gas cylinder price hike
-
బండపై మళ్లీ రూ.50
సాక్షి, హైదరాబాద్: పెరిగిన నిత్యావసరాల ధరలతో ఇప్పటికే సతమతమవుతున్న సామాన్య ప్రజానీకంపై మరో బాదుడు. ఎనిమిది నెలల విరామం తరువాత చమురు సంస్థలు మరోసారి గ్యాస్ సిలిండర్ ధరలను పెంచేశాయి. 14.2 కిలోల గృహావసర సిలిండర్‌పై రూ. 50 పెంచగా, వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల సిలిండర్‌పై రూ. 350.50 పెంచాయి. దీంతో హైదరాబాద్‌లో గృహావసరాల సిలిండర్ రేటు రూ.1,105 నుంచి రూ.1,155కి చేరింది. కాగా, గ్యాస్ సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయడంతో రెండేళ్లుగా వినియోగదారులకు నగదు బదిలీ నిలిచిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 1.16 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో సింగిల్ సిలిండర్ కనెక్షన్లు 68.74 లక్షలు కాగా, డబుల్ గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు 48 లక్షలు. ఇవి కాకుండా దీపం కనెక్షన్లు 19.72 లక్షలు, ఉజ్వల కనెక్షన్లు 11.46 లక్షలు, సీఎస్ఆర్ కింద 7.30 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. కుటుంబ సభ్యులను బట్టి సిలిండర్ల వినియోగంలో తేడాలున్నా... సాధారణ కుటుంబానికి సగటున నెలకు ఒక సిలిండర్ అవసరమవుతుంది. గ్రామాల్లో కొంత తక్కువ వినియోగం ఉంటుంది. ఈ లెక్కన రాష్ట్రంలో ప్రతి నెలా కోటి సిలిండర్లకు పైగా రీఫిల్ కోసం వస్తాయనుకున్నా... నెలకు అదనపు భారం రూ. 50 కోట్లకుపైనే ఉంటుందని చమురు కంపెనీల వర్గాలు తెలిపాయి. హోటల్ తిండి భారమే.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను చమురు సంస్థలు ఎకాఎకిన రూ. 350.50 పెంచేశాయి. దీంతో హోటళ్లు, ఇతర వాణిజ్య అవసరాలకు వినియోగించే ఈ సిలిండర్ ధర హైదరాబాద్‌లో రూ.1,973 నుంచి రూ. 2,323.50కి చేరినట్లయింది. ఆదిలాబాద్, ఖమ్మం వంటి జిల్లాల్లో సిలిండర్ ధర మరింత అధికంగా ఉంది. ఈ పరిస్థితుల్లో హోటళ్లలో టిఫిన్లు, భోజనాల ధరలకు రెక్కలు వచ్చే అవకాశం ఉంది. మహిళలను వంచించిన కేంద్రం: మంత్రి గంగుల కమలాకర్ గ్యాస్ ధరలు పెంచి కేంద్ర ప్రభుత్వం మహిళలను మరోసారి వంచించింది. వారం రోజుల్లో మహిళా దినోత్సవం రానున్న సందర్భంగా మోదీ ప్రభుత్వం దేశ మహిళలకు గ్యాస్ ధరలను పెంచి కానుకగా ఇచ్చింది. అదానీ నష్టాలను పూడ్చుకునేలా సామాన్యుల నుంచి గ్యాస్ ధరల రూపంలో వసూలు చేస్తోంది. అధ్వానపు విధానాలతో ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి కారణమైన కేంద్రం.. ఏమాత్రం మానవత్వం ఉన్నా పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి. -
పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ ఆందోళనలకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై విమర్శలతో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికలు అయిపోయిన వెంటనే ప్రతిసారి గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం కేంద్రానికి ఆనవాయితీగా మారిందని ధ్వజమెత్తారు. తాజాగా గృహ అవసరాల సిలిండర్ ధరను రూ.50, కమర్షియల్ సిలిండర్ ధరను రూ.350 మేర భారీగా పెంచడంపై మండిపడ్డారు. 'ఆయా రాష్ట్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్న వెంటనే ఇంత భారీగా సిలిండర్ ధరను పెంచడం దారుణం. మహిళా దినోత్సవం సందర్భంగా దేశ మహిళలకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన కానుకనా ఈ సిలిండర్ ధరల పెంపు? శుక్రవారం అన్ని నియోజకవర్గ, పట్టణ, మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున సిలిండర్ ధరల పెంపుపై నిరసన కార్యక్రమం చేపట్టాలి. ఎక్కడి వారక్కడ వినూత్నంగా ఆందోళనలు చేయాలి. మహిళా దినోత్సవం రోజున సైతం గ్యాస్ ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను చేపట్టాలి. మోదీ ప్రభుత్వం