పంద్రాగస్టు... అదిరేట్టు
గోల్కొండ: పంద్రాగస్టు వేడుకలకు గోల్కొండ కోట ముస్తాబవుతోంది. కోట ప్రధాన గేటు, ప్రహరీతోపాటు లోపల గల వివిధ చారిత్రక భవనాలను వాటి పరిసరాలను అధికారులు అత్యంత సుందరంగా తీర్చిదిద్దే పనుల్లో తలమునకలయ్యారు. ఆషుర్‌ఖానా నుంచి కోట ప్రధాన గేటు వరకు ఉన్న కోట ప్రహరీకి మరమ్మతులు చేయడంతోపాటు ప్రధాన రహదారిపై వాహనాల కోసం తెలుపు రంగు చారలు వేశారు. కోట ప్రధాన గేటుకు ఇరువైపులా పుట్‌పాత్‌లకు కొత్త టైల్స్ వేస్తున్నారు. ఫెన్సింగ్‌కు కూడా రంగులద్ది సుందరంగా తీర్చిదిద్దారు. సీఎం కేసీఆర్ గౌరవ వందనం స్వీకరించే ప్రదేశంలో గార్డెనింగ్ పనులు జోరుగా సాగుతున్నాయి. విద్యుత్ దీపాలతో రాత్రి వేళ కోట ధగధగ మెరిసిపోతుంది.
కోటను సందర్శించిన సీఎస్, డీజీపీ
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ మంగళవారం ఉదయం కోటను సందర్శించారు. సీఎం, ఇతర ముఖ్యుల వాహనాల రూట్ మ్యాప్‌ను వారు పరిశీలించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని అన్ని వాహనాలను కోటలోకి రాకుండా కేవలం గవర్నర్, లోకాయుక్త, స్పీకర్ వాహనాలనే వేదిక వరకు అనుమతించాలని, వేదిక కుడి భాగంలోని రాణిమహల్ వెనుక పార్కింగ్ చేయించాలని సీఎస్ రాజీవ్‌శర్మ అధికారులను ఆదేశించారు.
కేసీఆర్ గౌరవ వందనం స్వీకరించి పతాకావిష్కరణకు కోటలోకి వెళ్లే సమయం అత్యంత కీలకమైనదని.. ఈ సమయంలో కోట పైనుంచి ఒక్క వాహనం కూడా కిందికి రాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. రాణిమహల్ ఎదురుగా దిగువ ప్రదేశం వేదికకు చాలా తక్కువ ఎత్తులో ఉందని సీఎస్ రాజీవ్‌మిశ్రా డీజీపీ దృష్టికి తెచ్చారు. అప్పటికప్పుడే ఆ ప్రదేశంలో కుర్చీలు వేసి అక్కడ కొంతమందిని కూర్చోబెట్టి వారికి వేదిక ఏ మేరకు కన్పిస్తుందనే విషయాన్ని ఆరా తీశారు. సీఎం ప్రసంగాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించేలా ఏరా్పాట్లు చేయాలని సీఎస్ సూచించారు. వారి వెంట సీఎం సలహాదారులు అజయ్‌మిశ్రా, డిప్యూటీ ప్రొటోకాల్ ఆఫీసర్ అరవిందర్‌సింగ్, కొత్వాల్ పి.మహేందర్‌రెడ్డి తదితరులున్నారు.
సమీక్షించిన ఇంటలిజెన్స్ ఐజీ..
తెలంగాణ రాష్ట్ర ఇంటలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డి గోల్కొండ కోటలో జరుగుతున్న ఏర్పాట్లను డీఐజీ మహేష్ భగవత్‌తో కలిసి పరిశీలించారు. జెండా ఆవిష్కరించే ప్రాంతాన్ని, పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కోట ప్రధాన గేటు నుంచి సభావేదిక వరకు రూట్‌ను పరిశీలించారు. పరిసరాల్లోని కట్టడాలపై ఆరా తీశారు. సభావేదికకు ఉన్న ఇతర మార్గాలు, ఆ ప్రాంతంలో తీసుకోవాల్సిన భధ్రత చర్యలను సమీక్షించారు. సీఎం గౌరవ వందనం స్వీకరించే ప్రదేశం రోడ్డుకు ఆనుకొని ఉందని, ముఖ్యమంత్రి తిరిగి వెళ్లే వరకు ఈ ప్రాంతంలో ఎవరిని అనుమతించాలి అనే విషయంపై కూడా ఆయన అధికారులతో చ ర్చించారు. సభావేదికకు మూడువైపులా ఎత్తయిన కట్టడాలపైకి వెళ్లి పరిశీలించారు. వారి వెంట పశ్చిమ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
మూడంచెల భద్రత..
ఐదువేల మంది పోలీసులతో మూడంచెల బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపారు. గోల్కొండ కోటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పాసులున్నవారు పతాకావిష్కరణకు కనీసం గంట ముందు తమకు కేటాయించిన సీట్లలో కూర్చోవాలన్నారు. ప్రతి పాస్ వెనుక రూట్ మ్యాప్‌తోపాటు పార్కింగ్ స్థలాన్ని కేటాయించినట్టు చెప్పారు.