండటంతో వారిని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించాడు. దీంతో డిప్యూటీ మేయర్ కుమారులు రెచ్చిపోయారు. మమ్మల్నే పొమ్మనే వాడివా అంటూ కట్టెలు, రాడ్లతో దాడికి తెగబడ్డారు. తొలుత రాజేష్‌పై దాడి చేస్తుండగా గమనించిన రాజేష్ సోదరులు ప్రకాష్, ముఖేష్‌లు అడ్డుకోబోయారు. దీంతో ప్రకాష్ తలపై బండతో దాడి చేయడంతో తీవ్రరక్తస్రావమైంది. ఈ ఘటనలో అన్నదమ్ములు ముగ్గురికీ తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ముగ్గురినీ కుటుంబ సభ్యులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తాగి గొడవ చేస్తుండగా వారించినందుకు తమపై గంపన్న కుమారులు, మరికొంతమంది యువకులను వెంట బెట్టుకొని వచ్చి దాడికి పాల్పడ్డారని బాధితులు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. క్యాంటీన్లోని ఫర్నీచర్, ఇతర వస్తువులను కూడా ధ్వంసం చేశారని తెలిపారు. టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.