వినాయక నిమజ్జనంలో విషాదం
వినాయక నిమజ్జనంలో విషాదం
Published Thu, Sep 8 2016 9:49 PM | Last Updated on Tue, Oct 9 2018 5:43 PM
పెద్దాపురం(వీరులపాడు) : వినాయక నిమజ్జన కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. అప్పటి వరకు గణనాథుని ట్రాక్టర్‌పై ఊరేగించి నిమజ్జనం చేసి తిరిగి వస్తుండగా ట్రాక్టర్‌పై నుంచి జారి పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన వీరులపాడు మండలం పెద్దాపురం గ్రామంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు... పెద్దాపురంలో ఏర్పాటుచేసిన వినాయకుడి విగ్రహం నిమజ్జన కార్యక్రమంలో భాగంగా బుధవారం రాత్రి గ్రామంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. ట్రాక్టర్‌పై స్వామి వారి విగ్రహాన్ని ఊరేగించిన అనంతరం అర్ధరాత్రి సమయంలో దాములూరు కూడలి వద్ద ఉన్న వైరా కట్టలేరు సంగమం వద్ద నిమజ్జనం చేసేందుకు వెళ్లారు. నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసుకుని గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో తిరిగి ఇంటికి బయలుదేరారు. వీరులపాడు–జయంతి గ్రామాల మధ్య ఉన్న మలుపు వద్దకు రాగానే ట్రాక్టర్‌పై ఉన్న గుంటక సుధాకర్ రెడ్డి(52) జారి కిందపడిపోయాడు. తలకు తీవ్ర గాయాలు కావటంతో అక్కడిక్కడే మృతిచెందాడు. సుధాకర్‌రెడ్డి పక్కనే కూర్చున్న వెంకటేశ్వర రెడ్డి కూడి కిందపడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. సుధాకర్‌రెడ్డి భార్య లక్ష్మి కంచికచర్ల మండలం పరిటాల గ్రామ వీఆర్వోగా విధులు నిర్వహిస్తుండగా, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు చూపరులను కలచివేసింది.
పలువురి పరామర్శ..
ట్రాక్టర్‌పై నుంచి పడి మృతి చెందిన సుధాకర్ రెడ్డి మృతదేహం వద్ద వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ కోటేరు ముత్తారెడ్డి, పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఆవుల రమేష్‌బాబు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరులపాడు, కంచికచర్ల తహసీల్దార్‌లు రాజకుమారి, విజయ్‌కుమార్, పలువురు వీఆర్వోలు కూడా సుధాకర్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు.
Advertisement