‘పేట’ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా గండూరి ప్రవళిక
సూర్యాపేట : సూర్యాపేట మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా అందరూ ఊహించిన విధంగానే మంత్రి జగదీష్‌రెడ్డి సహకారంతో కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు గండూరి ప్రవళిక ఎన్నికయ్యారు. ఆదివారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో సూర్యాపేట ఆర్డీఓ నాగన్న ఆధ్వర్యంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. రెండు మార్లు కోరం లేక వాయిదా పడగా ఈ సారి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అయిన జగదీష్‌రెడ్డితో సహా 35 మంది సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. మొదట సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం చైర్పర్సన్ ఎన్నిక కార్యక్రమాన్ని చేపట్టారు. బీజేపీ చెందిన గోదల భారతమ్మను చైర్‌పర్సన్‌గా ఆ పార్టీకి చెందిన సభ్యుడు చల్లమళ్ల నర్సింహ ప్రతిపాదించగా మరో సభ్యుడు వర్ధెల్లి శ్రీహరి బలపరిచారు.
భారతమ్మతోపాటు మొత్తం నాలుగు ఓట్లు లభించాయి. అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన అంగిరేకుల రాజశ్రీనిచైర్పర్సన్ అభ్యర్థిగా షాహినిబేగం ప్రతిపాదించారు. కాని ఆమెను బలపరిచే వారు లేకపోవడంతో కేవలం రెండు ఓట్లతోనే సరిపెట్టుకున్నారు. చివరగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన గండూరి ప్రవళికను మంత్రి జగదీష్‌రెడ్డి ప్రతిపాదించగా టీడీపీకి చెందిన నిమ్మల వెంకన్న బలపరిచారు. ఈమెకు టీడీపీకి చెందిన 12, టీఆర్ఎస్ 4, సీపీఎం రెండు, సీపీఐ ఒకటి, స్వతంత్రులు ఇరువురితో పాటు మంత్రితో కలిపి 22 మంది చేతులెత్తారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏడుగురు సభ్యులు తటస్థంగా వ్యవహరించారు. దీంతోచైర్పర్సన్గా గండూరి ప్రవళిక ఎన్నికైనట్టు ఆర్డీఓ ప్రకటించారు.
వైస్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల లక్ష్మి..
చైర్పర్సన్ఎన్నిక అనంతరం వైస్ చైర్మన్ ఎన్నికను చేపట్టారు. మొదటగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కుంభం రజితను వైస్ చైర్‌పర్సన్‌గా ప్రకటిస్తూ బీఫాం అందజేయగా ఆమెను ఎవరూ ప్రతిపాదించలేదు. అనంతరం బీజేపీకి చెందిన చల్లమళ్ల నర్సింహను వైస్ చైర్మన్ అభ్యర్థిగా ఆ పార్టీ సభ్యుడు వర్ధెల్లి శ్రీహరి ప్రతిపాదించగా మరో సభ్యురాలు రంగినేని ఉమ బలపరిచారు. ఆమెతో పాటు నాలుగు ఓట్లు లభించాయి. చివరగా టీడీపీకి చెందిన నేరెళ్ల లక్ష్మిని వైస్ చైర్పర్సన్ అభ్యర్థిగా ఆ పార్టీకి చెందిన వల్దాస్ దేవేందర్ ప్రతిపాదించగా మరో సభ్యుడు గోగుల రమేష్ బలపరిచారు. ఈమెకు టీడీపీకి చెందిన 12, టీఆర్ఎస్ 4, సీపీఎం రెండు, సీపీఐ ఒకటి, స్వతంత్రులు రెండింటితోపాటు మంత్రితో కలిపి 22 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన 8 మంది సభ్యులు తటస్థంగా వ్యవహరించారు. దీంతో వైస్ చైర్‌పర్సన్‌గా టీడీపీకి చెందిన నేరెళ్ల లక్ష్మి ఎన్నికైనట్టు ఆర్డీఓ ప్రకటించారు. అనంతరం చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లకు ఆర్డీఓ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.
ఫలించిన మంత్రి వ్యూహం...
