14 నెలల చిన్నారి నేత్రదానం
రాంగోపాల్‌పేట, న్యూస్‌లైన్: పద్నాలుగు నెలల చిన్నారి.. తాను కన్ను మూస్తూ లోకాన వెలుగు నిం పింది. కంటిపాపలా చూసుకున్న తమ చిన్నారికి అప్పుడే నూరేళ్లు నిండటంతో ఆ తల్లిదండ్రులు చిన్నారి నేత్రాలను దానం చేసి ఆమె జ్ఞాపకాలను అలాగే పదిలపర్చుకున్నారు. గాంధీనగర్ నెస్లే అపార్ట్మెం ట్లో ఉండే సత్యనారాయణ, శ్రీదేవి దంపతులకు కుమారుడు, కుమార్తె సంతానం. కుమార్తె అలేఖ్య (14 నెలలు) కొద్ది రోజు లుగా జలుబు, దగ్గుతో బాధపడుతోంది. ఉన్నట్టుండి గురువారం రాత్రి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది.
వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా కొద్దిసేపటికే మరణించింది. గారాలపట్టి కళ్లెదుటే కన్నుమూయడంతో వారి వేదన వర్ణనాతీతం. ఆ బాధను దిగమింగుకుని తమ చిన్నారి మరణించినా ఆమె నేత్రాలు దానం చే సి జ్ఞాపకాలు పదిలం చేసుకోవాలని భావించి తల్లిదండ్రులు వాసన్ ఐ బ్యాంకుకు సమాచారమిచ్చారు. సిబ్బంది అక్కడికి వెళ్లి అలేఖ్య కార్నియాను సేకరించారు.