gang star nayeem
-
నయీం కేసులో.. ఆ ఇద్దరిపై సస్పెన్షన్ ఎత్తివేత
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్‌కు గురైన ఐదుగురు అధికారుల్లో ఇద్దరిపై వేటు ఎత్తేస్తూ రాష్ట్ర హోంశాఖ, డీజీపీ కార్యాలయం ఆదేశాలు జారీ చేశాయి. నయీంతో సత్సంబంధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో అదనపు ఎస్పీ మద్దిపాటి శ్రీనివాస్, ఏసీపీలు మలినేని శ్రీనివాస్‌రావు, చింతమనేని శ్రీనివాస్‌తోపాటు ఇద్దరు ఇన్స్పెక్టర్లను గతేడాది అప్పటి డీజీపీ అనురాగ్ శర్మ సస్పెండ్ చేశారు. గతేడాది మే నుంచి వీరంతా సస్పెన్షన్‌లోనే ఉంటూ వచ్చారు. తాజాగా తమ సస్పెన్షన్ ఎత్తివేసి, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అదనపు ఎస్పీ మద్దిపాటి శ్రీనివాస్, ఏసీపీ మలినేని శ్రీనివాస్‌రావు డీజీపీ మహేందర్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. దీనిని పరిశీలించిన డీజీపీ కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో శుక్రవారం వీరిద్దరినీ తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ఆదేశాలు వెలువడ్డాయి. అదనపు ఎస్పీ మద్దిపాటి శ్రీనివాస్ డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది ఉత్తర్వులు వెలువరించగా, ఏసీపీ మలినేని శ్రీనివాస్ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. దీంతో వీరిద్దరు శుక్రవారం ఉదయం డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేశారు. సరిగ్గా ఏడాది తర్వాత తిరిగి విధుల్లోకి చేరినట్టు సంబంధిత అధికారులు తెలిపారు. అయితే వీరికి ప్రస్తుతం ఏ పోస్టింగ్స్‌నూ డీజీపీ కార్యాలయం కేటాయించలేదు. అందుకు సంబంధించి త్వరలోనే ఆదేశాలిస్తారని రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయ వర్గాలు తెలిపాయి. వీరిద్దరూ కాకుండా మిగిలిన ముగ్గురు అధికారులు సస్పెన్షన్‌లోనే ఉన్నారని, ప్రస్తుతం వీరి విజ్ఞప్తులు పెండింగ్‌లో ఉన్నాయని పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి. విచారణ జరుగుతోంది... అదనపు ఎస్పీ మద్దిపాటి శ్రీనివాస్‌రావు వ్యవహారంపై కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ నియమించిన రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి సమ్మిరెడ్డి నేతృత్వంలో విచారణ జరుగుతోందని హోంశాఖ తెలిపింది. నయీం కేసులో ఆరోపణల నేపథ్యంలో కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ విచారణ అనంతరం నివేదిక వస్తుందని, ఆ తర్వాత నివేదికలో పొందుపరిచిన అంశాలను బట్టి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హోంశాఖ అధికారులు తెలిపారు. ఇకపోతే ఏసీపీ మలినేని శ్రీనివాస్‌రావు వ్యవహారంలో రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయం అంతర్గతంగా విచారణ జరుపుతున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. ఎస్పీ ర్యాంకు అధికారి లేదా డీఐజీ ర్యాంకు అధికారి ఏసీపీ శ్రీనివాస్‌రావు వ్యవహారంలో మౌఖిక విచారణ జరిపి, నివేదిక అందిస్తారని హెడ్‌క్వార్టర్స్ వర్గాలు స్పష్టం చేశాయి. ఆ నివేదిక అనంతరం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపాయి. -
