పేగుబంధమే ప్రాణం పోసింది!
కళ్లు తెరవగానే బిడ్డ తల్లి ముఖమే చూస్తాడు. తన తల్లి పొత్తిళ్లలోనే సేదదీరుతాడు. కానీ చైనాకి చెందిన గావో కియాంబోకి అంత అదృష్టం లేకపోయింది. ఎందుకంటే... ఆ బాబు కడుపులో ఉన్నప్పుడు అతడి తల్లి ఝాంగ్ రాంగ్జియాంగ్కి ఓ పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లిపోయింది. ఆమె ఇక కోలుకోలేదని, ఏ క్షణాన్నయినా మరణించవచ్చని తేల్చేశారు వైద్యులు. సరిగ్గా అప్పుడే తెలిసింది వారికి... ఆమె కడుపులో ఓ బిడ్డ పెరుగుతోందని. దాంతో ఏవేవో ప్రయత్నాలు చేసి ఆమె ప్రాణాలు నిలబెట్టారు. నెలలు నిండగానే సిజేరియన్ చేసి బుజ్జి కియాంబోని ఈ లోకంలోకి తీసుకొచ్చారు.
తల్లి పరిస్థితి తెలియక గుక్కపెట్టి ఏడ్చే కియాంబోని చూసి తండ్రి కలత చెందేవాడు. వాడి ఏడుపును ఆపడం కోసం తల్లి పక్కన పడుకోబెట్టేవాడు. తల్లి స్పర్శ సోకగానే ఏడుపు ఆపేసేవాడు కియాంబో. రెండేళ్లు వచ్చాకయితే... తల్లి పక్కనే కూర్చుని, తల్లిని పట్టి కుదుపుతూ ‘‘అమ్మా లేమ్మా’’ అంటూ ఏడ్చేవాడు. వాడి పిలుపుకి ఆ తల్లి మనసు స్పందించిందో లేక తన బిడ్డ వేదన చూసి... అచేతనమైపోయిన ఆమె నరనరమూ చలించిందో తెలియదు కానీ... ఝాంగ్ ఇటీవలే కళ్లు తెరిచింది. నలభై రెండేళ్ల ఆ తల్లి... తన రెండేళ్ల కొడుకుని తొలిసారి చూసుకుని మురిసిపోయింది. ఈ అద్భుతాన్ని చూసి వైద్యులు సైతం విస్తుపోయారు.
ఝాంగ్ కోలుకుంటోంది. కానీ ఇంకా ఘనాహారం తీసుకోలేకపోతోంది. దాంతో అమ్మ కడుపు నింపే బాధ్యతను కూడా బుజ్జి కియాంబోనే తలకెత్తుకున్నాడు. తన చిన్ని నోటితో ఆహారాన్ని నమిలి తన తల్లి నోటికి అందిస్తాడు. ఝాంగ్ దాన్ని ఆనందంగా ఆరగిస్తుంది. తల్లీబిడ్డల అనుబంధానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ మరోటి ఉంటుందా!