సోషల్ షబానా
షబానా ఆజ్మీ, నటి, సోషల్ వర్కర్
జన్మదినం : 18 సెప్టెంబర్ 1950
జన్మస్థలం : హైదరాబాద్ (పెరిగింది ముంబై)
తల్లిదండ్రులు : కైఫీ ఆజ్మీ, షౌకత్ ఆజ్మీ
సోదరుడు : బాబా ఆజ్మీ
భర్త : జావెద్ అఖ్తర్
అవార్డులు : అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు
ముఖ్య పురస్కారం : గాంధీ ఇంటర్నేషనల్ పీస్ అవార్డు
నిన్నటితో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ముగిసింది. ఇండియా నుంచి సినిమాలేమీ వెళ్లలేదు. సోనమ్ కపూర్, ఐశ్వర్యా రాయ్, శ్రుతీ హాసన్, దీపికా పడుకోన్ మాత్రం వెళ్లారు. అందరి కళ్లూ వాళ్ల డ్రెస్‌ల మీదే. మీడియా దృష్టీ వాళ్ల మీదే. ఫెస్టివల్ మొదలవడానికి ముందు షబానా ఆజ్మీ ట్విట్టర్లో 1976 నాటి తన కాన్స్ ఫొటోను పోస్ట్ చేశారు. ఆ ఫొటోలో షబానా, శ్యామ్ బె¯ð గల్, స్మితా పాటిల్ ఉన్నారు. ‘నిషాంత్’ సినిమా ప్రమోషన్ కోసం వీళ్లు ముగ్గురూ కాన్స్ వెళ్లినప్పటి ఫొటో అది! ఫొటో పోస్ట్ చేసి ఊరుకోలేదు షబానా. దాని కింద చిన్న కామెంట్ పెట్టారు. ‘సినిమా ముఖ్యం. బట్టలు కాదు’ అన్నది ఆ కామెంట్.
కాన్స్ ఫెస్టివల్ జరిగిన ఈ పదిహేను రోజులూ బాలీవుడ్‌ను ఈ కామెంట్ ముల్లులా గుచ్చుతూ ఉంది! వింతేం లేదు. షబానా అభిప్రాయాలెప్పుడూ ముల్లులానే ఉంటాయి. అయితే ముల్లును తీసే ముల్లు మాత్రమే షబానా. ఆమె కామెంట్ చెడును తొలగిస్తుంది. మంచిని చేస్తుంది. అయితే షబానాను ఒక్క మాటతోనో, ట్వీట్‌తోనో పూర్తిగా అర్థం చేసుకోలేం. కొంత ముందుకూ, కొంత వెనక్కూ వెళ్లాలి. జీవితానికి ఎన్ని సాధారణ అర్థాలైనా ఉండొచ్చు. అసాధారణమైన అర్థం మాత్రం... షబానా ఆజ్మీ! సంతృప్తి పరిచే సమాధానాలు ఎన్నైనా లభించవచ్చు. ఆలోచన రేపే ఆన్సర్ మాత్రం... షబానా ఆజ్మీ.
‘మనుషులు కాని వాళ్లెవరూ మా ఇంటి తలుపు తట్టేందుకు వీల్లేదు’ అన్నట్లుంటుంది ముంబైలోని షబానా ఇల్లు.‘గర్వంగా, గౌరవంగా చెప్పుకో... నేను మనిషినని’ అనే అర్థం వచ్చేలా అక్షరాలను పొదిగి ఉన్న శిలాఫలకం ఆమె ఇంటి బయట గోడలో ఒక భాగమై ఉంటుంది. షబానా మాట కూడా ఇంతే. ఘాటు! ‘సమాజానికి ఏదైనా ఇవ్వు’ అని డిమాండింగ్‌గా అడుగుతారు షబానా. ఆ హక్కు ఎక్కడి నుంచి వచ్చిందామెకు? తల్లి కడుపులోంచి వెంట తెచ్చుకుందా? తండ్రి బిగించిన పిడికిలి వేళ్లను విప్పదీసి లాక్కుందా? షబానా తండ్రి కైఫీ ఆజ్మీ... కమ్యూనిస్టు. తల్లి షౌకత్ ఆజ్మీ... కమ్యూనిస్టు. తండ్రి కవి, తల్లి రంగస్థల నటి అవడం రెండో మాట. మొదటైతే కమ్యూనిస్టులు. వాళ్ల పిల్ల షబానా.
