gandepalli road accident
-
పబ్లిసిటీని బట్టి పరిహారమిస్తారా?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘ప్రాణం ఎవ్వరిదైనా ఒక్కటే.. పరిహారం విషయంలో ప్రభుత్వ విధానం ఒక్కటే అయ్యుండాలి.. అంతేకానీ, పబ్లిసిటీ వస్తుందంటే ఒకలా లేదంటే మరోలా పరిహారం ప్రకటిస్తే ప్రతిఘటన తప్పదు...’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గండేపల్లి వద్ద లారీ బోల్తా పడ్డ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. పరిహారం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని దుయ్యబట్టిన జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే... ఉపాధి లేకే వలసలు... ‘‘ఉపాధి పనుల్లేక గ్రామాల్లో బతకలేక వలస వెళ్లిన కూలీలు ఇంటికి తిరిగొస్తూ ప్రమాదం బారిన పడ్డారు. ఉపాధి పనుల్లో రూ.30 నుంచి రూ.80 ఇచ్చినా గిట్టుబాటు కావట్లేదు. బతకడానికి వేరే గత్యంతరం లేక గ్రామాల నుంచి బయటకెళ్లి పనులు చేసుకుంటున్నారు. అలా వెళ్లిన మెట్ట ప్రాంత కూలీలు తిరుగు ప్రయాణంలో గుంటూరు జిల్లా దాచేపల్లి నుంచి సిమెంట్ తయారీకి ఉపయోగించే ముడిసరుకుతో వస్తున్న లారీ ఎక్కి ప్రాణాలు పోగొట్టుకున్నారు. పబ్లిసిటీ వస్తుందంటేనే భారీ పరిహారం: ఏమయ్యా.. చంద్రబాబుగారూ! మీకు పబ్లిసిటీ వస్తుం దంటే నష్టపరిహారం భారీగా ప్రకటిస్తావు. గోదావరి పుష్కరాల్లో నీవు మేకప్ వేసుకుని సినిమా షూటింగ్ కోసం మనుషులను చంపేస్తే రూ.10 లక్షలు ఇస్తావు. పాపం ఆ పాపను చూడు (దేవి అనే బాలికను చూపిస్తూ).. హ్యాండికాప్డ్.. వాళ్ల నాన్న చనిపోయాడు. బతకడానికి వేరొక ఆధారం లేదు. పనిచేస్తే కానీ పూట గడవని కూలీ కుటుంబం. అలాంటి పేదవారంతా నువ్వు ఉపాధి పనులు చూపకపోవడంతో, బతకడానికి వేరే మార్గం లేక బయట ప్రాంతాలకు వెళ్లారు. తిరిగొస్తూ లారీ ఎక్కి ప్రమాదానికి గురైతే ఎందుకు తక్కువ నష్టపరిహారం ప్రకటించారు? అదీ నేను వస్తున్నానని తెలిసి 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు పరామర్శకు వచ్చినా బాధితులకు ఎలాంటి సహాయమూ ప్రకటించలేదు. మృతదేహాలను చూసెళ్లిపోయారంతే. ఏ ప్రమాదంలో చని పోయినా నష్టపరిహారం విషయంలో ప్రభుత్వ పాలసీ మారకూడదు. ఈ ప్రమాదం విషయంలోనూ ప్రభుత్వ పాత్ర ఉంది కాబట్టి తగిన పరిహారం ఇవ్వాలి. లేకపోతే దీనిపై కోర్టులో పిటిషన్ వేస్తాం. ఎందుకంత భయం: మృతులకు సంబంధించిన వాళ్లంతా ఇక్కడే ఉన్నారు. కానీ మృతదేహాలను ఊళ్లకు తరలించారు. నేను వస్తున్నానని తెలిసి, పరిహారం ఎక్కువగా చెల్లించాల్సి వస్తుందని మృతదేహాలను కనీసం కుటుంబసభ్యులకు అప్పగించకుండా, వారికి తెలియకుండా వారి ఊర్లకు తరలించేశారు. ఒక్కో వాహనంలో మూడేసి మృతదేహాలను కుక్కేశారు. ఎందుకీ హడావుడి తరలింపు? ఎందుకంత భయం? చంద్రబాబు చేస్తున్న పనుల్లో ఇంతకన్నా దుర్మార్గం ఇంకొకటి ఉండదు. ఇప్పటికైనా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి. ఈ ప్రమాదంలో గాయపడినవారు తర్వాత పనుల కెళ్లలేని పరిస్థితి ఉంటుంది. అందుకే వారికి కేవలం ప్రథమ చికిత్స చేసి పంపేయకుండా రూ.2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించాలని చంద్రబాబును డిమాండు చేస్తున్నా. అంతా అవినీతిమయం ఇసుక నుంచి మట్టి దాకా, పట్టిసీమ నుంచి పోలవరం దాకా చంద్రబాబు అవినీతికి పాల్పడుతున్నారు. ఇంత దారుణం దేశంలో ఎక్కడా చూడలేదు. ఇలా సంపాదించిన డబ్బుతో తెలంగాణలో ఎమ్మెల్యేని కొనబోయి ఆడియో, వీడియోలతో పట్టుబడ్డారు. ఆ ‘ఓటుకు కోట్లు’ కేసు నుంచి బయటపడటానికి రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను సైతం పణంగా పెట్టేశారు. అలా రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్న చంద్రబాబు ఒక్కరోజు కూడా సీఎం సీటులో కూర్చోవడానికి అర్హుడు కారు’’ అని అన్నారు. -
అండగా ఉంటా..
మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ ఓదార్పు ఆర్యాపురం/దానవాయిపేట (రాజమండ్రి): గండేపల్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కూలీల కుటుంబసభ్యులను, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను చూసి వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించిపోయారు. అధైర్యపడొద్దని, అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించకుండా, కనీసం వారి సంతకాలైనా తీసుకోకుండా పోలీసులు బలవంతంగా గ్రామాలకు తరలించారని తెలుసుకున్న జగన్.. మరీ ఇంత ఘోరమా అని ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి ఆవరణలో నిరసనకు దిగిన మృతుల కుటుంబాలకు సంఘీభావం ప్రకటించారు. శృంగవరానికి చెందిన మృతుడు కల్లు బాబ్జీ(20) తల్లి నూకరత్నం జగన్‌ను చూసి బోరున విలపించింది. ‘వృద్ధాప్యంలో పోషిస్తున్న ఒక్కగానొక్క కొడుకూ చనిపోయాడు. నాకేది ఆధారం?’ అంటూ కన్నీరుమున్నీరైంది. ఆమెను ఓదారుస్తూ ప్రభుత్వం నుంచి పూర్తి పరిహారం వచ్చేంతవరకు అండగా ఉంటానని జగన్ భరోసానిచ్చారు. అంతకు ముందు ఈ ఘోర దుర్ఘటన విషయం తెలిసి చలించిన జగన్ హైదరాబాద్ నుంచి విమానంలో సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి వచ్చి ప్రమాద మృతుల కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. కుటుంబీకులు ఆసుపత్రిలో.. మృతదేహాలు ఊళ్లకు ఈ దుర్ఘటనలో మృతి చెందిన తమ తండ్రి కట్టా రాంబాబు(45) ముఖం కూడా చూపించకుండానే పోస్టుమార్టం చేసి ఊరికి తీసుకువెళ్లిపోయారంటూ వి.జె.పురానికి చెందిన దేవి, వెంకట్రావు జగన్ వద్ద రోదించారు. తాము ఇక్కడ ఉండగానే తమకు కనీసం సమాచారం అందించకుండా మృతదేహాన్ని ఊరికి తెసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని తెలుసుకుని చలించిన జగన్ వారిని ఓదారుస్తూ రక్తసంబంధీకుల సంతకాలు చేయించకుండా పోస్టుమార్టం ఎలా చేశారని ప్రశ్నించారు. మీరొస్తున్నారనే సెలైన్ పెట్టారు: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను జగన్ పరామర్శించారు. వారిని అడిగి సంఘటన జరిగిన తీరును తెలుసుకున్నారు. అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. పలువురు క్షతగాత్రులు ‘మీరొస్తున్నారని తెలిసిన తరువాతే దుప్పట్లు మార్చి సెలైన్లు పెట్టారు’ అని చెప్పారు. మరోవైపు ఈ దుర్ఘటనలో గాయపడ్డ అచ్చంపేటకు చెందిన పురందాసు రాజును బొల్లినేని ఆస్పత్రికి తరలించారు. క్యాజువాలిటీలోనే ఉంచారు. చేతి నుంచి రక్తం కారుతున్నప్పటికీ ఎలాంటి చికిత్స చేయలేదు. ఈ సమయంలో అతన్ని పరామర్శించేందుకు జగన్ వస్తున్నారని తెలుసుకున్న ఆస్పత్రి సిబ్బంది హుటాహుటిన అతన్ని ఏసీ రూమ్‌కు తరలించారు. రాజును పరామర్శించిన జగన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
గండేపల్లి ప్రమాద బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
-
రాజమండ్రికి బయల్దేరిన వైఎస్ జగన్
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజమండ్రికి బయల్దేరారు. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆయన పరామర్శిస్తారు. కాగా క్షతగాత్రులు రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలను కూడా వైఎస్ జగన్ పరామర్శిస్తారు. ఈ దుర్ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపారు. మరోవైపు గండేపల్లి ప్రమాదం జరిగిన విషయం తెలియగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యల్లో పాల్గొన్నారు. పార్టీ నేత జ్యోతుల నెహ్రూ నుంచి ప్రమాద వివరాలను వైఎస్ జగన్ తెలుసుకుంటున్నారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని, బాధితులకు అవసరమైన సహాయం అందించాలని పార్టీ నేతలను జగన్ ఆదేశించారు.