వారు ఆమెకు వెరీ స్పెషల్!
ఆసరా దొరికితే మల్లెతీగ పూల పందిరి అవుతుంది. అప్పుడప్పుడే కళ్లు తెరుస్తున్న పక్షి పిల్లలకు ఎగరగలవనే ఆశను కల్పిస్తూ రెక్కల భరోసాను అందిస్తే అవి ప్రపంచాన్నంతా చుట్టేస్తాయి.మరి...
సంకల్పం గల మనసుకు, ఆ మనసులోని ఆశయాలకు అండగా నిలిస్తే, అవకాశాలను కల్పిస్తే..! ఆ వ్యక్తులు అద్భుతాలే చేయగలుగుతారు. ఈ విషయాన్ని మరోసారి రుజువు చేశారు కర్ణాటకలోని సుంటికొప్ప ప్రాంతానికి చెందిన గంగా చెంగప్ప. మెంటల్లీ చాలెంజ్డ్ చిన్నారులకు శిక్షణ ఇస్తున్నారు. ఆమె తీర్చిదిద్దిన రత్నాల్లాంటి ముగ్గురు పిల్లలు ఏకంగా...స్పెషల్ ఒలింపిక్స్ స్థాయికి వెళ్లారు.ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన స్పెషల్ ఒలింపిక్స్‌లో... భారతదేశానికి పసిడి, రజత, కాంస్య పతకాలను గెలుచుకొచ్చారు.
కర్ణాటకలోని కొడగు ప్రాంతానికి చెందిన ఓ సామాన్య గృహిణి గంగా చెంగప్ప. భర్త, పిల్లలు- ఇలా సంసార బాధ్యతల్లో మునిగిపోయిన ఆమె ఆ తరువాత తన వంతుగా సమాజానికి ఏదైనా చేయాలని అనుకున్నారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు పాఠాలు చెప్పే స్పెషల్ ఎడ్యుకేటర్‌గా అర్హత సాధించిన గంగా చెంగప్ప తను చేయబోయే పని మెంటల్లీ ఛాలెంజ్డ్, ఆటిజం చిన్నారుల కోసమే అయితే మరింత బాగుంటుందని భావించారు. అనుకున్నదే తడవుగా తన ఆలోచనను కుటుంబ సభ్యులతో పంచుకున్నారు. తన లక్ష్యానికి కుటుంబ సభ్యుల సహకారం కూడా తోడవడంతో తన మనసులోని ప్రాజెక్టు రూపకల్పన పనిలో నిమగ్నమయ్యారు గంగా చెంగప్ప. 2003లో సుంటికొప్ప ప్రాంతంలో ఈ ‘స్పెషల్’ చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఓ శిక్షణ కేంద్రాన్ని ఓ ప్రైవేటు సంస్థ సహకారంతో ప్రారంభించారు. 2003లో కేవలం 20 మందితో ప్రారంభమైన ఈ కేంద్రంలో ప్రస్తుతం 125మంది శిక్షణ పొందుతున్నారు. ఈ శిక్షణ కేంద్రంలో ఉచిత హాస్టల్ వసతితో పాటు పదో తరగతి వరకు విద్యాబోధన కూడా జరుగుతోంది. ఈ ‘స్పెషల్’ చిన్నారులకు తమ పనులను తామే చేసుకునేలా శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి స్వయం ఉపాధి అవకాశాలను కల్పించేందుకు గాను టైలరింగ్, న్యూస్‌పేపర్ బ్యాగ్‌ల తయారీ వంటి వివిధ అంశాల్లో ‘స్వస్థ’ కేంద్రంలో శిక్షణ ఇస్తున్నారు. ఇందుకు గాను ‘స్వస్థ’ సంస్థలో నిపుణులైన ఏడుగురు శిక్షకులు పనిచేస్తున్నారు.
పతకాల దిశగా ప్రోత్సాహం...
‘ప్రతి మనిషికీ దేవుడిచ్చిన గొప్ప వరం ఏదైనా ఉందంటే అది మనిషిగా జీవించగల అవకాశాన్ని అందించడమే’ అంటారు గంగా చెంగప్ప. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక నైపుణ్యం ఉంటుందని, దాన్ని కనుక పదును పెట్టగలిగితే వారు అద్భుతాలను చేయగలుగుతారనేది ఆమె నమ్మకం. అదే నమ్మకంతోనే తమ సంస్థలో శిక్షణ తీసుకుంటున్న చిన్నారుల్లో ఉన్న నైపుణ్యాలకు పదును పెట్టడం ప్రారంభించారు. ముఖ్యంగా క్రీడల పట్ల వారిని ఆకర్షితులను చేసేందుకు చాలా శ్రమించారు. ‘ఆటిజం, మెంటల్లీ చాలెంజ్డ్ చిన్నారులను ఎప్పుడూ ఉత్సాహంగా ఉంచడం ఎంతో అవసరం. అప్పుడే వారు కొత్త విషయాలను సులభంగా నేర్చుకోగలుగుతారు. అందుకు క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకే మా సంస్థలోని చిన్నారులకు క్రీడల్లో శిక్షణనిచ్చేందుకు శిక్షకులను ఏర్పాటు చేశాం. క్రీడల్లో రాణించిన చిన్నారుల ప్రతిభ కేవలం మా సంస్థ వరకే పరిమితం కాకూడదనే ఉద్దేశంతోనే వారిని జోనల్ స్థాయి, రాష్ట్ర స్థాయి విభాగాల్లో ప్రత్యేక క్రీడల పోటీలకు పంపేవాళ్లం. జాతీయ స్థాయిలో పాల్గొన్న మా చిన్నారులు మందన్న, అరుణ్, గౌతమ్‌లు స్పెషల్ ఒలింపిక్స్‌కు కూడా ఎంపికయ్యారు. అక్కడ కూడా వారు తమ ప్రతిభతో భారతదేశానికి పసిడి, రజత, కాంస్య పతకాలను గెలుచుకు రావడం ఎంతో సంతోషాన్నిస్తోంది’ అన్నారు గంగా చెంగప్ప.