సహాయం కోసం, సలహా కోసం, సానుభూతి కోసం, ఓదార్పు కోసం, సంప్రదింపుల కోసం, చర్చల కోసం వస్తుండే సామాన్యులు, సుప్రసిద్ధులు, కళాకారులు నిత్యం మసులుతుండే ఆ నట్టింట్లో వాళ్లతో కలిసి తిరుగుతుండే పిల్ల... షబానా! అందుకే ఆమెలో ఇంత సోషల్ కాన్షస్నెస్. జీవితం, సినిమా ఒకటి కాదు. కానీ షబానాకు అవి రెండూ వేరు కాదు. జీవితానికి దగ్గరగా ఉండే సినిమాలనే ఆమె ఎంచుకున్నారు. సమాజానికి సందేశాన్నిచ్చే చిత్రాలను మాత్రమే అంగీకరించారు. పాయలు పాయలుగా విడిపోయిన జీవితం షబానాది. ఒక పాయ సినిమా. ఒక పాయ సేవ. ఇంకో పాయ ఉద్యమం. అంతర్ ప్రవాహంగా మరో పాయ... జావెద్ అఖ్తర్. ఆమె భర్త!
సిల్వర్ స్క్రీన్
సినిమాల్లోకి రావడానికి షబానాకు జయబాధురి ఇన్స్పిరేషన్. జయ నటించిన పదమూడున్నర నిమిషాల నిడివిగల చిత్రం ‘సుమన్’ షబానా ఆలోచననే మార్చేసింది. సెయింట్ జేవియర్స్ కాలేజ్‌లో సైకాలజీ పట్టాతో బయటికి వచ్చిన షబానాను పుణె బండి ఎక్కించి, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ క్లాసురూమ్‌లో కూర్చోబెట్టింది. ‘యాక్టింగ్‌లో ట్రెయినింగ్ తీసుకుంటే జయలా నటించడం సాధ్యమయ్యే పనైతే వేరే కోర్సు ఎందుకు చెయ్యాలి’ అనుకునేంతగా జయ నటన ఆమెను లోబరుచుకుంది. నటిస్తే జయలా నటించాలి. అదీ షబానా ఎయిమ్. 1972 బ్యాచ్ పుణె ఇన్స్టిట్యూట్ ఫిల్మ్ కోర్సు టాపర్ల జాబితాలో షబానా పేరు అందరికన్నా టాప్‌లో ఉంది. ఇప్పటికీ ఈ 2017లోనూ, ఈ 66 ఏళ్ల వయసులోనూ తనే టాప్.. తనదైన విలక్షణతలో, వైవిధ్యంలో.
నాలుగు దిక్కులు
జావెద్ అఖ్తర్ : భర్త, హితుడు, స్నేహితుడు, షబానా ప్రేమికుడు! తన తల్లిదండ్రుల తర్వాత షబానాకు అన్ని విషయాల్లోనూ దిశానిర్దేశం చేసిన ఆప్తుడు. అంతరంగం తెలిసినవాడు. ఫెమినిస్టు. ఆయన సమక్షంలో షబానా ఎప్పుడూ సంతోషంగా ఉంటారు.
శ్యామ్ బెనగల్ : షబానా మొదటి సినిమా డైరెక్టర్. ఈయనతో కలిసే షబానా తొలిసారిగా విదేశీ ప్రయాణం చేశారు. షబానా నటించిన ప్రతి సినిమాకు శ్యామ్ చక్కటి విమర్శకుడు. శ్యామ్‌ను షబానా గురువులా భావిస్తారు. కానీ శ్యామ్... నువ్వు నీ ఫీల్డులో, నేను నా ఫీల్డులో ఇద్దరం సమానమే అంటారు.
