సత్యసాయి మృతిపై సీబీఐ విచారణ
సమీప బంధువు గణపతిరాజు డిమాండ్
సత్యసాయిది హైటెక్ మర్డర్
ఏపీ సీఎం, పీఎంకి లేఖలు
సాక్షి, హైదరాబాద్: సత్యసాయి బాబా(పుట్టపర్తి సాయిబాబా) మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని బాబా సమీప బంధువు ఎం.గణపతిరాజు డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సత్యసాయి మార్చి 29న మృతి చెందితే, ఏప్రిల్ 24న ఆరాధన దినోత్సవాలు జరపటం ఏమిటని ప్రశ్నించారు. సత్యసాయిబాబాది సహజ మరణం కాదని, వెల్ ప్లాన్డ్ హైటెక్ మర్డర్ అని, అందుకే తాము సీబీఐ విచారణ కోరుతున్నామని అన్నారు. ఆ మేరకు ఏపీ సీఎం చంద్రబాబుకు, ప్రధాని మోదీకి లేఖలు రాశామని తెలిపారు. బాబా మృతి సంఘటనలోని దోషులకు అదృశ్యశక్తుల అండదండలు ఉన్నాయని, బాబాకు సంబంధించిన వేల కోట్ల రూపాయల ఆస్తులు తరలించాయని ఆరోపించారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించాలని కోరిన తనపై రెండుసార్లు దాడులు జరిగాయని గుర్తు చేశారు. సత్యసాయి మృతికి సంబంధించి ఆధారాలు కొన్ని తన దగ్గర ఉన్నాయని చెప్పారు. సమావేశంలో రవి, న్యాయవాది సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.