పరోపకారం చేసేందుకు పోయి..
ముంబై: తనకు సంబంధించిన వారు కాకపోయినా ప్రాణాపాయ స్థితిలో ఉంటే జాలి పడి.. మానవతా దృక్పథంతో వారికి సాయం చేసేందుకు వెళ్లాడు. దురదృష్టవశాత్తూ అదే దారిలో వేగంగా వెళ్తున్న కారు ఆయన్ను ఢీకొంది. అయితే ఆయనకున్న మానవత్వం కారులోని వ్యక్తులకు లేకపోయింది. తమ కళ్లెదుటే.. తమ కారణంగా ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడితే ఏమాత్రం కనికరంలేకుండా కారు ఆపకుండా వెళ్లిపోయారు. పరోపకారం చేసేందుకు వచ్చిన ఆ వ్యక్తి తీవ్రగాయాలతో మరణించాడు. ఈ విషాదకర సంఘటన ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేలో జరిగింది.
ఆదివారం ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేలో అదోషీ టన్నల్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. పెద్ద బండరాళ్ల కింద చిక్కి వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. ఖొపోలి గ్రామానికి చెందిన గణపత్ కుడ్పనె (32) అనే వ్యక్తి ఈ విషయం తెలుసుకుని బాధితులకు సాయం చేసేందుకు వెళ్లాడు. అదే దారిలో వెళ్తున్న కారు ఆయన్ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి మరణించాడు. కాగా కారులోని వ్యక్తులు వాహనాన్ని ఆపకుండా వేగంగా వెళ్లిపోయారు. ఖొపోలి పోలీసులు కేసు నమోదు చేశారు.