జిలెటిన్‌స్టిక్స్ పేలి యువకుడు మృతి
కైకొండాయిగూడెం (ఖమ్మం రూరల్): జిలెటిన్ స్టిక్స్ పేలిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. కొణిజర్ల మండలం గుబ్బగుర్తి పంచాయతీలోని యల్లన్న నగర్‌కు చెందిన గండికోట సారయ్య, గండికోట లింగయ్య, ఆల కుంట ఉపేందర్ కలిసి మూడు రోజుల కిందట కైకొండాయిగూడెంలోని యల మద్ది నరేందర్ అనే క్వారీ లీజుదారుడి వద్ద రాళ్లు పగలగొట్టే పనికి కుదిరారు.
వీరు ముగ్గురూ బుధవారం రాత్రి కంకర క్వారీలో పెద్ద పెద్ద బండరాళ్ళను పగలగొట్టేందుకు జిలెటిన్ స్టిక్స్ పేల్చారు. చిన్న బండరాళ్ళను పేల్చేం దుకు గురువారం తెల్లవారుజామున జిలెటిన్ స్టిక్స్ అమర్చుతున్నారు. ఈ క్రమంలో, అవి ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలడంతో గండికోట సారయ్య(30) అక్కడికక్కడే మృతి చెందాడు. పేలుడుతో భీతిల్లిన గంటికోట లింగయ్య, ఆలకుంట ఉపేం దర్ అక్కడి నుంచి పారిపోయారు.
దసరా పండుగకు డబ్బులు తెస్తానని...
ఒకవైపు వ్యవసాయం కలిసిరావడం లేదు. మరోవైపు చేసేందుకు పనేమీ లేదు. కుటుంబం గడవడం కష్టంగా ఉంది. ఏదో ఒక పని చేయకపోతే కష్టమనుకున్న సారయ్య, మరో ఇద్దరితో కలిసి ఈ పనికి కుదిరాడు. ‘‘దసరా పండుగ వరకైనా ఎంతోకొంత సంపాదిస్తే.. ఖర్చులకు, కొత్త బట్టలకు పనికొస్తాయని వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. నాకూ, నా ఇద్దరు ఆడపిల్లలకు దిక్కెవరు..?’’ అంటూ, సారయ్య భార్య లక్ష్మి గండెలవిసేలా రోదిస్తోంది.
జిలెటిన్ స్టిక్స్ పేల్చివేతకు అనుమతి లేదు
కైకొండాయిగూడెంలోని కంకర కొట్టే క్వారీకి ఎలాంటి అనుమతులు లేవని మైనింగ్ ఏజీ లక్ష్మిప్రసాద్, తహశీల్దార్ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. యలమద్ది నరేందర్ అనే వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండానే కైకొండాయిగూడెంలోని తెల్ల రాయి గుట్టలున్న భూమిని లీజుకు తీసుకున్నాడని చెప్పారు. సంఘటన స్థలాన్ని రూరల్ ఎస్ఐ రవీందర్ పరిశీలించి వివరాలు సేకరించారు. సారయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గండికోట బాబు ఫిర్యాదుతో క్వారీ లీజుదారుడు యలమద్ది నరేందర్‌తోపాటు పనికి కుదిరిన ఆలకుంట ఉపేందర్, గండికోట లింగయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.