బై బై గణేశా..
అనంతపురం కల్చరల్, న్యూస్‌లైన్ : నగరంలో ఐదు రోజుల పాటు భక్తుల నుంచి విశేష పూజలందుకున్న విఘ్ననాయకుడు శుక్రవారం గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా నగరంలోని పలు కూడళ్ల వద్ద మధ్యాహ్నం నుంచే కోలాహలం మొదలైంది. నగరంలో వాడవాడలా కొలువుదీరిన వందలాది గణేష్ విగ్రహాలు డప్పులు, మేళ తాళాలు, గానా భజంత్రీలు, బాణాసంచా పేలుళ్ల నడుమ సప్తగిరి సర్కిల్ మీదుగా కెనాల్ వైపు త రలివెళ్లాయి. టవర్ క్లాక్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు బారులు తీరిన భక్తులు గణనాథునికి నీరాజనాలర్పించారు.
ముఖ్యంగా యువకులు, చిన్నారులు కేరింతలు కొడుతూ నిమజ్జనోత్సవంలో పాల్గొన్నారు. ‘గణేష్ మహరాజ్‌కీ జై’, ‘గణపతి బొప్పా మోరియా’ నినాదాలను మార్మోగిస్తూ లంబోదరునికి ఘనంగా వీడ్కోలు పలికారు. ‘అనంత కళావాహిని’ సాంస్కృతికోత్సవాల కోసం జిల్లా నలుమూలల నుంచినగరానికొచ్చిన కళాకారులు నిమజ్జనోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంస్థ వ్యవస్థాపకులు వరం వెంకటేశ్వర్లు, రమేష్ ఆధ్వర్యంలో కళాకారులు ఒంటెలు, గుర్రాలు ముందు నడుస్తుండగా కోలాటం, చెక్కభజన, మరగాళ్లు, కీలుగుర్రాలు వంటి కళారూపాలను ప్రదర్శించారు. హెచ్చెల్సీ, గుత్తి రోడ్డు వద్ద అర్ధరాత్రి వరకు భారీ క్రేన్ల సాయంతో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు.
కమలానగర్, రెవెన్యూకాలనీ, కోవూరునగర్ తదితర ప్రాంతాల్లో వినాయకుని వద్ద ప్రసాదంగా ఉంచిన లడ్డూలను వేలం వేశారు. అంతకు ముందు సప్తగిరి సర్కిల్ సమీపంలోని వినాయక్ చౌక్ వద్ద ముగింపు సభ నిర్వహించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా.. ఉరవకొండ రంగావీధిలో కాణిపాక వరసిద్ధ్ది వినాయుక ఉత్సవ సమితి వారు ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద ఉంచిన లడ్డును రైస్ మిల్ యుజవూని శ్రీధర్ వేలం పాటలో రూ. 45,116లకు దక్కించుకున్నాడు.