అన్వేషణం: దేవతలు నివసించిన చోటు
భూమిపై ప్రకృతి సహజంగా జరిగే మార్పులు... మనిషికి అనేక సౌకర్యాలను సమకూర్చిపెడుతుంటాయి. ఇంధనాలు, వనరులు ఏర్పడటానికి కారణమవుతుంటాయి. భౌతికపరమైన కొన్ని మార్పులు మనిషి వినోదం కోసం చూడచక్కని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కూడా ఏర్పరుస్తుంటాయి. అలా ఏర్పడిన ఓ ప్రకృతి విచిత్రమే ‘గార్డెన్ ఆఫ్ ద గాడ్స్’.
కొన్ని మిలియన్ సంత్సరాల క్రితం భూమిపై వచ్చిన భౌతికపరమైన మార్పుల వల్ల ఏర్పడిన ఉద్యానవనం... ‘గార్డెన్ ఆఫ్ ది గాడ్స్’ . ఇది అమెరికాలోని కొలరాడోలో ఉంది. ఎత్తై కొండలు, విచిత్రాకృతిలోని శిఖరాలు, ఏపుగా పెరిగిన చెట్లు.. వెరసి ప్రకృతి సోయగానికి నిలయంలా ఉంటుంది. ఒక్కసారి చూస్తే, అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది.
క్రీస్తు పూర్వం 1330 నుంచి 250 మధ్య ఈ ప్రాంతంలో కొందరు నివసించారట. ఈ ప్రదేశానికి గార్డెన్ ఆఫ్ ద గాడ్స అన్న పేరు పెట్టింది వారేనని అంటారు పరిశోధకులు. ఈ అందమైన సృష్టి విచిత్రాన్ని దేవతలు, దేవుళ్లు కలిసి ఏర్పాటు చేశారని, ఆ తర్వాత దేవతలంతా ఇక్కడే నివసించానీ వారు విశ్వసించేవారట.
అందుకే ఆ పేరు పెట్టారని తెలుస్తోంది. ఈ ప్రాంతంలో డైనోసార్లు నివసించినట్టుగా కూడా కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి శాస్త్రవేత్తలకు. ఇప్పటికీ కొన్ని అరుదైన తేనెటీగలు, జింక జాతులు, అడవి గొర్రెలు, నక్కలతో పాటు, 130 రకాల పక్షిజాతులు కనిపిస్తాయిక్కడ. అందుకే ‘గార్డెన్ ఆఫ్ ది గాడ్స్’ ప్రముఖ పర్యాటక ప్రాంతంగా విలసిల్లుతోంది. బైక్, హార్స్రేసులకు అద్భుతమైన వేదికగా పేరు పొందింది. రాక్ క్లైంబింగ్, రోడ్ అండ్ మౌంటెన్ బైకింగ్, హార్స్ రైడింగ్ వంటి వాటితో ఎప్పుడూ సందడి సందడిగా ఉంటుంది.
ఊరంతటకీ టైమ్ చెబుతుంది!
ఎత్తయిన భవనంపై ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తోన్న ఈ గడియారం ప్రపంచంలోనే అతి పెద్దదని మీకు తెలుసా? ఇటీవలే దీన్ని సౌదీ అరేబియాలోని మక్కాలో ప్రారంభించారు. ఈ అతి పెద్ద గడియారాన్ని నిర్మించడానికి దాదాపు మూడు బిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి. అంటే మన కరెన్సీలో పన్నెండొందల కోట్ల రూపాయలకు పైనే.
ఇప్పటివరకూ అతి పెద్ద గడియారంగా ఇస్తాంబుల్‌లోని సెవాహర్ మాల్ క్లాక్ గురించి చెప్పుకునేవారు. ఇప్పుడు ఈ గడియారం దాన్ని మించిపోయింది. 76 అంతస్తుల మక్కా క్లాక్ రాయల్ టవర్ పైభాగంలో అమర్చిన దీన్ని జర్మనీకి చెందిన ఓ సంస్థ రూపొందించింది. చట్రాలన్నీ బంగారంతో చేశారు. తొమ్మిది కోట్ల రంగు గాజు ముక్కల్ని వాడారు. 20 లక్షల రెడ్ బల్బులను పెట్టారు. అల్లా అనే అక్షరాల కోసం 21 వేల ఆకుపచ్చ విద్యుత్ బల్బుల్ని అమర్చారు. రోజుకు ఐదు సార్లు, ముస్లిములు ప్రార్థన జరిపే ప్రతిసారీ ఇవి వెలుగుతాయి. టవర్ పైన చంద్రవంక నుండి వెలువడే లేజర్ కిరణాల వెలుగు ఆకాశంలో పది కిలోమీటర్ల వరకూ ప్రకాశిస్తాయట. ఆ ప్రాంతం వారంతా ఇళ్లలో ఉండే దీనిలో టైమ్ చూసుకోవచ్చట!