వైరా వాసి దక్షిణాఫ్రికాలో మృతి
భద్రాద్రి కొత్తగూడెం, వైరారూరల్: మండల పరిధిలోని గరికపాడు గ్రామవాసి అనారోగ్యంతో బాధపడుతూ దక్షిణాఫ్రికాలో బుధవారం మృతి చెందాడు. స్థాని కులు, బంధువుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన శీలం రమణారెడ్డి, కృష్ణాకుమారి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దకుమారుడు హర్షవర్ధన్ రెడ్డి(27) పీజీ పూర్తి చేశాడు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సూచనల మేరకు గతేడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాలోని మాలవి వెళ్లి అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. కాగా కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ స్నేహితుల సాయంతో అక్కడి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. అనా రోగ్యానికి గురైనట్లు కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించాడు.
మంగళవారం హర్షవర్ధన్‌రెడ్డి తల్లిదండ్రులు స్థానిక ప్రజాప్రతినిధుల సాయంతో ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామా నాగేశ్వరరావును కలిసి పరిస్థితి వివరించారు. తమ కుమారుడిని ఇండియాకు రప్పించేందుకు కృషి చేయాలని కోరారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఈలోపే తీవ్ర అనారోగ్యానికి గురైన హర్షవర్ధన్ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో మృతి చెందాడు. కుమారుడి మృతి సమాచారంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇటీవల అంతర్జాతీయ విమానాలు తిరిగి ప్రారంభం కావడంతో హర్షవర్ధన్ రెడ్డి ఇండియాకు తిరిగి వచ్చేందుకు మిత్రుల సహాయంతో జూన్ 6వ తేదీ టికెట్ కూడా బుక్ చేసుకున్నాడు. కానీ ఇంతలోనే మృత్యువు కబళించింది. దీంతో గరికపాడు శోకసంద్రంలో మునిగింది. మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేయాలని మృతుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు.