ట్రాక్టర్ దూసుకొచ్చి విద్యార్థి దుర్మరణం
గంటావారిగూడెం (నల్లజర్ల) : ట్రాక్టరు డ్రైవర్ నిర్లక్ష్యం ఓ విద్యార్థి ప్రాణాలను బలితీసుకుంది. పదో తరగతి పాసై, మరో రెండు రోజుల్లో కళాశాలలో చేరాల్సిన యువకుడు ట్రాక్టర్ మీద పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతపల్లి ఎస్సై వి.వెంకటేశ్వరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ద్వారకాతిరుమల మండలం కప్పలగుంటకు చెందిన మర్రాజు నాగమల్లేశ్వరావు కుమారుడు ఆనంద్‌కుమార్(17) తన మేనమామ కొడుకు అరవింద్‌తో కలసి శనివారం సాయంత్రం మోపెడ్‌పై గంటావారిగూడెం వచ్చాడు. అక్కడ సెలూన్లో కటింగ్ చేయించుకుని ఇంటికి బయలుదేరారు. దాహం వేయడంతో దారిలో ఓ షాపు ముందు బండిని ఆపి కూల్‌డ్రింక్ తాగుతున్నారు. ఇంతలో వేగంగా వస్తున్న ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి ఆనంద్‌కుమార్‌పై పడింది. ఆనంద్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా అరవింద్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు.