Ganesh nimajjanotsavam
-
వినాయక నిమజ్జనంలో విషాదం
పెద్దాపురం(వీరులపాడు) : వినాయక నిమజ్జన కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. అప్పటి వరకు గణనాథుని ట్రాక్టర్‌పై ఊరేగించి నిమజ్జనం చేసి తిరిగి వస్తుండగా ట్రాక్టర్‌పై నుంచి జారి పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన వీరులపాడు మండలం పెద్దాపురం గ్రామంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు... పెద్దాపురంలో ఏర్పాటుచేసిన వినాయకుడి విగ్రహం నిమజ్జన కార్యక్రమంలో భాగంగా బుధవారం రాత్రి గ్రామంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. ట్రాక్టర్‌పై స్వామి వారి విగ్రహాన్ని ఊరేగించిన అనంతరం అర్ధరాత్రి సమయంలో దాములూరు కూడలి వద్ద ఉన్న వైరా కట్టలేరు సంగమం వద్ద నిమజ్జనం చేసేందుకు వెళ్లారు. నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసుకుని గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో తిరిగి ఇంటికి బయలుదేరారు. వీరులపాడు–జయంతి గ్రామాల మధ్య ఉన్న మలుపు వద్దకు రాగానే ట్రాక్టర్‌పై ఉన్న గుంటక సుధాకర్ రెడ్డి(52) జారి కిందపడిపోయాడు. తలకు తీవ్ర గాయాలు కావటంతో అక్కడిక్కడే మృతిచెందాడు. సుధాకర్‌రెడ్డి పక్కనే కూర్చున్న వెంకటేశ్వర రెడ్డి కూడి కిందపడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. సుధాకర్‌రెడ్డి భార్య లక్ష్మి కంచికచర్ల మండలం పరిటాల గ్రామ వీఆర్వోగా విధులు నిర్వహిస్తుండగా, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు చూపరులను కలచివేసింది. పలువురి పరామర్శ.. ట్రాక్టర్‌పై నుంచి పడి మృతి చెందిన సుధాకర్ రెడ్డి మృతదేహం వద్ద వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ కోటేరు ముత్తారెడ్డి, పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఆవుల రమేష్‌బాబు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరులపాడు, కంచికచర్ల తహసీల్దార్లు రాజకుమారి, విజయ్‌కుమార్, పలువురు వీఆర్వోలు కూడా సుధాకర్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు. -
టీఆర్ఎస్ ఆఫీసుపై దాడి
నిమజ్జనంలో డీజే పెట్టుకోనివ్వడంలేదని ఆగ్రహం బీర్కూర్ : ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిన ట్లు’ గణేష్ నిమజ్జనోత్సవంలో డీజే పెట్టుకోవడానికి పోలీసులు అనుమతించక పోవడంతో ఆగ్రహించిన నిజామాబాద్ జిల్లా బీర్కూర్ యువకులు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడిచేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. పలువురు టీఆర్ఎస్ నాయకులపై దాడికి యత్నించారు. తీవ్రంగా దుర్బాషలాడుతూ పార్టీ కార్యాలయంలోని కుర్చీలు, టేబుల్, ఫ్యాన్ ఇతర వస్తువులను ధ్వంసం చేసి భగత్‌సింగ్ కూడలిలో కాల్చివేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. బీర్కూరు మండలంలోని సంగె ం గ్రామంలోనూ గణేష్ నిమజ్జనోత్సవం ఉద్రిక్తంగా మారింది. గ్రామంలోని అగ్రవర్ణాలు తమపై దాడిచేశారని ఆరోపిస్తూ దళితులు ఆందోళనకు దిగారు. బీర్కూర్ ఎస్సై రాజ్‌భరత్‌రెడ్డి అక్కడకుచేరుకుని ఇరువర్గాలతో మాట్లాడారు. -
8న ప్రభుత్వ సెలవు, 13న వర్కింగ్ డే
హైదరాబాద్: గణేశ్ నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని 8వ తేదీన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ రెండు జిల్లాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలకు కూడా సెలవు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. దీనికి బదులుగా ఈ నెల 13వ తేదీన రెండో శనివారం వర్కింగ్ డేగా ప్రకటించారు. కాగా, గణేశ్ నిమజ్జనోత్సవం సందర్భంగా ఈ నెల 8న జంటనగరాలు, రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలకు ఏపీ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ నెల 8వ తేదీకి బదులుగా13వ తేదీన రెండో శనివారం పనిదినంగా పేర్కొంటూ ఉత్తర్వులు వెలువడ్డాయి.