గంజిపడి చిన్నారికి గాయాలు
కదిరి టౌన్ : ముక్కుపచ్చలారని ఓ చిన్నారి పొయ్యిపై ఉడికే అన్నం పాత్రను లాగటంతో, కాలే గంజి మీద పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. నల్లమాడ మండలంలోని బొగ్గిటివారిపల్లికి చెందిన విజయకుమార్, సుకన్య దంపతులకు చెందిన ఏడాదిన్నర వయసున్న హేమంత్‌కుమార్ ఉన్నాడు. ఆదివారం ఉదయం ఇంట్లో ఆడుకుంటున్నాడు. ఇదే సమయంలో చిన్నారి తల్లి వంట గదిలో వంట చేస్తోంది. చిన్నారి ఆడుకుంటూ పొయ్యి వద్దకు వెళ్లి, పొయ్యిపై వున్న అన్నం పాత్రను లాగి మీదకు వేసుకున్నాడు.
దీంతో కాలుతున్న గంజి అన్నం పడి, ఛాతీ, మెడపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మంటకు బిగ్గరగా కేకలు పెట్టగా తల్లి సుకన్య పరుగున వచ్చి బిడ్డను అక్కున చేర్చుకొని వెంటనే 108 వాహనంలో వైద్యచికిత్సల నిమిత్తం కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. డాక్టరు పరీక్షించి ప్రథమ చికిత్స అనంతరం ఆరోగ్యపరిస్థితి విషమంగా వుండటంతో మెరుగైన వైద్యసేవల కోసం అనంతపురం పెద్దాసుపత్రికి తరలించారు.