రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యే సోదరుడిని తీవ్రవాదులుగా అనుమానిస్తున్న నలుగురు వ్యక్తులు అపహరించుకు పోయిన సంఘటన మేఘాలయా రాష్ట్రంలో చోటు చేసుకుంది. స్థానిక ఐజీ కథనం ప్రకారం.... బాగ్మరా నియోజకవర్గం నుంచి ఆ రాష్ట్ర శాసనసభకు శామ్యూల్ సంగ్మా ఎన్నికయ్యారు. ఆయన సోదరుడు నాగ ఎం సంగ్మాను గారో నేషనల్ లిబరేషన్ ఆర్మీ (జీఎన్ఎల్ఏ) సంస్థకు చెందిన తీవ్రవాదులు గురువారం సాయంత్రం భారత్ - బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని గాస్ ఉపారాలోని తన నివాసంలో ఉన్న నాగ సంగ్మాను అపహరించుకుని పోయారని చెప్పారు.
ఎమ్మెల్యే సోదరుడిని దేశం దాటించే అవకాశాలు అధికంగా ఉన్నాయిని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ నేపథ్యంలో సరిహద్దు వెంబడి భద్రతను అత్యంత కట్టుదిట్టం చేసినట్లు చెప్పారు. కిడ్నాపర్ల నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యే కుటుంబానికి ఫోన్ వెళ్లలేదని తెలిపారు. అలాగే తీవ్రవాదులు తమకు కావాల్సిన డిమాండ్లను కూడా ఇప్పటివరకు ప్రకటించలేదని వివరించారు.
అయితే ఎమ్మెల్యే శామ్యూల్ సంగ్మా బొగ్గు, టింబర్ ఎగుమతి వ్యాపారం చేస్తున్నారు. దాంతో ఆయనను తీవ్రవాదులు నగదుని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన సోదరుడిని తీవ్రవాదులు కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారి వివరించారు. అయితే నాగ ఎం సంగ్మా కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేసినట్లు చెప్పారు.