అనువాదాలతో అమ్మ భాషకు పుష్టి
సందర్భం
సమాజంలోని అన్ని రంగాలపై ప్రపం చీకరణ ప్రభావం పడింది. వ్యక్తి నుండి సమష్టి వరకు ప్రతి అడుగులో దాని ప్రభావం కనపడుతుంది. తద్వారా కలి గిన సౌకర్యాల సంగతి ఏమో గాని, సాంస్కృతిక రంగంపై పెద్ద దెబ్బ పడి నట్లయింది. వేషం, భాష, తిండి, నీరు మొదలుకొని సర్వ వ్యవహారాలకు దీని ప్రభావం పాకింది. ఫలితంగా భాషలు మార్పులకు గురి కావడమే కాదు, సమూలంగా వాటిని పెకలిం చివేసే ప్రమాదాలు కూడా ఏర్పడుతున్నాయి. జీవితంలో వ్యవ హారం తీరు మారింది. వ్యవహారాన్ని బట్టి భాష ఉంటుంది. ‘నాది వ్యవహార భాష’ అన్నాడు విశ్వనాథ. వ్యవహారమంటే వాడుక ఒక్కటే కాదు. వ్యాపార, రాజకీయ, శాస్త్ర రంగాలన్నిటిలో జరిగే వ్యవహారాలన్నీ వ్యవహారమే. అంటే నిత్య జీవితావసరాలు, రాజకీయ, పరిపాలన, శాస్త్ర, కళ, సాంస్కృతిక రంగాలన్నిటా వాడే భాష వ్యవహార భాష. ఆ విధంగా ఇవాళ వ్యవహారంలో వాడే తెలుగు భాష కొన్ని మూలాలను వదులుకుంటున్నది. నాగలి లేదు. ట్రాక్టర్ వచ్చింది. నీరుకు బదులు వాటర్ సామాన్య వ్యవ హారమయింది. ఇట్లా ఎన్నో!
ఈ సందర్భంగా మనకు కలిగిన ఒక మేలు లేదా పరోక్ష వెసులుబాటు ఏమిటంటే మనకు తప్పనిసరిగా మరొక భాష, ముఖ్యంగా ఇంగ్లిష్ అవసరం అయింది. దేశంలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేవారికి, ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య హిందీతో పాటు మరో భాష అవసరం. అట్లే ఉర్దూ వంటి భాషల అవసరం కూడా ఏర్పడుతున్నది. ఈ కారణంగా ప్రతి వారికీ ఎంతో కొంత ఇంగ్లిష్ తెలుసుకోవాల్సిన అగత్యం ఏర్ప డింది. వస్తువులు, పద్ధతులు, సౌకర్యాలు, సాంకేతికాల పేర్లతో ఎంతో తనంత తానుగా వచ్చి చేరింది. పాతవి పోయి కొత్త పర భాషా పదాలు వచ్చి చేరాయి. ఆ చేరిన వాటిని భాషగా నేర్చు కోవడం వల్ల రెండు ప్రయోజనాలున్నాయి. ఒకటి: పరాయి భాష నయినా సక్రమంగా మాట్లాడటం, చదవటం రావడం. రెండు: ఉభయ భాషలను కొంత సక్రమంగా నేర్చుకోవటం ఈనాటి తరానికి ఒక అత్యవసర సన్నివేశం. అది విద్యా మాధ్యమం వల్ల కొంత, సాహిత్యకారుల వల్ల కొంత, పత్రికలు, ప్రసార మాధ్య మాలు, సినిమా మొదలైన వాటివల్ల కొంత జరగవచ్చు.
