Garo National Liberation Army
-
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హతం..
గౌహతి : మరో మూడు రోజుల్లో ఎన్నికలు జరగనున్న మేఘాలయలో భద్రత బలగాలు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌ని మట్టుబెట్టాయి. ఉగ్రసంస్థ గారో నేషనల్ లిబరేషన్ ఆర్మీ(జీఎన్ఎల్ఏ) చీఫ్ కమాండర్ సోహన్, భద్రతా దళాలు జరిపిన భీకర ఎన్కౌంటర్లో మృతి చెందినట్టు పోలీసులు ధ్రువీకరించారు. ఫిబ్రవరి 27న మేఘాలయలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ తరుణంలో ఈ ఎన్కౌంటర్ జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. గారో హిల్స్‌లో సోహన్ చాలా యాక్టివ్‌గా ఉండేవాడు. గారోహిల్స్ పోలీసు, మేఘాలయ స్పెషల్ ఫోర్స్-10 కమాండోస్ సంయుక్తంగా జరిపిన ఎన్కౌంటర్లో ఉదయం 11.50కి సోహన్ మృతిచెందాడు. గత ఆదివారం ఎన్నికల ప్రచారం ముగించుకుని వస్తున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జొనాథోన్ ఎన్ సంగ్మాతోపాటు మరో ముగ్గురిని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు జరిపిన ఆ బాంబు దాడిని, పోలీసులు తీవ్రంగా పరిగణించారు. 27వ తేదీన జరిగే ఎన్నికల్లో పాల్గొనకుండా ప్రజలను భయపెట్టేందుకే తీవ్రవాదులు ఈ చర్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి ప్రత్యేక భద్రతా బలగాలను రంగంలోకి దించారు. ఆ ప్రాంతంలో తీవ్ర గాలింపు చేపట్టిన భద్రతా బలగాలు ఉదయం జరిపిన ఎన్కౌంటర్లో సోహన్‌ని అంతమొందించాయి. 2009లో ఏర్పడిన జీఎన్ఎల్ఏ గారో ల్యాండ్ సౌరభౌమాధికారం కోసం పోరాడుతుంది. -
అత్యాచారాన్ని అడ్డుకుందని.. చంపేశారు
-
మాట వినలేదని మహిళ తలను రెండు చెక్కలు చేసిన ఉగ్రవాదులు
ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో ఉగ్రవాదులు బలాత్కారాన్ని ప్రతిఘటించిన ఒక మహిళను ఆమె భర్త, పిల్లల ముందే అత్యంత కిరాతకంగా చంపేశారు. ఈ ఘోరం మంగళవారం రాత్రి జరిగింది. గారో నేషనల్ లిబరేషన్ ఆర్మీకి చెందిన అయిదుగురు ఉగ్రవాదులు మేఘాలయలోని రాజా రంగత్ గ్రామంలో ఒక ఇంట్లోకి చొరబడ్డారు. భర్త, పిల్లలన ఒక గదిలో బంధించి, మహిళను బలాత్కరించడానికి ప్రయత్నించారు. ఆమె దానికి తీవ్రంగా ప్రతిఘటించడంతో మెషీన్ గన్ తో ఆమె తలపై దగ్గర నుంచి కాల్చారు. దీంతో ఆమె తల రెండు చెక్కలై అక్కడికకక్కడే చనిపోయింది. ఈ సంఘటనను ఎంపీ, లోకసభ మాజీ స్పీకర్ పిఎ సంగ్మా తీవ్రంగా ఖండించారు. మేఘాలయలో ఇలాంటి సంఘటన ఇంతకు ముందెన్నడూ జరగలేదని ఆయన అన్నారు. గారో జాతి ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నామని చెప్పుకుంటున్న గారో ఉగ్రవాదులు గారో ప్రజలనే కాల్చి చంపడం స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. -
ఎమ్మెల్యే సోదరుడు కిడ్నాప్
రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యే సోదరుడిని తీవ్రవాదులుగా అనుమానిస్తున్న నలుగురు వ్యక్తులు అపహరించుకు పోయిన సంఘటన మేఘాలయా రాష్ట్రంలో చోటు చేసుకుంది. స్థానిక ఐజీ కథనం ప్రకారం.... బాగ్మరా నియోజకవర్గం నుంచి ఆ రాష్ట్ర శాసనసభకు శామ్యూల్ సంగ్మా ఎన్నికయ్యారు. ఆయన సోదరుడు నాగ ఎం సంగ్మాను గారో నేషనల్ లిబరేషన్ ఆర్మీ (జీఎన్ఎల్ఏ) సంస్థకు చెందిన తీవ్రవాదులు గురువారం సాయంత్రం భారత్ - బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని గాస్ ఉపారాలోని తన నివాసంలో ఉన్న నాగ సంగ్మాను అపహరించుకుని పోయారని చెప్పారు. ఎమ్మెల్యే సోదరుడిని దేశం దాటించే అవకాశాలు అధికంగా ఉన్నాయిని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ నేపథ్యంలో సరిహద్దు వెంబడి భద్రతను అత్యంత కట్టుదిట్టం చేసినట్లు చెప్పారు. కిడ్నాపర్ల నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యే కుటుంబానికి ఫోన్ వెళ్లలేదని తెలిపారు. అలాగే తీవ్రవాదులు తమకు కావాల్సిన డిమాండ్లను కూడా ఇప్పటివరకు ప్రకటించలేదని వివరించారు. అయితే ఎమ్మెల్యే శామ్యూల్ సంగ్మా బొగ్గు, టింబర్ ఎగుమతి వ్యాపారం చేస్తున్నారు. దాంతో ఆయనను తీవ్రవాదులు నగదుని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన సోదరుడిని తీవ్రవాదులు కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారి వివరించారు. అయితే నాగ ఎం సంగ్మా కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేసినట్లు చెప్పారు.