జిల్లాకు 67 వేల కొత్త దీపం కనెక్షన్లు
కడప సెవెన్రోడ్స్ :
దీపం కనెక్షన్ల లక్ష్యాలను త్వరగా గ్రౌండింగ్ చేయాలని జిల్లా పౌరసరఫరాల అధికారి విజయరాణి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, ఎన్ఫోర్స్మెంట్ డీటీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో లక్షా 13 వేల దీపం కనెక్షన్లు గ్రౌండింగ్ చేయాలన్నది లక్ష్యం కాగా సీఎస్ఆర్, దీపం కింద ఇప్పటివరకు 75 వేల కనెక్షన్ల గ్రౌండింగ్ జరిగిందని పేర్కొన్నారు. మిగతా వాటిని కూడా నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలన్నారు. ఇవి కాకుండా జిల్లాకు కొత్తగా 67 వేల దీపం కనెక్షన్లు మంజూరయ్యాయని, వాటినికూడా కేటాయిస్తామని తెలిపారు. కొత్త డీలర్లను ప్రోత్సహించేందుకు వీలుగా దీపం కనెక్షన్లు కేటాయిస్తామన్నారు.
వినియోగదారుల నెంబర్లను దీపం వెబ్సైట్లో నమోదు చేయాలన్నారు. సాంకేతిక పరమైన సమస్యలను సాకుగా చూపరాదన్నారు. ఆధార్నెంబరు ఉంటేనే కొత్త కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కిరోసిన్ రహిత రాష్ట్రంగా మార్చాలంటే దీపం కనెక్షన్లు విరివిగా గ్రౌండ్ చేయాలన్నారు. ఎఫ్పీ షాపు డీలర్లకు దీపం కనెక్షన్ల టార్గెట్ ఇవ్వబోమని ఆమె స్పష్టం చేశారు. ఎందుకంటే ప్రతినెల 1 నుంచి 15వ తేది వరకు డీలర్లు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాల్సి ఉంటుందన్నారు. గ్యాస్ కనెక్షన్లు లేని కార్డుదారులు ఎఫ్పీ షాపుకు వచ్చినపుడు డీలర్లు వారిని ఏజెన్సీల వద్దకు పంపే బాధ్యతను మాత్రమే అప్పగిస్తామన్నారు. ఎల్పీజీ డీలర్లే దీపం కనెక్షన్ల గురించి కరపత్రాలు, ఇతర రకాలుగా ప్రచారం నిర్వహించాలని చెప్పారు. డెలివరి బాయ్స్ అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు తరుచూ వస్తున్నాయని పేర్కొన్నారు. ఎక్సెస్ ఛార్జీలు వసూలు చేయకుండా నివారించాల్సిన బాధ్యత ఏజెన్సీలదేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓలు శ్రీనివాసులు, నాగార్జునరెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.