రాష్ర్టంలో ‘గ్యాస్ గ్యాంగ్రిన్’
బెంగళూరులో ఓ వ్యక్తి మృతి
* అరుదైన, ప్రమాదకరమైన వ్యాధిగా గుర్తింపు
* ఆందోళన వ్యక్తం చేస్తున్న వైద్యులు
సాక్షి,బెంగళూరు/మైసూరు : అత్యంత అరుదైన, ప్రమాదకరమైన వ్యాధిగా గుర్తింపు పొందిన గ్యాస్ గ్యాంగ్రిన్ వ్యాధితో బెంగళూరులో ఓ వ్యక్తి మరణించినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రపంచాన్ని ‘ఎబోలా’ భయపెడుతున్న తరుణంలో వైద్య రంగ పరిభాషలో మెడికల్ ఎమర్జెన్సీగా పేర్కొనే గ్యాస్ గ్యాంగ్రిన్ ఉదంతం వైద్య లోకంతో పాటు సాధారణ ప్రజలకు కూడా కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... మైసూరు జిల్లా హెడీకోటే తా లూకా హొమ్మరగళ్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి (35) విద్యుత్‌శాఖలో లైన్‌మన్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 15న చలి, జ్వరం రావడంతో అతన్ని స్థానిక ఆస్పత్రులతో పాటు మైసూరులోని పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం అందించారు.
అయినా ప్రయోజనం లేకపోవడంతో బెంగళూరులోని అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరున్న ఓ ఆస్పత్రిలో గత గురువారం చేర్పించారు. వైద్యుల పరీక్షల్లో అతనికి గ్యాస్ గ్యాంగ్రిన్ సోకినట్టు తేలింది. వ్యాధి ముదరడంతో అతను ఆస్పత్రిలో శుక్రవారం కన్నుమూశారు. వైద్యుల సూచనల మేరకు కుటుంబ సభ్యులు మృతదేహాన్ని శనివారం స్వగ్రామంలో దహనం చేశారు. కాగా, గ్యాస్గ్యాంగ్రిన్ వ్యాధి మట్టిలో ఆవాసం చేసే క్లాస్ట్రీడియం పర్ప్రీగీనస్ అనే బ్యాక్టీరియా మానవ శరీరంలోకి ప్రవేశించనప్పుడు వస్తుంది. ఈ వ్యాధికి గురైన వ్యక్తి శరీరంలో కణజాలాల్లో ఎక్కువ మొత్తంలో వాయువు (గ్యాస్) ఏర్పడి కణజాలం పగిలిపోతుంది.
దీంతో రోగిమరణిస్తాడు. వ్యాధికి గురైన వ్యక్తికి యాంటిబయాటిక్స్‌తోపాటు ఎటువంటి మందులు పనిచేయవు. బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వచ్చి ఉంటే దానిని మెడికల్ ఎమర్జెన్సీగా భావించవచ్చు. ఇదిలా ఉండగా బోత్రోప్స్ కుటుంబానికి చెందిన పాములు మనుషులను కాటు వేసినప్పుడు కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అయితే ఆ ఉద్యోగి గ్యాస్ గ్యాంగ్రిన్‌తో చనిపోయిన విషయాన్ని సదరు ఆసుపత్రి వైద్యులు ధ్రువీకరించడం లేదు.