నయీమ్ ఆస్తుల జప్తు
సాక్షి, హైదరాబాద్ : పోలీసుల ఎన్కౌంటర్లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఆస్తుల జప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సిద్ధమవుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు నమోదైన కేసులు, సెటిల్మెంట్ల విషయాల్లో లభించిన ఆధారాలను దృష్టిలో పెట్టుకొని ఆస్తుల స్వాధీనం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గోవా, ముంబైలలో ఉన్న ఇళ్లు, స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు అనుసరించాల్సిన మార్గంపై సిట్ అధికారులు న్యాయశాఖ నుంచి ఇప్పటికే సలహా కూడా తీసుకున్నట్లు తెలియవచ్చింది. ఈ అంశంపై ప్రభుత్వానికి లేఖ రాసి ఉత్తర్వులు పొందేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మొదటి దఫాలో రూ. 140 కోట్ల ఆస్తి... నయీమ్ తన భార్య, సోదరి, అత్త, అనుచరుల పేర్లపైనే ఆస్తులు కూడబెట్టగా అతని భార్యతోపాటు సోదరి, అతడి దగ్గరి బంధువుల పేర్లపై ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకునేలా సిట్ అధారాలు సేకరించింది. వాటి ప్రస్తుత మార్కెట్ విలువను పరిశీలిస్తే... హైదరాబాద్‌లోని అల్కపురి కాలనీలో రెండు ఇళ్ల విలువ రూ. 6 కోట్లు. మణికొండలోని పంచవటి కాలనీలో 8 ప్లాట్ల విలువ సుమారు రూ. 4–5 కోట్లుగా అంచనా. పుప్పాలగూడలో 300 గజాల చొప్పున 12 ఓపెన్ ప్లాట్ల విలువ సుమారు రూ. 6 కోట్లు. షాద్‌నగర్‌లోని 12 ఎకరాల మామిడి తోట, ఫాంహౌస్‌ల విలువ సుమారు రూ. 25 కోట్లు. తుక్కుగూడలోని 10 ఎకరాల తోట, ఫాంహౌస్ విలువ సుమారు రూ. 35 కోట్లు. కరీంనగర్ శివారులోని నగునూర్‌లో రూ. 5 కోట్ల విలువైన వెంచర్. నల్లగొండలో నయీమ్ అనుచరుల పేరిట ఉన్న రెండు ఇళ్లు, 18 ఎకరాల భూమి విలువ రూ. 3.5 కోట్లు. మిర్యాలగూడలో నయీమ్ అత్త పేరిట ఉన్న ఇంటితోపాటు 4 ఎకరాల భూమి విలువ సుమారు రూ. 65 లక్షలు. భువనగిరి, యాదగిరిగుట్టలోని 16 వెంచర్లలో 180పైగా ఓపెన్ ప్లాట్ల (ఒక్కొక్కటి 250 గజాల నుంచి 300 గజాలు) విలువ సుమారు రూ. 12 కోట్ల నుంచి రూ. 18 కోట్లు. గోవాలోని కోకనట్ హౌస్‌తోపాటు మరో ఇల్లు గుర్తింపు. ఒక్కో ఇంటిని రూ. 2.5 కోట్లకు కొనుగోలు చేసినట్లు నయీమ్ భార్య, సోదరి వాంగ్మూలంలో స్పష్టం చేశారు. వాటిని కూడా జప్తు జాబితాలో పెట్టారు. నాగోల్, సరూర్‌నగర్‌లో ఓ సెటిల్మెంట్లో నయీమ్ అనుచరులు శేషన్న, శ్రీధర్ల పేరిట ఉన్న రెండు ఫంక్షన్ హాళ్ల విలువ సుమారు రూ. 6 కోట్లు. నార్సింగిలో రూ. 2 కోట్ల విలువైన ఇల్లు, శంషాబాద్‌లోని పోలీస్‌హౌస్ విలువ రూ. 2 కోట్లు. కల్వకుర్తిలో 8 ఎకరాల భూమి విలువ రూ. 