జిల్లా వ్యాప్తంగా వర్షాలు
విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. విజయనగరం పట్టణంతో పాటు కురుపాం, నెల్లిమర్ల, గజపతినగరం తదితర ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురిశాయి. మిగతా ప్రాంతాల్లో చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. వర్షాలకు జిల్లా కేంద్రంలోని లెంక వీధిలో ఓ ఇంటి మట్టిగోడ నానిపోయి కూలిపోయింది. మధ్యాహ్నం భోజనం చేసి నిద్రిస్తున్న ఇంటి యజమాని తుంపల్లి గణపతిరావు(40) పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మృతుడి సోదరితో పాటు భార్య పద్మకు గాయలయ్యాయి.
జిల్లా కేంద్రమైన విజయనగరంలో మధ్యాహ్నం రెండు సార్లు వర్షం పడింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఒక సారి భారీ వర్షం కురవగా గంట పోయాక మరో సారి పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహన చోదకులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయాయరు. చిరు వ్యాపారులు నష్టపోయారు. నెల్లిమర్ల, గజపతినగరంలో కూడా విడతల వారీగా భారీ వర్షం కురిసింది. బొబ్బిలి, పార్వతీపురాలలో చిరుజల్లులు కురిశాయి. విజయనగరం మున్సిపాలిటీ: పట్టణంలో కురిసిన మోస్తరు వర్షం ప్రయాణీకులకు తీవ్ర అటంకం కలిగించింది. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సుమారు 45 నిమిషాల పాటు కురిసి వర్షంతో అన్ని లోతట్టు ప్రాంతాలు ఎప్పటిలానే జలమయమయ్యాయి. ప్రధానంగా మున్సిపల్ కార్యాలయం రోడ్ నుంచి గంటస్థంభం జంక్షన్ వరకు అలానే ప్రకాశం వరకు వరద నీరు రహదారులపై ప్రవహించటంతో అటుగా రాకపోకలు సాగించే వారు ఇబ్బందులు పడ్డారు.
సుమారు గంట సమయం వరకు వరద నీరు నిల్వ ఉండిపోవటంతో తప్పని సరి పరిస్థితుల్లో అదే నీటిలో వాహనచోదకులు రాకపోకలు సాగించారు. వర్షం కురిసి ఆగిపోయిన కొద్ది సమయంలోనే అటుగా వచ్చిన అగ్నిమాపక యంత్రం కూడా అదే నీటిలో వెల్లాల్సి వచ్చింది. నిత్యం ఇదే తరహాలో పరిస్థితి ఉన్నా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవటంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాకపోకలు సాగించాల్సి వస్తుందని ప్రయాణీకులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా వర్షం కారణంగా మున్సిపల్ కార్యాలయం జంక్షన్లో వ్యాపారాలు చేసుకునే చిల్లర వర్తకులు సరుకులు నీట పాలయ్యాయి.