గంటి ప్రసాదాన్ని ప్రభుత్వమే హత్య చేసింది..
‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆగడాలను ఎవరు ప్రశ్నిస్తారో వారిని హతమారుస్తారు. జిల్లాలో మొదలైన గంటి ప్రసాదం విప్లవ నాయకత్వం దేశవ్యాప్తంగా విస్తరించి, ప్రజలే ప్రశ్నించే తత్వానికి కారకుడవుతున్నాడన్న నెపంతో ప్రభుత్వాలే ప్రసాదాన్ని హతమార్చా’యని అమరుల బంధుమిత్రుల సంఘం, విరసం, విప్లవ సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. గంటి ప్రసాదం సంస్మరణ సభ బొబ్బిలిలోని లక్ష్మీథియేటర్(రాజన్నహాల్)లో ఆదివారం జరిగింది. పట్టణ కలాశీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ సంస్మరణ సభలో విరసం వ్యవస్థాపక సభ్యుడు చలసాని ప్రసాద్, అమరుల బంధుమిత్రుల సంఘ రాష్ట్ర నాయకురాలు పద్మాకుమారి, ప్రగతిశీల కార్మిక సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి కొండారెడ్డి, గంటి సోదరుడు రమణ, భార్య కామేశ్వరితో పాటు రైతు కూలీ సంఘం, సీపీఐ, సీపీఎం, సీపీఐ న్యూ డెమొక్రసీ నాయకులు పాల్గొన్నారు.
ముందుగా ప్రసాదం మరణానికి సభ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించింది. అనంతరం జరిగిన సభలో విరసం వ్యవస్థాపక సభ్యుడు చలసాని ప్రసాద్ మాట్లాడుతూ ప్రసాదాన్ని మఫ్టీలో ఉండే పోలీసులే హతమార్చారని ఆరోపించారు. పట్టపగలు, నెల్లూరు నడిరోడ్డులో జరిగిన ఈ హత్యపై ఇప్పటి వరకూ కేసు నమోదు చేయకపోవడం, దర్యాప్తు ముందుకు వెళ్లకపోవడం చూస్తే ఇది వాస్తవమనిపిస్తోందన్నారు. అమరుల బంధుమిత్రుల సంఘ రాష్ర్ట నాయకురాలు పద్మకుమారి మాట్లాడుతూ విప్లవ నాయకుల్ని హత్యలు చేసినంత మాత్రాన విప్లవం ఆగదన్నారు.
పసాదం ఆశయాలను నెరవేర్చేవరకూ పోరాడతామన్నారు. గంటి సోదరుడు రమణ మాట్లాడుతూ పేదలకు న్యాయం జరిగే మార్గం ఏదైనా ఉందా అంటే అది సాయుధపోరాటం, మావోయిస్టు పార్టీ సిద్ధాంతమేనని ప్రసాదం బాగా నమ్మారన్నారు. ఏ ప్రభుత్వం పరిపాలిస్తున్నా వాటికి ప్రతిపక్ష మావోయిస్టు పార్టీయేనన్నారు. సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కామేశ్వరరావు, రైతు కూలీ సంఘం నాయకుడు వర్మ, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకురాలు రమణి,సీఐటీయూ నాయకులు పీ శంకరరావులు మాట్లాడుతూ గ్రీన్హంట్ పేరుతో బలగాలను మోహరించి అమాయకులైన ఆదివాసీలను తరిమి కొడుతున్నారన్నారు. వీటిపై గొంతెత్తి మాట్లాడే ప్రసాదం లాంటి వారిని చంపుతున్నారన్నారు. స్థానికులు బోగాది అప్పలస్వామి, మెరుగాని అప్పలస్వామి, టీవీ రమణ, నల్లి తవిటినాయుడు తదితరుల ఆధ్వర్యంలో ఈ సంస్మరణ సభ జరిగింది.
సీడీలు, పుస్తకాల ఆవిష్కరణ
గంటి ప్రసాదం అంతిమయాత్రపై రూపొం దించిన సీడీని సంస్మరణ సభలో చలసాని, రమణ, కామేశ్వరి తదితర నాయకులు, బంధువులు ఆవిష్కరించారు. ప్రసాదం మృతదేహం వచ్చిన దగ్గర నుంచి అంతిమ సంస్కారాల వరకూ దీనిలో పొందుపరిచారు. అలాగే ప్రసాదం రచనలు, జీవితచరిత్ర, విప్లవ ఉద్యమంలో సన్ని హితుల మనోభావాలతో కూడిన మూడు పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అరుణోదయ కళాకారులు, డప్పు రమేష్, ప్రజా కళామండలి, శ్రీకాకుళం కళాకారులు ఆలపించిన విప్లవగీతాలు, గంటి ప్రసాదంపై రాసిన పాటలు ఆకట్టుకున్నాయి.