డీఈఈసెట్లో మెరిసిన ‘జ్యోతి’
సక్సెస్ స్టోరీ
ఆ ఇంట్లో అమ్మానాన్నలకు అక్షర కాంతులు లేవు. అయినా ఆమె ఆ కుటుంబంలో అక్షర ‘జ్యోతు’లు నింపింది. రెండేళ్ల డీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన డీఈఈసెట్కు దాదాపు నాలుగు లక్షలమంది పోటీపడగా మొదటి ర్యాంకు సాధించి విజయ దుందుభి మోగించింది..గంటా జ్యోతి. ఆమె విజయప్రస్థానం తన మాటల్లోనే..
కుటుంబ నేపథ్యం
మాది విజయనగరం జిల్లా, గంట్యాడ మండలం, రావివలస. నాన్న ఆదినారాయణ, అమ్మ మంగమ్మ. అమ్మానాన్న ఇద్దరూ వ్యవసాయం చేస్తారు. చెల్లెలు యమున తొమ్మిదో తరగతి చదువుతోంది.
విద్యాభ్యాసం
నా విద్యాభ్యాసమంతా మా జిల్లాలోనే జరిగింది. ఒకటి నుంచి పదో తరగతి వరకు కొఠారుపల్లిలోని ఎస్వీడీ గంగాధర్ విద్యానికేతన్లో విద్యనభ్యసించాను. పదో తరగతిలో 8.00 గ్రేడ్ పాయింట్లు సాధించాను. విజయనగరంలోని శ్రీనివాస జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ఎంపీసీ చదివాను. ఇంటర్లో 736 మార్కులు వచ్చాయి.
అన్నయ్యల స్ఫూర్తితో
మా పెదనాన్న కుమారులు ఇద్దరూ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. చిన్ననాటి నుంచి వారిని చూస్తూనే పెరిగాను. నేను కూడా ఎప్పటికైనా టీచర్ కావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాను. ఈ క్రమంలోనే డీఈఈసెట్ రాశాను. మంచి ర్యాంకు వస్తుందని అనుకున్నాను. కానీ 86 (మొత్తం 100) మార్కులతో మొదటి ర్యాంకు సాధిస్తానని అనుకోలేదు.
వారానికి నాలుగు గ్రాండ్ టెస్టులు
డీఈఈసెట్ కోసం విజయనగరంలోని ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చేరాను. రెండు నెలల శిక్షణలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తరగతులు ఉండేవి. వారానికి నాలుగుసార్లు గ్రాండ్ టెస్టులు నిర్వహించేవారు. చివరి పది రోజులు ప్రతి రోజూ రెండు గ్రాండ్ టెస్టులు రాశాను. వీటి ఆధారంగా బలహీనంగా ఉన్న అంశాలపై మరింత దృష్టి సారించాను. గత 20 ఏళ్ల ప్రశ్నపత్రాలను సేకరించి సాధన చేశాను. వీటితోపాటు కోచింగ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్, ఆరు నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాలను విస్తృతంగా అధ్యయనం చేశాను. నా తల్లిదండ్రులు, అన్నయ్యలు, టీచర్ల ప్రోత్సాహంతో ప్రథమ ర్యాంకు సాధించగలిగాను.