దండేసి, దండం పెట్టిన పోలీసులు
చండీగఢ్ : ప్రపంచ దేశాలను తన గుప్పట్లో వశపరుచుకున్న కరోనాను కట్టటి చేసేందుకు దేశంలో విధించిన లాక్‌డౌన్‌ను కొందరు ఉల్లంఘిస్తున్నారు. అవసరం ఉన్నా లేకున్నా ఏవేవో కారణాలు చెబతూ రోడ్లపై దర్జాగా తిరుగుతున్నారు. అలా వచ్చిన వారిని పోలీసులు ఎన్ని విధాలుగా అడ్డుకున్న కొత్త కారణాలను వెతుక్కుంటున్నారే తప్ప బయటకు వచ్చే పనులను మాత్రం మానుకోవడం లేదు. ఈ క్రమంలో పంజాబ్‌లో నిబంధనలను అతిక్రమించిన వారికి వినూత్న రీతిలో గుణపాఠం చెప్పారు. రాష్ట్రంలోని లుథియానాలో శనివారం పోలీసులు అనవసరంగా రోడ్ల పైకి వచ్చిన వారికి మెడలో దండలు వేసి, దండాలు పెట్టారు. దయచేసి ఇంట్లో నుంచి బయటకు రావద్దంటూ వారికి విజ్ఞప్తి చేశారు. (ట్రోల్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన బాలీవుడ్ హీరోయిన్ )
హెల్త్ బులిటెన్ ప్రకారం.. లూథియానా జిల్లాలో 76 కరోనా కేసులు నమోదయ్యాయి. పంజాబ్‌లో 480 కరోనా పాజిటివ్ నమోదవ్వగా 19 మంది మరణించారు. ఇక, దేశంలో మొత్తం నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 37.336కు చేరింది. 1,218 మరణాలు చోటుచేసుకున్నాయి. గత 24 గంటల్లోనే 71 మంది మృత్యువాత పడగా.. 2,293 కొత్త కేసులు నమోదయ్యాయి. కాగా దేశంలో లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలపాటు పొడగిస్తున్నట్లు శుక్రవారం కేంద్ర హోంశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మే 17 వరకు లాక్డౌన్ అమలుకానుంది. అయితే రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లగా విభజించి మే నాలుగు నుంచి కొన్ని సడలింపులు ఇవ్వనుంది. (లాక్డౌన్ పొడగింపు: యోగీ కీలక నిర్ణయం)