ఔరా... పురా వైభవం
ఏప్రిల్ 18 వరల్డ్ హెరిటేజ్ డే
వేర్లు లేని చెట్టు ఎంత బలహీనమో, గతం గురించిన అవగాహన లోపించడం కూడా అంతే బలహీనం. గతంలో స్ఫూర్తిదాయక చరిత్ర ఉంటుంది. కదలించే సంస్కృతి ఉంటుంది. పెను నిద్దుర వదిలించే సాహిత్యం ఉంటుంది. కనుల పండగ చేసే కట్టడం ఉంటుంది. ప్రకృతి అందించిన విలువైన బహుమానం ఉంటుంది. జ్ఞానదరహాసం ఉంటుంది.
వియత్నాంలోని ‘హలాంగ్ బే’ జీవవైవిధ్యానికి నిలువెత్తు చిత్రం. ఒక వియత్నాం కవి అన్నట్లు ఆకాశాన్ని ముద్దాడే అందమైన కొండలున్నాయి అక్కడ. ఈజిప్ట్‌లో రాజసంగా కొలువు తీరిన ఏకశిలా విగ్రహం స్పింక్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా మాట్లాడుకోవాల్సింది ఎంతో కొంత ఉందనే అనిపిస్తుంది. రష్యాలోని ఇంద్రధనుస్సు వర్ణాల సెయింట్ బేసిల్ క్యాథడ్రల్, ప్రాచీన ఫ్రెంచి శైలిలో ఫ్రాన్స్‌లో నిర్మితమైన ‘గార్డెన్స్ ఆఫ్ వెర్సైలీ’, జ్ఞాన వెలుగేదో అలలు అలలుగా ప్రసరించే థాయ్‌లాండ్‌లోని ‘వాట్ యాయ్ చాయ్ మాగ్ఖోన్’... ‘వరల్డ్ హెరిటేజ్ సైట్’ జాబితాలో చోటుచేసుకున్న వీటి గురించి ఏది చెప్పుకున్నా ఒక తీరని దాహం. అందమైన సింహావలోకనం.