మేఘాలయలోనూ ‘ప్రత్యేక’ సెగలు
షిల్లాంగ్/డార్జిలింగ్/గువాహటి: తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా యూపీఏ నిర్ణయం తీసుకున్న దరిమిలా దేశంలోని పలుచోట్ల ఇప్పటికే ‘ప్రత్యేక’ ఉద్యమాలు ఊపందుకోగా, తాజాగా ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలోనూ ‘ప్రత్యేక’ నిరసనలు మొదలయ్యాయి. మేఘాలయలో గారో, ఖాసీ-జయింతియా గిరిజన ప్రాంతాలను రెండు ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటు చేయాలంటూ ఐదు జిల్లా కేంద్రాల్లో మంగళవారం నిరసనలు మొదలయ్యాయి.
గారో హిల్స్ రాష్ట్ర ఉద్యమ కమిటీ, హిల్స్ స్టేట్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, గారో నేషనల్ కౌన్సిల్ తదితర పార్టీలు, ప్రజా సంస్థలు దాదాపు ఇరవయ్యేళ్లుగా ప్రత్యేక రాష్ట్రాల కోసం డిమాండ్ చేస్తున్నాయి. భాషా ప్రాతిపదికన గారోలాండ్, ఖాసీ-జయింతియా రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని జీఎన్సీ ఎమ్మెల్యే క్లిఫర్డ్ మారక్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
డార్జిలింగ్‌లో ఉద్యమం ఉధృతం...: ప్రత్యేక గూర్ఖాలాండ్ డిమాండ్‌తో డార్జిలింగ్ పర్వత ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్యమం ఉధృతమైంది. బంద్ ప్రభావంతో మంగళవారం నాలుగో రోజూ ఈ ప్రాంతంలో జనజీవనం స్తంభించింది. గూర్ఖాలాండ్ జనముక్తి మోర్చా (జీజేఎం) అధినేత బిమల్ గురుంగ్ సహచరుడు అనిత్ థాపాను కుర్సియాంగ్లో పోలీసులు అరెస్టు చేశారు. పార్టీ మద్దతుదారు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కలింపాంగ్ వచ్చిన గురుంగ్, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తినా అందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించిన కొద్ది గంటలకే థాపా అరెస్టు జరగడం గమనార్హం.
పాత కేసులకు సంబంధించి ఆయనను అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. థాపా అరెస్టుతో జీజేఎం కార్యకర్తలు కుర్సియాంగ్ పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. డార్జిలింగ్ పరిస్థితులను సమీక్షించేందుకు పశ్చిమ బెంగాల్ హోంశాఖ కార్యదర్శి బాసుదేవ్ బెనర్జీ సిలిగురి చేరుకున్నారు. దీంతో జీజేఎం కార్యకర్తలు సిలిగురి జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయాన్ని ముట్టడించి, పెద్దపెట్టున నినాదాలు చేశారు. కాగా, డార్జిలింగ్, మిరిక్, కుర్సియాంగ్, కలింపాంగ్, సుఖియాపొఖ్రీ తదితర ప్రాంతాల్లో ఆందోళనల్లో పాల్గొన్న పలువురు నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. మరోపక్క.. ‘ప్రత్యేక’ డిమాండ్లతో అస్సాంలో మొదలైన ఉద్యమాలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. అస్సాం దిగువ ప్రాంతంలో మంగళవారం సైతం జనజీవనం స్తంభించింది. అయితే, తొలుత 1500 గంటల బంద్‌కు పిలుపునిచ్చిన యునెటైడ్ పీపుల్స్ డెమోక్రటిక్ ఫోరం (యూడీపీఎఫ్) బుధవారం నుంచి తన ఆందోళనను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.