3.5 కోట్లు. మేడ్చల్‌లో 3 ఎకరాలు, శామీర్‌పేట్‌లో ప్రముఖ రిసార్ట్ సమీపంలో మరో 3 ఎకరాల భూమి గుర్తింపు. ఓ ప్రజాప్రతినిధితో చేసిన సెటిల్మెంట్లో పొందిన ఈ భూమి విలువ సుమారు రూ. 20 కోట్లు. మొయినాబాద్‌లో ఒక్కోటి రూ. 45 లక్షల విలువైన రెండు విల్లాలు. ఇందుకు అవసరమైన డబ్బు మొయినాబాద్‌లోని అజీజ్‌నగర్ ల్యాండ్ సెటిల్మెంట్తో వచ్చాయని నయీమ్ అనుచరుల వాంగ్మూలంలో సిట్ గుర్తించింది. ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో సుమారు రూ. 2 కోట్ల విలువైన రెండు ఇళ్లు. మొత్తం 1,130 ఎకరాలు... నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత సిట్ విచారణలో 210 మంది బాధితులు తమ భూములపై ఫిర్యాదు చేయగా వాటిలో ఆధారాలు గుర్తించింది మాత్రం కేవలం 46 కేసుల్లోనే. ప్రస్తుతం ఆ ఆస్తుల జప్తు కోసం సిట్ సమాయత్తమవుతోంది. నయీమ్ మొత్తం 1,130 ఎకరాల భూమి సంపాదించినట్లు గుర్తించినా ఈ కేసుల్లో ఆధారాలు దొరక్క అధికారులు తంటాలు పడుతున్నారు. 15 ఏళ్ల క్రితం జరిగిన ఈ సెటిల్మెంట్ల విషయంలో కొందరు బాధితులు ఫిర్యాదు చేసినా ఆ భూములు అనేక మంది చేతులు మారాయి. ప్రస్తుతం పొజిషన్లో ఉన్న వారి ఆదాయ వ్యవహారాలు, డాక్యుమెంట్లు, తదితరాలన్నీ పక్కాగా ఉండటంతో వాటిని స్వాధీనం చేసుకోవడం అంత సులభం కాదని తెలిసింది. అలాగే అనుచరుల పేరిట రిజిస్ట్రేషన్ అయిన కొన్ని భూముల్లోనూ స్వాధీనం అంత సులభం కాదని సమాచారం. ఆదాయ మార్గాలు చూపించడంతోపాటు ఆస్తులను సీజర్ ప్రాపర్టీ నుంచి తొలగించుకునేందుకు ఏకంగా హైకోర్టుకు వెళ్లారని తెలిసింది. దీంతో సిట్ ఆ ఆస్తులను గుర్తించినా స్వాధీనానికి తగ్గ ఆధారాలు సంపాదించలేకపోయినట్లు తెలుస్తోంది. -
కలకలం
నయీం ఎన్‌కౌంటర్‌తో రియల్టర్లలో గుబులు రహస్య ప్రాంతాలకు వెళ్లేందుకు సమాయత్తం? వరంగల్ : గ్యాంగ్‌స్టర్ నయీమెుద్దీన్ ఎన్కౌంటర్ జిల్లాలో కలకలం రేపింది. నయీం ముఠా గతంలో జిల్లాలోనూ సెటిల్మెంట్లు చేసినట్టు చర్చ జరుగుతోంది. నయీం స్వస్థలమైన నల్లగొండ జిల్లా భువనగిరి మన జిల్లాకు సమీప ప్రాంతం కావడంతో ముఠా సభ్యులు ఇక్కడ కూడా తమ కార్యకలాపాలు సాగించినట్టు తెలుస్తోంది. అయితే ఎవరు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో కేసులు నమోదు కాలేదు. నయీం గ్యాంగ్‌తో జిల్లాకు చెందిన కొందరు రియల్టర్లకు సుదీర్ఘకాలంగా సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ ఎవరు కూడా నోరు మెదపడం లేదు. నయీం ఎన్కౌంటర్ సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున సమాచారాన్ని స్వాధీనం చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. పోలీసులు స్వాధీనం చేసుకున్న సమాచారం మేరకు పక్క జిల్లాల్లో అరెస్టులు ప్రారంభం కావడంతో నయీంతో సంబంధాలున్న వారు రహస్య ప్రదేశాలకు వెళ్లేందుకు సమాయత్తమవుతున్నటు తెలిసింది. నయీంతో యాదగిరిగుట్టకు చెందిన కొందరితో సంబంధం ఉన్నట్లు సోషల్ మీడియాలో రావడంతో ఆ ప్రాంతంలో భూ క్రయ విక్రయాలు చేసిన మన జిల్లాకు చెందిన పలువురు ఆందోళనలకు గురువుతున్నారు.