ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌ను నియమించాలి
భీమవరం అర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో దళితులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌ను, ఇతర సభ్యులను నియమించాలని దళిత ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు గంటా సుందరకుమార్ డిమాండ్ చేశారు. స్థానిక 11వ వార్డులో బుధవారం నిర్వహించిన దళిత ఐక్య వేదిక భీమవరం శాఖ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాలు ఎన్ని మారుతున్నా దళతుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 68 ఏళ్ళు గడుస్తున్నా రాజ్యాంగ పరంగా దళితులకు హక్కులు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతూనే ఉన్నాయన్నారు. దళిత హక్కుల సాధనకోసం నేటీకీ పోరాటాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మాదిరిగా జిల్లాకు ఒక టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసి టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. దళితుల సమస్యలపై మార్చి 1 నుంచి జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు, వివిధ ఆందోళనా కార్యక్రమాలను ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో గొల్లపల్లి మాణిక్యాలరావు, పాలపర్తి జోనా, యాళ్ళ ప్రసాద్‌కుమార్, పిల్లి మాణిక్యాలరావు, గోసాల కుమార్, కాటూరి విజయశేఖర్, దిడ్ల ఏసు, గూడపాటి యోహాన్, కె.రమేష్, బి.క్రాంతికుమార్, మోకా శాంతరాజు, కాటుక రమేష్, మద్దిరాల పండు, పత్తి సునీల్ తదితరులు పాల్గొన్నారు.