Gas deposits
-
ఓఎన్జీసీతో టోటల్ఎనర్జీస్ జట్టు
న్యూఢిల్లీ: చమురు, గ్యాస్ క్షేత్రాల్లో కొత్త నిక్షేపాల వెలికితీతకు అవసరమైన సాంకేతిక సహకారం కోసం ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ అంతర్జాతీయ సంస్థలతో చేతులు కలుపుతోంది. ఇందులో భాగంగా తాజాగా మహానది, అండమాన్ క్షేత్రాలకు సంబంధించి ఫ్రాన్స్‌కి చెందిన టోటల్‌ఎనర్జీస్‌తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. సముద్ర లోతుల్లో నిక్షేపాల అన్వేషణకు కావాల్సిన సాంకేతిక సహకారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ (ఓఎన్జీసీ) ట్విటర్లో వెల్లడించింది. ఎక్సాన్‌మొబిల్, షెవ్రాన్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలతో ఓఎన్జీసీ ఇప్పటికే ఈ తరహా ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇవన్నీ ఇంకా పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చాల్సి ఉంది. ఓఎన్జీసీకి వివిధ ప్రాంతాల్లో గ్యాస్, చమురు నిక్షేపాల వెలికితీత, ఉత్పత్తికి లైసె న్సు ఉంది. అయితే, కంపెనీకి కేటాయించిన క్షేత్రా ల్లో ఉత్పత్తి తగ్గిపోతుండటంతో పాటు కొత్తగా మరే నిక్షేపాలు ఇటీవలి కాలంలో బైటపడటం లేదు. దీంతో సంక్లిష్టమైన క్షేత్రాల్లో గ్యాస్, చమురు నిల్వలను అన్వేషించేందుకు, ఉత్పత్తిని పెంచుకునేందుకు ఓఎన్జీసీ ఇతర సంస్థలతో జట్టు కడుతోంది. -
కేజీ బేసిన్.. చమురు నిక్షేపాలు దొరికెన్!
నరసాపురం: కృష్ణా, గోదావరి (కేజీ) బేసిన్ పరిధిలోని ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో చమురు నిక్షేపాల కోసం ప్రభుత్వరంగ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ) అధికారులు రెండేళ్లుగా చేస్తున్న అన్వేషణ సత్ఫలితాలనిచ్చింది. తాజాగా చమురు నిక్షేపాల కోసం అధికారులు వేగం పెంచి విస్తృతంగా అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లాలో నాలుగుచోట్ల అపారంగా గ్యాస్ నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించారు. ఇవన్నీ కొత్త బావులు కావడం విశేషం. ఇప్పటికే రెండుచోట్ల సర్వే డ్రిల్లింగ్ పనులు పూర్తి చేశారు. మిగిలిన రెండు చోట్ల కూడా గ్యాస్ వెలికితీతకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేజీ బేసిన్ పరిధిలో నరసాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో మూడు దశాబ్దాలుగా తవ్వుతున్న బావులు ఖాళీ అయ్యాయి. దీంతో ఉత్పత్తిని పెంచేందుకు ఓఎన్జీసీ రెండేళ్ల నుంచి నరసాపురం, పాలకొల్లు, యలమంచిలి, మార్టేరు, పెనుగొండ, భీమవరం ప్రాంతాల్లో అన్వేషణ ప్రారంభించింది. మార్టేరు, పెనుగొండ ప్రాంతాల్లో పెద్దస్థాయిలో, మొగల్తూరు మండలం ఆకెనవారితోట, భీమవరం సమీపంలోని మహాదేవపట్నం, వేండ్ర వద్ద మొత్తం