కేవలం నలుగురు సభ్యులు గల టీఆర్ఎస్ పార్టీ మద్దతుతో చైర్పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి కొన్ని రోజులుగా చేసిన కృషి ఫలించింది. మంత్రి ఆదేశానుసారం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కట్కూరి గన్నారెడ్డితోపాటు ఆ పార్టీ ముఖ్యులు రెగ్యులర్‌గా ఆయనకు చేదోడువాదోడుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏడుగురు, టీడీపీకి చెందిన 12 మంది, సీపీఎంకు చెందిన ఇద్దరు, సీపీఐ ఒకరు, స్వతంత్రులు ఇరువురిని తన వైపు తిప్పుకొని ఎన్నికను ఏకపక్షంగా జరిపించుకోగలిగారు. చైర్‌పర్సన్‌గా ఎన్నికైనప్రవళిక భర్త గండూరి ప్రకాష్ ఎన్నికల అనంతరం మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. బీజేపీకి చెందిన నలుగురు సభ్యులను ఒంటరి చే శారు. టీఆర్ఎస్ శిబిరానికి చేరిన ఏడుగురు కాంగ్రెస్ సభ్యులకు ఆ పార్టీ విప్ జారీ చేసినప్పటికీ వారెవరు ఎవరికి ఓటు వేయకుండా తటస్థంగా వ్యవహరించేటట్టు మంత్రి చతురతను ప్రదర్శించారు. చైర్మన్ అభ్యర్థిగా స్వయాన మంత్రి సూచించిన ప్రవళిక కూడా ఆమె ఓటు వేసుకోకుండా చాకచక్యంగా వ్యవహరించారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏ ఒక్క సభ్యుడూ అనర్హతకు గురి కాకుండా ఉండే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నారు.
‘మిర్యాల’ మున్సిపల్ వైస్ చైర్మన్‌గా మగ్దూంపాష ఏకగ్రీవం
మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ మున్సిపల్ వైస్ చైర్మన్‌గా కాంగ్రెస్ పార్టీకి చెందిన మగ్దూంపాషను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం స్థానిక మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఉదయం 11గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ డి. శ్రీనివాస్‌రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్‌గా మగ్దూంపాష నామినేషన్ వేసినట్లు సభకు తెలియజేశారు. వైస్‌చైర్మన్‌గా మగ్దూంపాషను 17వ వార్డు కౌన్సిలర్ పత్తిపాటి నవాబు ప్రతిపాదించగా 25వ వార్డు కౌన్సిలర్ వంగాల నిరంజన్‌రెడ్డి బలపరిచారు. ఇక ఎవరు కూడా నామినేషన్ వేయకపోవడంతో వైస్‌చైర్మన్‌గా మగ్దూంపాష ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆర్డీఓ డి. శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. అనంతరం నియామక పత్రాన్ని వైస్ చైర్మన్‌కు అందజేశారు.
ఈనెల 3వ తేదీన చైర్ పర్సన్‌తో పాటు వైస్ చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉండగా 4వ తేదీకి వాయిదా పడింది. ఆ రోజు కూడా కోరం లేకపోవడంతో మరో సారి వాయిదా పడింది. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌కు తెలియజేయడంతో తిరిగి ఈనెల 13వ తేదీన నిర్వహించాలని ఆదేశించింది. దీంతో వైస్‌చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. అనంతరం వైస్ చైర్మన్‌గా ఎన్నికైన మగ్దూపాషతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ వసంత, స్థానిక ఎమ్మెల్యే ఎన్. భాస్కర్‌రావు, మున్సిపల్ చైర్ పర్సన్ తిరునగరు నాగలక్ష్మి, టీపీఎస్ మహిపాల్‌రెడ్డి, కౌన్సిలర్లు ముదిరెడ్డి సందీప, నూకల కవిత, అమతం దుర్గ, మెరుగు రోశయ్య, మాజీద్, శ్రీనివాస్‌రెడ్డి, ఆంజనేయరాజు, గిరిధర్‌లతో పాటు పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.