‘బిగాల’ టాప్
‘గణేశ్ గుప్తా’ది ఉమ్మడి జిల్లాలో ఉత్తమ ర్యాంకు గత సర్వేతో పోల్చితే మెరుగైన మంత్రి పోచారం పనితీరు పూర్తిగా పడిపోయిన వేముల, షకీల్, రవీందర్రెడ్డిల ప్రోగ్రెస్ నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశం సర్వేలో వెనుకబాటుకు కారణాలు కూడా వివరించిన కేసీఆర్! డీఎస్, ఎమ్మెల్సీల సేవలు వినియోగించుకోవాలని ఆదేశం సర్వే ఆధారంగా ఎమ్మెల్యేల పనితీరును సమీక్షించిన సీఎం
నిజామాబాద్ : ఎమ్మెల్యేల పనితీరు సర్వే నివేదిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం తెలంగాణభవన్‌లో ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేల పనితీరుపై ప్రత్యేకంగా సమీక్షించారు. టీఆర్ఎస్ఎల్పీ సమావేశం అనంతరం జరిగిన ఈ ప్రత్యేక సమీక్షలో నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పనితీరును సమీక్షించారు. పనితీరు బాగాలేదని సర్వేలో తేలిన ఎమ్మెల్యేలను సున్నితంగా హెచ్చరించారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఆరు నెలల క్రితం నిర్వహించిన సర్వే నివేదికతో పాటు, జనవరిలో మరోదఫా నిర్వహించిన సర్వే నివేదికను పోల్చుతూ పనితీరు బేరీజు వేశారు. ఈ సమీక్ష సమావేశంలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలతోపాటు, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్, ఎమ్మెల్సీలు డాక్టర్ భూపతిరెడ్డి, డి.రాజేశ్వర్‌రావు, వి.గంగాధర్‌గౌడ్,లు పాల్గొన్నారు.
పనితీరు మెరుగు పరుచుకోండి..
పనితీరు బాగాలేని సర్వే నివేదికలో తేలిన ముగ్గురు ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ సున్నితంగా హెచ్చరించారు. బాల్కొండ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మిషన్ భగీరథ ప్రాజెక్టు వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిలు తమ పనితీరు మెరుగు పరుచుకోవాలని సీఎం సూచించారు. వాటర్‌గ్రిడ్ సమీక్షలతో హైదరాబాద్‌కే పరిమితం కాకుండా, నియోజకవర్గానికి సమయం కేటాయించాలని ప్రశాంత్‌రెడ్డిని ఆదేశించారు.
ఇసుక వివాదం కూడా ప్రశాంత్‌రెడ్డి పనితీరు పడిపోవడానికి కారణమనే అభిప్రాయాన్ని సీఎం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం కంటే మరింత ఎక్కువ సమయం కేటాయించాలని షకీల్ అహ్మద్, ఏనుగు రవీందర్‌రెడ్డిలను కూడా ఆదేశించారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేల సర్వే నివేదికను పరిశీలిస్తే..72.50 శాతం ఉన్న ఏనుగు రవీందర్‌రెడ్డి పనితీరు 48.80 శాతానికి పడిపోడంపై సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. అలాగే వేముల ప్రశాంత్‌రెడ్డి పనితీరు కూడా 67.20 శాతం నుంచి 39.90 శాతానికి తగ్గడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. షకీల్ అహ్మద్ పనితీరు 60.40 శాతం నుంచి 39.40 శాతానికి చేరడాన్ని కేసీఆర్ ప్రస్తావించారు.
మొదటి స్థానంలో ‘బిగాల’
తాజా సర్వే నివేదిక ప్రకారం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త పనితీరు ఉమ్మడి జిల్లా పరిధిలోని తొమ్మిది మంది ఎమ్మెల్యేల్లో మొదటి స్థానంలో ఉన్నట్లు తేలింది. గత సర్వేతో పోల్చితే ఆయన పనితీరు బాగుందని తెలిపిన వారి శాతం కాస్త తగ్గినప్పటికీ, ఆయన తొమ్మిది మందిలో ప్రథమ స్థానం లభించింది. 74.70 శాతం మంది బిగాల పనితీరు బాగుందని తేల్చారు. గత సర్వేలో ఇది 78 శాతం ఉండేది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండేలు ఇద్దరు కూడా జిల్లాలో రెండో స్థానంలో నిలిచారు. బాజిరెడ్డి పనితీరు బాగుందని గత సర్వేలో 75.50 శాతం మంది పేర్కొనగా, ఇప్పుడు ఇది 69.30 శాతానికి తగ్గింది. షిండే పనితీరు 60.30 శాతం నుంచి 69.30 శాతానికి పెరిగింది. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి జిల్లాలో మూడోస్థానంలో ఉన్నారు. 65.70 శాతం మంది ఆయన పనితీరు బాగుందని తేల్చారు. గత సర్వేలో ఈ శాతం 76.80 శాతం మంది జీవన్‌రెడ్డి పనితీరు బాగుందని తేలింది.
మెరుగైన మంత్రి పోచారం పనితీరు
గత ఆరు నెలల క్రితం నిర్వహించిన సర్వే నివేదికతో పోల్చితే బాన్సువాడ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కామారెడ్డి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌ల పనితీరు మెరుగుపడిందని తేలింది. ఉమ్మడి జిల్లాలో తొమ్మిది మంది ఎమ్మెల్యేల్లో వీరిద్దరి పనితీరు బాగాలేదని గత సర్వేలో తేలింది. తాజా సర్వే నివేదికల ప్రకారం వీరి పనితీరు మెరుగైంది. ఆరు నెలల క్రితం పోచారానికి వచ్చే ఓట్లు 45.90 శాతం ఉండగా, ప్రస్తుతం ఇది 61 శాతానికి పెరిగింది. గత సర్వే నివేదిక ప్రకారం గంప గోవర్థన్ పనితీరు ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది మంది ఎమ్మెల్యేల్లో చివరి స్థానంలో ఉండేది. తాజా నివేదిక ప్రకారం ఆయన పనితీరు కాస్త మెరుగుపడింది. గత సర్వే నివేదికలో 42.30 శాతం రాగా, ఇప్పుడు ఇది 54.90 శాతానికి పెరిగింది.
డీఎస్ సేవలు వినియోగించుకోండి..
అపార రాజకీయ అనుభవం కలిగిన రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ సేవలను అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు సూచించారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో డీఎస్ అనుచరవర్గం ఉండటంతో తరచూ ఆయన పర్యటనలు తమ నియోజకవర్గాల్లో ఉండేలా చూసుకోవాలని సూచించారు. ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంపై కాస్త శ్రద్ధ పెట్టాలని కేసీఆర్ డీఎస్‌ను సూచించినట్లు సమాచారం. జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ముగ్గురు ఎమ్మెల్సీలు డాక్టర్ భూపతిరెడ్డి, వి.గంగాధర్‌గౌడ్, డి.రాజేశ్వర్రావులతో సమన్వయం చేసుకుని పనిచేయాలని ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ సూచించారు.
సభ్యత్వ నమోదు చేయించండి..
ఆయా నియోజకవర్గాల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ సమీక్షలో పాల్గొన్న ప్రజాప్రతినిధులను ఆదేశించారు. నాలుగు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ మేరకు సభ్యత్వ నమోదు పుస్తకాలను త్వరలోనే జిల్లాలకు పంపుతామన్నారు.