నాలుగుచోట్ల చమురు నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించి, వెలికితీతకు ఉపక్రమించారు. నాలుగు దశాబ్దాలుగా కార్యకలాపాలు నాలుగు దశాబ్దాలుగా నరసాపురం కేంద్రంగా ఓఎన్జీసీ కార్యకలాపాలు సాగుతున్నాయి. అయితే మూడు దశాబ్దాల పాటు ఓఎన్జీసీ కేవలం ఆన్షోర్పైనే దృష్టి పెట్టింది. రిలయన్స్, గెయిల్ వంటి ప్రైవేట్ ఆయిల్‌రంగ సంస్థలు రంగప్రవేశం చేయడంతో వాటి పోటీని తట్టుకోవడానికి ఓఎన్జీసీ 2006 నుంచి సముద్రగర్భంలో అన్వేషణలపై దృష్టి సారించింది. ప్రస్తుతం నరసాపురం నుంచి కాకినాడ వరకు సముద్రగర్భంలో డ్రిల్లింగ్ జరుగుతోంది. నరసాపురం మండలం చినమైనవానిలంక తీరానికి సమీపంగా సముద్రగర్భంలో గ్యాస్ వెలికితీత ప్రారంభమైంది. అదనపు ఉత్పత్తిలో లక్ష్యాన్ని చేరుకోవడానికి ఓఎన్జీసీ ప్రస్తుతం ఇదే ప్రధాన వనరుగా భావిస్తోంది. ఆన్‌షోర్‌కు సంబంధించి పశ్చిమగోదావరి జిల్లాలో కవిటం, నాగిడిపాలెం, ఎస్–1 వశిష్టాబ్లాక్, 98–2 ప్రాజెక్ట్‌లో, తూర్పుగోదావరి జిల్లా కేశనపల్లి, కృష్ణా జిల్లా బంటుమిల్లి, నాగాయలంక ప్రాంతాల్లో గత కొంతకాలంగా చేపట్టిన అన్వేషణలు పూర్తయ్యాయి. మరో రెండు, మూడు నెలల్లో వీటి ద్వారా ఉత్పత్తి ప్రారంభమవుతుందని ఓఎన్జీసీ అధికారులు చెపుతున్నారు. 25 శాతం ఉత్పత్తి పెంపు లక్ష్యంగా.. రానున్న ఏడాది మరో 25 శాతం ఉత్పత్తి పెంపు కోసం ఓఎన్జీసీ ప్రయత్నాలు సాగిస్తోంది. రోజుకు 35 నుంచి 40 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్, 1,400 టన్నుల ఆయిల్ వెలికితీయడమే లక్ష్యంగా ముందుకెళుతోంది. గ్యాస్ వెలికితీతలో ఇప్పటికే దేశంలో మొదటి స్థానాన్ని దక్కించుకున్న ఓఎన్జీసీ.. ఇదే దూకుడుతో లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఆఫ్‌షోర్ (సముద్రగర్భం)లో అన్వేషణలకు సంబంధించి నరసాపురం తీరంలో చురుగ్గా కార్యకలాపాలు సాగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాదే అగ్రస్థానం కొత్తగా జిల్లాలో కనుగొన్న బావుల నుంచి ఉత్పత్తి ప్రారంభమైతే, రోజుకు ఇక్కడి నుంచి 4 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ వెలికితీయవచ్చని ఓఎన్జీసీ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం కేజీ బేసిన్లో ఓఎన్జీసీ రోజుకు 33 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్, 900 టన్నుల ఆయిల్‌ను వెలికితీస్తోంది. ఇందులో పశ్చిమగోదావరి జిల్లా నుంచే రోజుకు 10 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. కొత్త బావుల ద్వారా మరో 4 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి ఇక్కడి నుంచి పెరిగితే ఈ జిల్లాదే అగ్రస్థానం అవుతుంది. -
ఏపీలో భారీగా గ్యాస్ నిక్షేపాలు..
-
ఏపీలో భారీగా గ్యాస్ నిక్షేపాలు...
