లోగుట్టేంటి?
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఒడిశా రాష్ట్రం నుంచి పొట్టచేత పట్టుకుని వలస వచ్చిన కూలీలు తాడిపత్రి వద్ద ఉన్న ‘గెర్డెవ్ స్టీల్స్’ కంపెనీలో ఇరుక్కుపోయారు. ఊరుగాని ఊరు.. భాష తెలియదు.. వీరిని కంపెనీ యాజమాన్యం నిర్బంధించి కూలి డబ్బులు కూడా ఇవ్వకుండా రెండు నెలలుగా పని చేయించుకుంటోంది.
సమాచారం బయటి ప్రపంచానికి తెలియకుండా కూలీల వద్ద సెల్ఫోన్లను కూడా కాంట్రాక్టరు లాక్కున్నాడు. ఈ పరిస్థితుల్లో ఒక కూలీ అతి కష్టంపై సెల్ ఫోన్ సంపాదించి తమ కష్టాల గురించి ఒడిశాలోని బంధువులకు చెప్పుకున్నాడు. వారు ఆ రాష్ట్రంలోని గంజాం జిల్లా కలెక్టర్‌కు విషయాన్ని చేరవేసి తమ వారిని కాపాడండని మొర పెట్టుకున్నారు. దీంతో అక్కడి కలెక్టర్ మన రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్‌కు విషయం తెలిపి నిర్బంధంలో ఉన్న కూలీలను విడిపించి సొంత ఊర్లకు పంపేందుకు చర్యలు తీసుకోమని కోరారు.
ఒడిశా కూలీలు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో కాంట్రాక్టరు నిర్బంధలో ఉండి పోయారని, వారిని విడిపించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఒడిశా ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిందన్న వార్తలు పీటీఐ (ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా)లో మంగళవారమే వెలువడ్డాయి. పీటీఐ వార్తలో అనంతపురం జిల్లా అని మాత్రమే పేర్కొన్నారు కానీ నిర్దిష్టంగా కార్మికులు ఎక్కడ వెట్టి చాకిరి చేస్తున్నారో తెలపలేదు. దీంతో ఈ విషయాన్ని ‘సాక్షి’ మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్, ఎస్పీల దృష్టికి తీసుకువచ్చింది. ఒడిశా ప్రభుత్వ అధికారుల నుంచి తమకు ఎలాంటి సమాచారమూ రాలేదని వారిద్దరూ తెలిపారు.
అయితే వాస్తవంగా ఈ సమయానికే (మంగళవారం సాయంత్రం) జిల్లా కార్మిక శాఖ అధికారులు 18 మంది కార్మికులను గుట్టుచప్పుడు కాకుండా తాడిపత్రి నుంచి అనంతపురం తీసుకు వచ్చి ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ ఎక్కించి ఒడిశాకు పంపించేశారు. జిల్లా అధికారులకు కానీ, తాడిపత్రిలోని రెవిన్యూ, పోలీసు అధికారులకు గానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కనీసం బాధితులను మీడియా ముందుకు కూడా తేకుండా ఇలా గుట్టు చప్పుడు కాకుండా ఆ కూలీలను పంపించిన తీరు చూస్తే జిల్లా కార్మిక శాఖ అధికారుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
యాజమాన్యంతో లాలూచీనే కారణమా..?
కూలీలతో వెట్టి చాకిరి చేయించుకుంటున్న యాజమాన్యం, కాంట్రాక్టరుతో జిల్లా కార్మిక శాఖ అధికారులు లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని.. కూలీలను ఇలా గుట్టుచప్పుడు కాకుండా తరలించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేకపోతే అంత రహస్యంగా వారిని తరలించాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోనీ మంగళవారం సాయంత్రం 7 గంటలకు కూలీలను అనంతపురంలో రైలు ఎక్కించే ముందు అయినా, ఎక్కించాక అయినా ఈ విషయాన్ని మీడియాకు తెలిపేందుకు వారికి కావాల్సినంత సమయం ఉన్నా వారు ఆ పని చేయలేదు. వారిని రైలు ఎక్కించి, ఆ కూలీలు రాష్ట్ర సరిహద్దు కూడా దాటిపోయాక తీరిగ్గా బుధవారం రాత్రి మీడియాకు కూలీలను విడిపించామని నాలుగు వాక్యాల పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ వ్యవహారం అంతా చూస్తే కార్మిక శాఖ అధికారులు ఆ కంపెనీ యాజమాన్యంతోనో, కంట్రాక్టరుతోనో లాలూచీ పడి ఉండవచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి.
యాజమాన్యంపై కేసేదీ..?
కార్మిక శాఖ అధికారులు ఇచ్చిన ప్రకటన మేరకే ఒడిశా కార్మికులు గరుడ స్టీల్స్ ప్రాంగణంలో కాంట్రాక్టరు నిర్బంధంలో పనిచేస్తున్నారు. వీరికి రెండు నెలలుగా వేతనాలు కూడా చెల్లించలేదని పేర్కొన్నారు. ఆ కార్మికులకు చెల్లించాల్సిన రెండు నెలల వేతనాలు ఇప్పించామని తమ ‘ఘనకార్యాన్ని’కూడా ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సంఘటనలో అక్రమ నిర్భంధం, బెదిరించడం, వేతనాలు చెల్లించకపోవడం, తదితర చట్ట ఉల్లఘనలకు ఆ యాజమాన్యం పాల్పడ్డట్లు స్పష్టం అవుతోంది. అలాంటప్పుడు వలస కూలీలను రెలైక్కించి తమ పని పూర్తయిపోయిందన్నట్లుగా కార్మిక శాఖ అధికారులు వ్యవహరించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఐపీసీ, లేబర్ చట్టాల కింద సంబంధిత కంట్రాక్టరు, యాజమాన్యాలపై క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిన అధికారులు అసలు ఆ ఊసే ఎత్తకపోవడం చూస్తుంటే భారీ మొత్తంలోనే ఒప్పందం కుదిరిందేమో అన్న అనుమానాలు బలపడుతున్నాయి. అధికారులు కూలీలను రైలు ఎక్కించే సమయంలో అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు కొందరు కూలీలు గాయాలతో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో అసలు ఏమి జరిగిందన్న విషయంపై జిల్లా కలెక్టర్, ఎస్పీలు విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.