ఆధార్ సాకుతో సబ్సిడీ కోత
= ఆధార్ సాకుతో సబ్సిడీ కోత
= సుప్రీంకోర్టు ఉత్తర్వులు బేఖాతరు
= గొల్లుమంటున్న 5 లక్షల మంది వినియోగదారులు
= ఏజెన్సీల తీరుపై విమర్శలు
జిల్లాలో గ్యాస్ మంటలు దావానలంలా వ్యాపిస్తున్నాయి. ఆధార్ నంబరు బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేసుకోని వినియోగదారుల నుంచి ఏజెన్సీలు సబ్సిడీ లేకుండా మొత్తం గ్యాస్ ధర వసూలు చేస్తున్నాయి. దీంతో జిల్లాలో ఐదు లక్షల మందికి ఈ నెలలో సబ్సిడీ గ్యాస్ గల్లంతయ్యే పరిస్థితి నెలకొంది. వెరసి జిల్లాలోని వినియోగదారులపై దాదాపు రూ.42 కోట్ల 15 లక్షల భారం పడనుంది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా బేఖాతరు చేస్తూ ఏజెన్సీలు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : ఆధార్ నంబర్లు బ్యాంకు ఖాతాలకు అనుసంధానం కాని వారికి సబ్సిడీ గ్యాస్‌ను ఎగనామం పెడుతూ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్న చమురు కంపెనీలు ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ ఆదేశాల మేరకు ఈ నెల నుంచి ఆధార్ నంబరును బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేయనివారికి సబ్సిడీ గ్యాస్‌ను ఏజెన్సీలు నిలిపివేశాయి. దీంతో జిల్లాలో గ్యాస్ వినియోగదారులు ఘొల్లుమంటున్నారు.
ఆధార్ అనుసంధానం కానివారు 50 శాతం పైనే...
జిల్లాలో దాదాపు 11 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు వివిధ కంపెనీల గ్యాస్ వాడుతున్నట్లు అంచనా. ఇప్పటివరకు 48 శాతం గ్యాస్ వినియోగదారులు మాత్రమే బ్యాంకు ఖాతాలకు తమ నంబర్లు అనుసంధానం చేశారు. గత నెలాఖరు వరకు 5 లక్షల 24 వేల మంది వినియోగదారుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ నంబర్లు అనుసంధానం అయ్యాయని లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ ఆర్వీ నరసింహారావు తెలిపారు. మరో రెండు లక్షల వినియోగదారులు బ్యాంకు ఖాతాలు, గ్యాస్ ఏజెన్సీల వద్ద రెండింటి వద్దా ఆధార్ నంబర్లు ఇవ్వకుండా ఒకచోట మాత్రమే ఇచ్చారని చెప్పారు. అందువల్ల వారు కూడా సబ్సిడీ గ్యాస్‌ను కోల్పోతున్నారన్నారు. ఈ నేపథ్యంలో 11 లక్ష ల మంది వినియోగదారులలో ఆధార్ నంబర్లు ఖాతాలకు అనుసంధానం చేయనివారు సగానికి పైగా ఉంటారని అంచనా వేస్తున్నారు.
సుప్రీంకోర్టు ఉత్తర్వులూ బేఖాతరు...
కొందరు ఆధార్ కార్డులు దిగకపోవటం, ఆధార్ తీయించుకున్నవారిలో మరికొందరికి కార్డులు అందకపోవడం కారణంగా చెబుతున్నారు. మరికొన్ని ఆధార్ కార్డులు అడ్రస్ గల్లంతయ్యాయి. ఆధార్ కార్డులు ఎంతమందికి అందలేదనే విషయంలో అధికారుల వద్ద నేటికీ లెక్కలు లేవు. ఈ క్రమంలో ఆధార్‌తో పనిలేకుండా అందరికీ సబ్సిడీ గ్యాస్ సరఫరా చేయాలని సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వులు జారీచేసినా చమురు కంపెనీలు బేఖాతరు చేయటం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గణనీయంగా తగ్గిన అమ్మకాలు...
ఆధార్ నంబర్ అనుసంధానం చేసినవారికే సబ్సిడీ గ్యాస్ సరఫరా చేసే కార్యక్రమం అమలు చేస్తుండటంతో గురువారం విజయవాడ నగరంలో, జిల్లా వ్యాప్తంగా ఉన్న 74 గ్యాస్ ఏజెన్సీలలో అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. పట్టణాల్లో 15 శాతం, మండల కేంద్రాలలో 20 నుంచి 25 శాతం గ్యాస్ అమ్మకాలు తగ్గినట్లు నిర్వాహకులు ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. ఆధార్ నంబర్లు అనుసంధానం చేసుకోని వినియోగదారులు 14.2 కేజీల సిలిండర్‌ను పెరిగిన రేటు ప్రకారం రూ.1,323కు కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఆధార్ నంబర్లు బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేసినవారు కూడా పెరిగిన ధరతో గ్యాస్ బుకింగ్‌కు ఇబ్బందులు పడ్డారు. జనవరిలో ప్రతినెలా కంటే అదనంగా రూ.200 పెట్టుబడి పెట్టాల్సి రావటంతో మధ్యతరగతి, నిరుపేద కుటుంబాలు నానా తంటాలు పడ్డారు.