వీడని సీట్ల ముడి
కొలిక్కిరాని టీడీపీ టికెట్ల వ్యవహారం
గంటా శిబిరంలో గందరగోళం
మచిలీపట్నం ఎంపీ ద్వారా పంచకర్ల ప్రయత్నాలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: గంటా బృందం చేరిక, బీజేపీ పొత్తుతో తెలుగుదేశం టికెట్ల వ్యవహారం మరింత జటిలంగా మారింది. నామినేషన్లకు గడువు సమీపిస్తున్నకొద్దీ సమస్య మరింతగా ముదిరిపోతుండడం పార్టీనే కలవరపెడుతోంది. పాతవారితో అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు రెండో జాబితా చిక్కుముడులు వీడక సతమతమవుతున్నారు.
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వెంట వచ్చిన వారికి సీట్లు సర్దుబాటు కాకపోవడం పార్టీకి తలనొప్పిగా మారింది. యలమంచిలి సీటు వ్యవహారం గంటా శిబిరంలో చిచ్చురేపుతోంది. ఇప్పటికే గంటా వెంట వచ్చిన యలమంచిలి ఎమ్మెల్యే యూవీ రమణమూర్తిరాజు(కన్నబాబు), గాజువాక శాసన సభ్యుడు చింతలపూడి వెంకట్రామయ్యలకు పార్టీ రిక్తహస్తం చూపింది.
ఇక ఆ జాబితాలో చేరకుండా పెందుర్తి శాసనసభ్యుడు పంచకర్ల రమేష్‌బాబు గంటాను వదిలేసి మచిలీపట్నం ఎంపీ కొనగళ్ల నారాయణ ద్వారా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఏదో సీటు దక్కితే చాలన్న అభిప్రాయానికి వ చ్చేసిన భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాస్ అందుకోసం భీమిలిని వదులుకోవడానికి కూడా సిద్ధమయ్యారు. దీంతో భీమిలి నుంచి గంటా, శ్రీనివాస్‌ను అనకాపల్లి ఎంపీగా పోటీ చేయించాలని పార్టీ ప్రాథమికంగా అవగాహనకు వచ్చింది.
ఇందుకోసం అనకాపల్లి ఎంపీగా పార్టీ ఎంపిక చేసిన పీలా గోవింద్‌ను గంటా శిబిరం ప్రసన్నం చేసుకుంటోంది. అనకాపల్లి ఎంపీకి బదులు ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయాల్సిందిగా గోవింద్ ను బతిమాలుతున్నారు. ఇందుకు గోవింద్ ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో గంటాతో ఉంటే పూర్తిగా మునగడం ఖాయమనే అభిప్రాయానికి వచ్చిన పంచకర్ల తన సన్నిహితుల ద్వారా యలమంచిలి టికెట్‌కు పావులు కదుపుతున్నారు.
యలమంచిలి సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నబాబును కాదని పంచకర్లకు టికెట్ ఇస్తే గంటా పరువు గంగలో కలసినట్లేనని ఆయన వర్గీయులు ఆందోళన చెందుతు న్నారు. కన్నబాబుకు టికెట్ ఇప్పించలేకపోతే తాను పోటీకి దిగేది లేదని గతంలో గంటా స్పష్టం చేసిన విషయాన్ని కన్నబాబు అనుచరులు గుర్తుచేస్తున్నారు.
పార్టీలోనే ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నబాబును కాదని పెందుర్తి నుంచి వస్తున్న పంచకర్లకు టికెట్ ఇస్తే ఓటమి తప్పదని ఇప్పుడు గంటా వర్గీయులే ప్రచారం ప్రారంభించారు. టికెట్ తనకే అన్న ఆశతో ఇప్పటికే భారీగా ఖర్చుచేసి ప్రచారం ప్రారంభించిన యలమంచిలి నియోజక వర్గ ఇన్చార్జి సుందరపు విజయ్‌కుమార్ తన భవిష్యత్ ఏమిటో తెలియక కలవరపడుతున్నారు.
పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న నారాయణ అభ్యర్థుల బలాబలాలు, పార్టీ అవసరాలను బేరిజు వేయకుండా గంటాకు అనుకూలుడిగా వ్యవహరిస్తుండడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. నారాయణ వ్యవహారాల వల్ల అసలే అంతంతమాత్రంగా ఉన్న పార్టీ పూర్తిగా నాశనమయ్యే పరిస్థితులు తలెత్తుతున్నాయని సీనియర్లు కొందరు చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.