రాకముందు రూ.400 ఉన్న సిలిండర్ ధర ఈరోజు రూ.1,160 దాటి రూ.1,200లకు చేరుకుంది. ఉజ్వల స్కీంలో ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా లబ్ధి పొందిన మొదటి మహిళ సైతం ఈరోజు సిలిండర్‌ను కొనలేక కట్టెల పొయ్యిపై వంట చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా అడ్డగోలుగా సిలిండర్ ధరలను పెంచకుండా, పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి' అని కేటీఆర్ డిమాండ్ చేశారు. చదవండి: బీజేపీలో చేరిన జగిత్యాల మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రావణి -
పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధర
దేశంలో వంట గ్యాస్ ధరలు మళ్లీ మంటెత్తాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలతో సిలిండర్ల ధరలు ఆకాశానికి చేరుతున్నాయి. దీంతో వంట గ్యాస్ సిలిండర్ ధర బుధవారం రూ.15 పెరిగింది. ఢిల్లీలో నాన్ సబ్సిడీ సిలిండర్ ధర రూ.899.50చేరింది. కాగా సెప్టెంబర్ నెలలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.25 పెరిగింది. ఈ నెలలో 19కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.43 పెరగడం సామాన్యులకు పెను భారంగా మారింది. ఇక తాజాగా పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధరతో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మొత్తం గ్యాస్ ధర రూ.190 పెంచినట్లైంది. చమరు కంపెనీలు రెండు నెలల్లో నాన్ సబ్సిడీ గ్యాస్ సిలీండర్ ధరలు అమాంతం పెంచాయి. ఆగస్ట్ 18న నాన్ సబ్సీడీ గ్యాస్ సిలిండర్ ధర ను రూ.25 పెంచగా..సెప్టెంబర్ నెలలో ఇదే నాన్ సబ్సీడీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.25 పెరగడంతో సామాన్యులు లబోదిబో మంటున్నారు. మరింత పెరగనున్న వంట గ్యాస్ ధరలు ఒకవైపు కరోనా..మరో వైపు ఆదాయం లేక సామాన్యుడు అప్పుల ఊబిలో చితికి పోతుంటే పెరుగుతున్న చమురు, గ్యాస్ ధరలు మరింత శాపంగా మారాయి. పెట్రోల్, డీజిల్ వంట నూనెలతో పాటు ఇతర నిత్యావసర సరుకుల ధరలు పెరగటం.. ఇపుడు గ్యాస్ సిలిండర్ ధర కూడా పెరగడం మరింత భారం కానుంది. అయితే ఈ పెరుగుతున్న ధరల భారం కొన్ని నెలల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రానున్న రోజుల్లో గ్యాస్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటూ కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఓ నివేదిక ప్రకారం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సుభాష్ కుమార్ మాట్లాడుతూ అక్టోబర్ 2021 నుంచి మార్చి 2022 మధ్య కాలంలో నేచురల్ గ్యాస్ ధర 50 నుంచి 60శాతం పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే గ్యాస్ ధర ఆకాశాన్ని తాకనుంది. చదవండి: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు -
వంట గ్యాస్ ధర ఎందుకు పెరుగుతుందో ప్రధాని చెప్పాలి: రాహుల్
సాక్షి, ఢిల్లీ: పెట్రోల్, వంట గ్యాస్ ధరల పెంపుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ధరలు పెంచి ప్రజలపై మోయలేని భారం వేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వంట గ్యాస్ ధర ఎందుకు పెరుగుతుందో ప్రధాని చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. జీడీపీ పెరగడమంటే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడమేనా అని ప్రశ్నించారు. కాగా సామాన్యులపై మరోసారి గ్యాస్ బండ పిడుగు పడింది. రెండు నెలల వ్యవధిలోపే మూడుసార్లు సిలిండర్ ధరలు పెరిగాయి. ఓవైపు పెట్రోల్, డీజిల్ ఇంధనాల ధరల మోతతో ఇబ్బంది పడుతున్న సామాన్యుడిపై ఎల్పీజీ మరోసారి గుదిబండగా మారింది. బుధవారం కేంద్ర ప్రభుత్వం మళ్లీ సిలిండర్ ధరను రూ. 25కు పెంచిన సంగతి తెలిసిందే. చదవండి: నారద స్టింగ్ కేసు: ఈడీ ఛార్జ్‌షీట్‌లో నలుగురు నేతల పేర్లు -
మళ్లీ పేలిన గ్యాస్ బండ!