విద్యారంగం, సాహితీ రంగం రెండూ ప్రధానమైనవి. మిగతా రంగాల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ వాటికి సరి ౖయెన రూపాలు ఈ రంగాల నుండే ఏర్పరచుకోవాలి. అప్పుడే కొత్త తరానికి సవ్యమైన సరిౖయెన భాష ఒకటి ఏర్పడుతుంది. రెండు భాషలు నేర్పడం ఇవాళ ప్రతి పాఠశాల చేస్తున్న పనే. అయితే భాషను నిత్య వ్యవహారానికి అను గుణంగాను, భాష స్వరూప స్వభావాల మౌలిక పరిచయాల ద్వారాను ఆ పని చేస్తే భాషలను సౌకర్యంగా వాడుకునే తీరులో నేర్చుకుంటారు. సాహితీవేత్తలు, పాత్రికేయులు అనువాదాన్ని ఒక ఆసరగా తీసుకొని ఆ పనిని చేయవచ్చు. అటునుంచి ఇటు, ఇటు నుంచి అటు అందించాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయి. ‘తెలుగు ముద్దు’ అనడంతో పాటు ‘ఇంగ్లిష్ వద్దు’ అనే నినాదం మారాలి. తెలుగు, ఇంగ్లిష్ లేదా హిందీ, లేదా ఉర్దూ ఏదో మరో భాషను కూడా అనివార్యమైన అవసరంగా అభిమానించి నేర్చు కోవాలి. ఏ భాష మీద తిరస్కరణా సరిౖయెనది కాదు.
అనువాదాలు సాహిత్య రూపాలు కావచ్చు, శాస్త్ర విషయాలు కావచ్చు, రాజకీయ పరిపాలనా పరమైనవి కావచ్చు. చేసే ప్రయత్నం చేస్తే మూలభాష లోతులు, జాతీయాలు, నుడికారాలు తెలుస్తాయి. లక్ష్యభాష(అనువాదం చేయాలనుకున్న భాష)లో కూడా సమాన పద వాక్య ప్రయోగాలు చేõ¯ ప్రయత్నం జరుగు తుంది. తద్వారా లక్ష్య భాషను కూడా లోతుగా, మెరుగుగా, ఉన్నత అవసరాలకు అనుగుణంగా నేర్చుకున్నట్లవుతుంది. అమ్మ భాషను, అన్య భాషను అక్కచెల్లెండ్లుగా కలిపి నేర్చుకోవడం వల్ల ఉభయ సాంస్కృతిక, జీవన విధానాలకు మేలు కలుగుతుంది. పలు రంగాలలో రెండింటి అవసరం ఎంతో ఉంది కనుక ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి.
రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ నుండి వచ్చి చిన్న చాయ్ దుకాణాలు పల్లెల్లో కూడా పెట్టుకొని గడుపుతున్నారు. భాషా సమస్యను తేలి కగా అధిగమించడానికి వారు తెలుగు పదాలను నేర్చుకున్నారు. ప్రజలు వారి హిందీ పదాలను కొన్నింటిని తెలుసుకున్నారు. వ్యాపారం అనే వ్యవహారం సాగుతున్నది. ఇట్లా ఎన్నో రంగాలలో ఎంతో వినిమయం, ఇచ్చిపుచ్చుకోవడాలు భాషల విషయంలో కూడా జరగాలి. అనువాదాలతో రెండు భాషలు బలపడతాయి.
సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, తత్వశాస్త్రం, న్యాయ రాజకీయ ఆర్థిక రంగాలకు సంబంధించిన ఎన్నో అనువాదాలు అనేక భాషల నుండి మన భాషకు, మన భాష నుండి ఇతర భాషలకు జరిగాయి. వాటివల్ల ప్రయోజనమే తప్ప ఏ భాషకూ నష్టం లేదు. అనువాదం ఈనాడు విద్యార్థుల నుండి మేధావుల వరకు అందరికీ తప్పనిసరి. అందుకే తెలుగు భాషా పరిరక్షణ సమితి అనువాదాల ద్వారా, ఉభయభాషల ద్వారా శిక్షణ వాటి పరిరక్షణకే కాదు ప్రగతికి కూడా అత్యవసరమని విద్యార్థుల తల్లిదండ్రుల దృష్టికి, సమాజం దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తేవాలని తెలుగు భాష పరిరక్షణ సమితి భావిస్తోంది. 6–11–2016న వరంగల్లులో జరిగే చర్చాగోష్ఠిలో దానిని ప్రధానాంశంగా ప్రతిపాదించబోతోంది.
(వ్యాసకర్త : డాక్టర్ గండ్ర లక్ష్మణరావు విశ్రాంత తెలుగు రీడర్, కాకతీయ యూనివర్సిటీ
మొబైల్ : 98493 28036)