భవిష్యత్తుకు భరోసానిచ్చేలా...
ఇక స్వస్థ సంస్థలో శిక్షణ తీసుకున్న చిన్నారులకు శిక్షణ తర్వాత కూడా గంగా చెంగప్ప తోడుగా ఉంటున్నారు. టైలరింగ్ విభాగంలో శిక్షణ తీసుకున్న వారికి గార్మెంట్స్ సంస్థల యాజమాన్యంతో మాట్లాడి ఉద్యోగాలను ఇప్పించడంతో పాటు అనేక మందికి స్వస్థలోనే తిరిగి ఉద్యోగాలను కల్పించారు. ‘కేవలం శిక్షణ సమయంలోనే కాదు వారి భవిష్యత్తులోనూ భరోసాను అందించాలన్నదే నా ఆశయం. అందుకే మందన్న, అరుణ్‌లకు మా సంస్థలోనే ఉద్యోగాలను అందజేశాం. ఇక పేపర్ బ్యాగ్ ప్రింటింగ్ విభాగంలో శిక్షణ తీసుకున్న వారికి చిన్నపాటి యూనిట్ ఏర్పాటుకు సహకారం అందించే దిశగా ప్రణాళికలు రచిస్తున్నాం. ‘స్పెషల్’ చిన్నారులు ఎవరిపైనా ఆధారపడకుండా ఆర్థికంగా స్థిరత్వాన్ని సాధించగలిగేందుకు ఇలాంటి కార్యక్రమాల రూపకల్పన అవసరమనేది నా అభిప్రాయం’ అన్నారు గంగా చెంగప్ప.
సాధారణ పిల్లల కంటే స్పెషల్ కిడ్స్ దీక్షగా పనిచేస్తారంటారు ఆమె. అయితే వీరి ఇష్టాన్ని తెలుసుకోవడం, శిక్షణ ఇవ్వడంలో ఓపిగ్గా వ్యవహరించాలి. ఆ మాత్రం శ్రద్ధ తీసుకుంటే ఇక వీళ్లు ఎవరికీ తీసిపోరు అనేటప్పుడు ఆమెలో మాతృత్వపు మురిపెం కనిపించింది. నిజమే! స్పెషల్ చిల్డ్రన్ని పెంచాలంటే తల్లికి ఉన్నంత ఓర్పు ఉండాలి. అంతటి ఓర్పు ఉన్న మహిళ గంగాచెంగప్ప.
- షహనాజ్ కడియం, సాక్షి రిపోర్టర్, బెంగళూరు
శభాష్ మందన్న...
మందన్నది కర్ణాటకలోని కొడగు ప్రాంతం. చెన్నై, హైదరాబాద్‌లలో స్పెషల్ చిన్నారుల కోసం నిర్వహించిన ప్రత్యేక పోటీల్లో ప్రతిభ కనబరిచాడు. ఆస్ట్రేలియాలో స్పెషల్ ఒలంపిక్స్‌లో వంద మీటర్ల పరుగుపందెంలో స్వర్ణం, నాలుగు వందల రిలేలో రజతం, 200మీటర్ల పరుగులో కాంస్య పతకాలను సొంతం చేసుకున్నాడు. స్వస్థ పాఠశాలలోనే ఆఫీస్‌బాయ్‌గా నెలకు రూ.1,500జీతాన్ని సంపాదిస్తున్నాడు. పేపర్ బ్యాగ్ ప్రింటింగ్ యూనిట్‌ను ఏర్పాటుచేస్తానని చెబుతున్నాడు.
తల్లిదండ్రుల కోసమే ఈ ‘అరుణ్’ కిరణం...
అరుణ్‌ది కొడగులోని సోమవార్‌పేట. పదో తరగతి వరకు విద్యాభ్యాసాన్ని కూడా పూర్తి చేశాడు. అంతేకాదు బోసె(ఇటలీలో ప్రముఖమైన ఆట) క్రీడలో శిక్షణ కూడా తీసుకున్నాడు. ఆ శిక్షణతోనే స్పెషల్ ఒలింపిక్స్ 4, 6వ స్థానాలను కైవసం చేసుకున్నాడు. స్వస్థలో బటర్ ఫ్లై గార్డెన్‌ను చూసుకుంటున్నాడు. తన వేతనం రూ.1,500ను తన తల్లిదండ్రులకు పంపుతున్నానంటూ గర్వంగా చెబుతాడు అరుణ్. గౌతమ్ తల్లి స్వస్థ సంస్థలో పనిచేస్తూ బిడ్డకు అదే సంస్థలో శిక్షణ ఇప్పించింది. బోసె క్రీడలో రజత, కాంస్య పతకాలను గెలుచుకున్నాడు.