-
సహజ వాయువుల మహా ఖజానా.. ఆంధ్ర తీరం
మొత్తం విలువ..33 లక్షల కోట్లు... - కేజీ బేసిన్లో అపార సిరుల రాశి.. మంచు రూపంలో భారీ గ్యాస్ నిక్షేపాలు - ఆంధ్రప్రదేశ్ తీరంలో గుర్తింపు.. రిలయన్స్ గ్యాస్ క్షేత్రం కన్నా పది రెట్లు అధికం వాషింగ్టన్ : కృష్ణా-గోదావరి బేసిన్లో మరోసారి అపార సిరుల రాశి దొరికింది. మంచు రూపంలో నిక్షిప్తమై ఉన్న భారీ సహజవాయువు (గ్యాస్) వనరులను భారతదేశం కనుగొన్నది. శాస్త్రపరిభాషలో ‘గ్యాస్ హైడ్రేట్స్’గా పేర్కొనే ఈ నిక్షేపాలను బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరంలోని కేజీ బేసిన్ పరిధిలో కనుగొన్నారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ సారథ్యంలోని ఈ అన్వేషణలో పాల్గొన్న అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ గ్యాస్ హైడ్రేట్ నిక్షేపాలు అత్యంత సుసంపన్నమైనవని, వీటిని వెలికితీయవచ్చునని తెలిపింది. వీటిలో 134 లక్షల కోట్ల ఘనపుటడుగుల గ్యాస్ నిక్షిప్తమై ఉన్నట్లు ప్రాధమిక అంచనాగా ఓఎన్జీసీ వర్గాలు తెలిపాయి. మొత్తం విలువ ప్రస్తుత ధరల ప్రకారం రూ. 33 లక్షల కోట్లుగా ఉండొచ్చని నిపుణుల అంచనా. ఇదే కేజీ బేసిన్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ కనుగొని, నిర్వహిస్తున్న గ్యాస్ క్షేత్రమే ఇప్పటివరకూ భారతదేశం కనుగొన్న అతిపెద్ద గ్యాస్ క్షేత్రం. అందులో 14 లక్షల కోట్ల ఘనపుటడుగుల గ్యాస్ ఉన్నట్లు అప్పుడు అంచనా వేశారు. అంటే.. దానికన్నా పది రెట్లు అధికమైన గ్యాస్ నిక్షేపాలను తాజా అన్వేషణలో కనుగొన్నారు. కృష్ణా-గోదావరి బేసిన్లో మందపాటి ఇసుక రిజర్వాయర్లలో ఈ గ్యాస్ హైడ్రేట్ నిల్వలు ఉన్నాయని.. కాబట్టి వీటిని వెలికితీయటం సాధ్యమవుతుందని యూఎస్జీఎస్ ఎనర్జీ రిసోర్సెస్ ప్రోగ్రామ్ సమన్వయకర్త వాల్టర్ గైడ్రోజ్ సోమవారం వాషింగ్టన్లో వెల్లడించారు. పరిశోధన తర్వాతి దశలో ఈ గ్యాస్ హైడ్రేట్లను వెలికితీయటంపై పరీక్షలు నిర్వహించటం జరుగుతందని చెప్పారు. గ్యాస్ హైడ్రేట్.. మండే మంచు! సహజవాయువు (నాచురల్ గ్యాస్), నీరు కలిసిపోయి ప్రకృతి సిద్ధంగా గడ్డకట్టి మంచు రూపంలో ఉండటాన్ని గ్యాస్ హైడ్రేట్లుగా పరిగణిస్తారు. ఇవి ప్రపంచంలోని మహాసముద్రాల్లో.. ఖండాల అంచున, ధృవ ప్రాంతాల్లో కనిపిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా గల గ్యాస్ హైడ్రేట్ సంపదలో గల గ్యాస్ పరిమాణం అంతా కలిపితే.. ఇప్పటివరకూ తెలిసిన అన్ని రకాల సంప్రదాయ గ్యాస్ వనరుల పరిమాణం కన్నా చాలా అధికంగా ఉంటుంది. గ్యాస్ హైడ్రేట్ల నుంచి గ్యాస్‌ను ఉత్పత్తి చేయటం సాధ్యమయ్యేదే అయినప్పటికీ.. ఆ నిక్షేపాలు ఉన్న ప్రాంతం, అవి ఏ రూపంలో ఉన్నాయి అనే అంశాల ఆధారంగా వెలికితీయటానికి చాలా సాంకేతిక సవాళ్లు ఉన్నాయి. అయితే.. ఇసుక రిజర్వాయర్లలో అధిక సాంద్రతల్లో ఉండే గ్యాస్ హైడ్రేట్లను ప్రస్తుతం అందుబాటులో ఉణ్న సాంకేతిక పరిజ్ఞానంతో వెలికితీయటం సాధ్యమేనని ఇంతకుముందలి అధ్యయానాల్లో గుర్తించారు. భారత్, అమెరికా, జపాన్ల భాగస్వామ్యం భారతదేశంలో పశ్చిమ, తూర్పు, అండమాన్ సముద్ర తీరాల్లో కలిపి 1,894 ట్రిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ హైడ్రేట్ నిక్షేపాలు ఉన్నాయి. దేశంలోని గ్యాస్ హైడ్రేట్స్ సామర్థ్యాలను అన్వేషించటానికి, పైలట్ ఉత్పత్తి పరీక్షల కోసం క్షేత్రాలను గుర్తించటానికి భారత ప్రభుత్వం 2014లో అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది. జపాన్‌కు చెందిన జపనీస్ డ్రిల్లింగ్ కంపెనీ, జపాన్ ఏజెన్సీ ఫర్ మెరైన్-ఎర్త్ సెన్సైస్ అండ్ టెక్నాలజీ సంస్థలు కూడా ఈ అన్వేషణలో భాగస్వాములయ్యాయి. భారత ప్రభుత్వ రంగ సంస్థ చమురు సహజవాయువు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) సారథ్యంలో ‘ఇండియన్ నేషనల్ గ్యాస్ హైడ్రేట్ ప్రోగ్రామ్ ఎక్స్‌పెడిషన్ 02’ పేరుతో మూడు దేశాల పరిశోధకులు ఈ అన్వేషణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంతకుముందు భారత్, అమెరికాలు ఉమ్మడిగా చేపట్టిన అన్వేషణలో కూడా గ్యాస్ హైడ్రేట్ నిక్షేపాలను కనుగొన్నారు. అయితే.. ఆ గ్యాస్ హైడ్రేట్ ఉన్న రూపాలను బట్టి దానిని ఇప్పుడు వెలికితీయటం సాధ్యంకాదని నిర్ధారించారు. రెండోసారి చేపట్టిన అన్వేషణలో.. ఇసుక రిజర్వాయర్లలో అత్యంత సాంద్రత గల గ్యాస్ హైడ్రేట్లను గుర్తించటంపై కేంద్రీకరించి.. కృష్ణా-గోదావరి బేసిన్లో వెలికితీయగల నిక్షేపాలను కనుగొన్నారు. ప్రపంచంలో అతి భారీ నిక్షేపాల్లో ఒకటి కృష్ణా-గోదావరి బేసిన్‌లోని 982, డి3, డి6, డి9 బ్లాకుల్లో ఈ గ్యాస్ హైడ్రేట్స్ నిక్షేపాలను గుర్తించినట్లు డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ వర్గాలు తెలిపాయి. ఇవి రిలయన్స్ గ్యాస్ క్షేత్రమైన కేజీ-డి6 బ్లాక్‌కు 30 కిలోమీటర్లు నైరుతిగా ఉన్నాయి. కేజీ బేసిన్లో రిలయన్స్ గ్యాస్ ఇండస్ట్రీస్ 2002లో కనుగొన్న అతి భారీ గ్యాస్ క్షేత్రంలో ఉన్నట్లు పేర్కొన్న గ్యాస్ కన్నా.. తాజాగా ఇదే కేజీ బేసిన్లో కనుగొన్న గ్యాస్ హైడ్రేట్లు పది రెట్లు అధికంగా 134 లక్షల కోట్ల ఘనపుటడుగల మేర ఉన్నాయని పరిశోధకులు చెప్తున్నారు. రిలయన్స్ గ్యాస్ క్షేత్రంలో 14 లక్షల కోట్ల ఘనపుటడుగుల గ్యాస్ ఉన్నట్లు అంచనా వేశారు. రిలయన్స్ సంస్థకు ప్రభుత్వం 1 ఎంబీటీయూ (మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్) గ్యాస్‌కు 3.7 డాలర్లు చొప్పున ధర నిర్ణయించింది. అదే ధర ప్రకారం ఈ గ్యాస్ హైడ్రేట్లలోని 134 లక్షల కోట్ల ఘనపుటడుగుల గ్యాస్ విలువ దాదాపు రూ. 33 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ప్రపంచంలో ఇప్పటివరకూ గుర్తించిన అతి పెద్ద, అత్యంత సాంద్రతతో కూడిన గ్యాస్ హైడ్రేట్ నిక్షేపాల్లో ఇది ఒకటని.. ప్రపంచ ఇంధన వనరుల సామర్థ్యానికి గల పరిమితులను తొలగించటానికి, వాటిని సురక్షితంగా ఉత్పత్తి చేసే పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి ఈ ఆవిష్కారం దోహదం చేస్తుందని యూఎస్‌జీసీ సీనియర్ శాస్త్రవేత్త టిమ్ కొలెట్ పేర్కొన్నారు.