జెన్నిఫర్ కపూర్ : శశికపూర్ భార్య. ఈవిడంటే షబానాకు ఆరాధన. ఇద్దరి భావాలూ ఒక్కటే. ఫ్రెండ్లీగా ఉంటారు.
సుభాషిణి అలీ : ముజఫర్ అలీ మొదటి భార్య. ఉద్యమకారిణి. కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలు. షబానా సినిమాల్లోకి వచ్చిన కొత్తలో సుభాషిణి క్రియాశీల కార్యకర్తగా సామాజిక సమస్యలపై పోరాడుతూ కనిపించేవారు. పోలీసులు తరచూ ఆమెను అరెస్ట్ చేసి తీసుకెళుతున్నప్పుడు షబానా ఆశ్చర్యంగా చూసేవారు.
డయానా ప్యాలెస్‌లో షబానా
షబానా ఆజ్మీ నటించిన తాజా చిత్రం ‘ది బ్లాక్ ప్రిన్స్’ జూలై 21న ఇంగ్లిష్, హిందీ, పంజాబీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. ఇందులో షబానా రాజమాత జిందాగా నటిస్తున్నారు. బ్రిటిష్ ఇండియాలో పంజాబ్ చివరి రాజు మహారాజా దులీప్ సింగ్‌కి, రాణి విక్టోరియాకు మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని, ఇతర అంశాలను కథాంశంగా తీసుకుని భారత సంతతి బ్రిటన్ దర్శకుడు కవి రజ్ నిర్మిస్తున్న ఈ బయోపిక్‌లో షబానాపై ముఖ్య సన్నివేశాలను ఇటీవలే ఇంగ్లండ్‌లోని ప్రిన్సెస్ డయానా ప్యాలెస్‌లో చిత్రీకరించారు. మహారాజా దులీప్ సింగ్‌గా ప్రముఖ సూఫీ సింగర్, కంపోజర్, సాంగ్ రైటర్ సతీందర్ సర్తాజ్ నటిస్తున్నారు. ఆయన తల్లిగా షబానా నటిస్తున్నారు. తొలిసారి 1974లో శ్యాం బెనగల్ ‘అంకుర్’తో షబానా నటి అయ్యారు. నలభై రెండేళ్ల తర్వాత, వందకు పైగా సినిమాల తర్వాత కూడా ఇప్పటికీ ఆమెలో అదే ఉత్సాహం. అదే పవర్. అదే ఎనర్జీ.
సోషల్ స్క్రీన్
మనుషులంతా ఒక్కటే అయినప్పుడు మతాలు వేరైతే మాత్రం ఏమిటి? అందరం కలిసి ఉండలేమా? షబానా వేసిన సూటి ప్రశ్నలివి. 1989లో స్వామి అగ్నివేశ్, అస్ఘర్ అలీ ఇంజనీర్లతో కలిసి ఆమె న్యూఢిల్లీ నుంచి మీరట్ వరకు నాలుగు రోజుల పాటు మత సామరస్య యాత్ర చేపట్టారు. అగ్నివేశ్ హైందవ ధర్మ కార్యకర్త. అస్ఘర్ అలీ భారతీయ ముస్లిం. సామాజిక సంస్కరణలవాది. వేర్వేరు ధ్రువాలు. వేర్వేరు భావనలు. అంతస్సూత్రం ఒకటే... సద్భావన! కలిసుందాం అన్న ప్రతిన! యాత్ర ప్రశాంతంగా ముగిసింది. రెచ్చగొట్టే పిలుపుల వల్ల, ప్రసంగాల వల్ల చివరికి బలయ్యేది అమాయకులేనని షబానా ఎన్నో సందర్భాలలో అతివాదుల్ని గట్టిగా అదుపు చేయడానికి ప్రయత్నించారు.
సర్వీస్ స్క్రీన్
ఎయిడ్స్ గురించి మనం చెబుతున్న మంచిచెడ్డలన్నీ ఇప్పటికీ ఆ వ్యాధిగ్రస్థులకు దూరంగా నిలబడి చెబుతున్నవే. కానీ షబానా ఎయిడ్స్ వ్యాధిగ్రస్థుల దగ్గరికి వెళ్లి మాట్లాడారు. ఎయిడ్స్ కంటే ‘ఆస్ట్రసిజం’ అతి భయంకరమైన వ్యాధి అంటారు షబానా. ఆస్ట్రసిజం అంటే అంటరానితనం. ఒక ప్రభుత్వ ప్రాయోజిత లఘుచిత్రంలో హెచ్.ఐ.వి. పాజిటివ్ చిన్నారిని చేతుల్లోకి లాక్కుని ప్రేమగా గుండెకు హత్తుకున్నారు షబానా. హత్తుకుని – ‘ఈ పాపకు కావలసింది మీ తిరస్కారం కాదు. మీ ప్రేమ’’ అని చెప్పారు. ‘మేఘ్లా ఆకాశ్’ అనే బెంగాలీ చిత్రంలో కూడా ఎయిడ్స్ బాధితులకు సాంత్వన కలిగించే డాక్టర్ పాత్రలో నటించారు షబానా. అలాగే టెక్ ఎయిడ్స్ అనే సంస్థ నిర్మించిన హెచ్.ఐ.వి./ఎయిడ్స్ యానిమేషన్ కిట్‌కు స్వరాన్ని సమకూర్చారు. షబానా ధ్యేయం... సినిమాలతో గానీ, సేవారంగంతో కానీ ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించే పనిలో భాగస్వామి కావడం. షబానా మాట్లాడే ప్రతి మాటను, చేసే ప్రతి కామెంట్‌ను మనం కోణంలోంచే తీసుకోవాలి.
శాంతిదూత
షబానాకు వంట చేయడం రాదు. కానీ అప్పుడప్పుడు జావెద్‌కు ప్రేమగా వండి వడ్డింస్తుంటారు! ∙అంతర్జాతీయ గాంధీ శాంతి బహుమతిని పొందిన తొలిæ భారతీయ మహిళ షబానా ఆజ్మీ. ∙మురికివాడల ప్రజల జీవితాలలో మార్పు తెచ్చేందుకు షబానా ‘నివార హక్ సంరక్షణ సమితి’ సభ్యురాలిగా చేరారు. ∙ఆమెకు ఈ ఆలోచన కలగడానికి కారణం ఆనంద్ పట్వర్థన్ తీసిన ‘బాంబే అవర్ సిటీ’ చిత్రం. ఆ సినిమా అంతా మురికివాడల కూల్చివేతల చుట్టూ, కూలిపోయిన ఆ జీవితాల చుట్టూ తిరుగుతుంది. అది చూసి షబానా చలించిపోయారు. తండ్రీకూతుళ్లిద్దరికీ పద్మశ్రీ వచ్చిందనే మాట షబానాకు సంతోషం కలిగిస్తుంటుంది. (ఆమె తండ్రి కైఫీ ఆజ్మీ పద్మశ్రీ అవార్డు గ్రహీత) జావెద్ అఖ్తర్‌కు షబానా ఆజ్మీ రెండో భార్య. జావెద్‌కు, షబానాకు పిల్లలు లేరు, వద్దనుకున్నారు.
సూటి మాట ∙వివిధ మతాలు, భాషలు, సమాజాలు, ఆచారాలు ఉన్నట్లే... ప్రాచీన, ఆధునిక కాలాల తత్వాలు మనలో కలగలసి ఉన్నాయి. అవన్నీ కూడా స్త్రీల జీవితంపై ప్రభావం చూపుతాయి. ∙నేటికీ ఆడశిశువుల భ్రూణ హత్యలు తగ్గలేదు. మారుమూల గ్రామాలలో ఎన్ని జరుగుతున్నాయో ముంబై, గుజరాత్, హర్యానా, పంజాబ్లలోని పట్టణాలలోనూ అన్ని జరుగుతున్నాయి. కాన్పు మరణాల సంఖ్య కూడా మన దేశంలో ఎక్కువగా ఉంది. ఆడపిల్లలకు పోషకాహారం, మంచి చదువు నేటికీ ఇవ్వలేకపోతున్నాం. ఈ పరిస్థితి మారాలి.
భర్త జావెద్ అఖ్తర్‌తో షబానా ఆజ్మీ