సాక్షి, అమరావతి: వంట గ్యాస్ సిలిండర్ మరోసారి భగ్గుమంది. సబ్సిడీయేతర గ్యాస్ సిలిండర్ ధరను రూ.25 చొప్పున ఉత్పత్తి సంస్థలు పెంచేశాయి. పెంచిన ధరలు మంగళవారం నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొన్నాయి. ఉత్పత్తి సంస్థలు ధర పెంచిన నేపథ్యంలో విజయవాడలో గ్యాస్ సిలిండర్ ధర రూ.857 నుంచి రూ.882కి పెరిగింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రవాణా వ్యయం ఆధారంగా గ్యాస్ సిలిండర్ ధర రూ.882కి కాస్త అటూఇటుగా ఉంది. 2019 ఏప్రిల్‌లో గ్యాస్ సిలిండర్ రూ.732 ఉండగా ఇప్పుడు రూ.882లకు చేరుకుంది. అంటే రెండేళ్లలో గ్యాస్ సిలిండర్ ధర రూ.150 మేర పెరిగినట్లు స్పష్టమవుతోంది. గత నెలలోనూ.. వంట గ్యాస్ సిలిండర్ ధరను ఉత్పత్తి సంస్థలు ఎప్పటికప్పుడు పెంచేస్తుండటంతో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలపై తీవ్ర భారం పడుతోంది. పెట్రో ఉత్పత్తుల ధరలపై నియంత్రణను 2017లో కేంద్రం ఎత్తివేసింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ ఆధారంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెట్రో ఉత్పత్తి సంస్థలు పెంచేస్తున్నాయి. గత నెల 1న గ్యాస్ సిలిండర్ ధరను రూ.25.5 పెంచిన ఉత్పత్తి సంస్థలు తాజాగా మరో రూ.25 పెంచేయడం గమనార్హం. ప్రస్తుతం ప్రతి కుటుంబానికి ఏడాదికి 12 వంట గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం సబ్సిడీ కింద అందిస్తోంది. -
‘బండ’ భారంపైగరంగరం
ఖమ్మం, న్యూస్‌లైన్: గ్యాస్ ధర పెంపుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నెర్ర చేసింది. ప్రజలపై పెనుభారం మోపే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో పలుచోట్ల ఆందోళనలు నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాల ఎదుట బైఠాయించి, ధర్నా చేశారు. ఖమ్మంలో పార్టీ జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రోటరీనగర్‌లోని పార్టీ జిల్లా కార్యాలయం నుంచి ప్రదర్శనగా బయలుదేరి ఇల్లెందు క్రాస్‌రోడ్డు మీదుగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ప్రభుత్వ తీరును ఎండగడుతూ నినాదాలు చేస్తూ కలెక్టర్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు. రోడ్డుపై వంటావార్పు చేపట్టి, గ్యాస్‌బండలతో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్‌కు వినతిపత్రం సమర్పించారు. గార్ల నెహ్రూసెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. మండల కన్వీనర్ పఠాన్ మీరాఖాన్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గుండా వెంకటరెడ్డి తదితరులు ఈ ఆందోళనను ఉద్దేశించి మాట్లాడారు. పెరిగిన వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ మధిర తహశీల్దార్ కార్యాలయం వైఎస్ఆర్సీపీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. ఆర్వీ కాంప్లెక్స్ వద్ద రోడ్డుపై వంటావార్పుతో ఆ పార్టీ కార్యకర్తలు నిరసన తెలిపారు. తహశీల్దార్ కార్యాలయం సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేశారు. ఎర్రుపాలెంలోని అంబేద్కర్‌సెంటర్‌లో పార్టీ కార్యాలయం ఎదుట రోడ్డుపై వంటావార్పు నిర్వహించారు. యూపీఏ ప్రభుత్వం, ప్రధాని మన్మోహన్సింగ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆర్ఐ లక్ష్మీనర్సుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సామాన్యకిరణ్, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, మండల కన్వీనర్ అంకసాల శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. బోనకల్ తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, తహశీల్దార్ షేక్ ముంతాజ్‌కు వినతిపత్రం అందజేశారు. పినపాక నియోజకవర్గంలోని మణుగూరు, పినపాక మండల కేంద్రాల్లో రాస్తారోకోలు చేశారు. పినపాక మండల కన్వీనర్ గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సారథ్యంలో ఎడూళ్ళ బయ్యారం క్రాస్‌రోడ్డు వద్ద రాస్తారోకో నిర్వహించారు. మణుగూరు మండల కేంద్రంలో 30 పడకల ఆస్పత్రి సమీపంలోని కోడిపుంజల వాగు బ్రిడ్జిపై రాస్తారోకో చేశారు. మండల, పట్టణ కన్వీనర్లు కుర్రి నాగేశ్వరరావు, ఆవుల నర్సింహారావు, పాయం ప్రమీల తదితరులు పాల్గొన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలోని ముల్కలపల్లి మండలకేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ పుష్పాల చందర్రావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు బండి కొమరయ్య, నాయకులు తాండ్ర రాంబాబు, సున్నం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. వైరా నియోజకవర్గ సమన్వయకర్త బాణోత్ మదన్‌లాల్ ఆధ్వర్యంలో క్రాస్‌రోడ్ వద్ద ధర్నా నిర్వహించారు. రోడ్డుపై కట్టెల పొయ్యి ఏర్పాటు చేసి టీ చేశారు. గ్యాస్ ధర పెంచడాన్ని మదన్‌లాల్ తదితరులు వ్యతిరేకించారు. భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గ సమన్వయకర్తలు డాక్టర్ తెల్లం వెంకట్రావ్, తాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో భద్రాచలం సబ్‌కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆర్డీవో కాసా వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందచేశారు.