‘రిలయన్స్’ కావేరి బేసిన్లో గ్యాస్ నిక్షేపం
న్యూఢిల్లీ: కావేరి బేసిన్లో మరో గ్యాస్ నిక్షేపం కనుగొన్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని భాగస్వామ్య సంస్థ బీపీ శుక్రవారం తెలిపాయి. ఇది తీరానికి 62 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆగస్టు 17న నిక్షేపం కనుగొన్నప్పట్నుంచీ ఇందులో రోజుకు 1 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల గ్యాస్ వెలికి వస్తోందని, దీన్నిబట్టి చూస్తే నిల్వలు గణనీయంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు రిలయన్స్ వివరించింది. ఈ బావికి డీ-56 అని పేరు పెట్టారు. ఇందులో గ్యాస్ కండెన్సేట్ రూపంలో ఉండనుంది. మొత్తం 5,731 మీటర్లు డ్రిల్ చేయగా, సముద్రగర్భంలో 1,743 మీటర్లు డ్రిల్ చేశారు. కావేరి బేసిన్లో రిలయన్స్ కనుగొన్న రెండో నిక్షేపం ఇది. 2007లో ఒకటి కనుగొన్నప్పటికీ.. వెలికితీత లాభసాటిగా ఉండబోదంటూ హైడ్రోకార్బన్స్ నియంత్రణ సంస్థ డీ జీహెచ్ దాన్ని తోసిపుచ్చింది.