గ్యాస్ హబ్‌గా హైదరాబాద్
* తెలంగాణలో రూ.1,300 కోట్లతో పనులు: కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్
* ఈశాన్యం నుంచి రాష్ట్రం మీదుగా గ్యాస్ పైప్‌లైన్
* ముంబై నుంచి హైదరాబాద్‌కు పైప్‌లైన్ ఏర్పాటుకు నిర్ణయం
* రాష్ట్రంలో మరో రెండు గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రాలు ఏర్పాటు!
సాక్షి, హైదరాబాద్: రానున్న రోజుల్లో హైదరాబాద్ గ్యాస్ హబ్‌గా మారే అవకాశం ఉందని కేంద్రసహజ వాయువు, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.
ఈశాన్యం నుంచి దక్షిణానికి గ్యాస్ పైప్‌లైన్ వేయనున్నామని, అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మీదుగా వెళుతుందని చెప్పారు. ఒడిశాలోని పారదీప్ నుంచి హైదరాబాద్ వరకు కొత్తగా ఐఓసీ వేసే గ్యాస్ పైప్‌లైన్‌కు రూ.2,500 కోట్లు ఖర్చవుతుందన్నారు. ఇక హెచ్‌పీసీఎల్ ఆధ్వర్యంలో ముంబై నుంచి హైదరాబాద్‌కు గ్యాస్ పైప్‌లైన్ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నామని చెప్పారు. ఈ రెండు పైప్లైన్లు పూర్తయితే దేశ ఉత్తర, పశ్చిమ, తూర్పుల ప్రాంతాలను కలుపుతూ ఏర్పడే సరికొత్త గ్యాస్ పైప్‌లైన్‌కు హైదరాబాద్ హబ్‌గా మారుతుందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాల యంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో రూ. 1,300 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఐఓసీ టెర్మినల్, గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రాలను ఏర్పా టు చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకు ప్రస్తుత ఆర్థిక ఏడాదిలోనే దాదాపు రూ.100 కోట్లు ఇవ్వనున్నట్లు చెప్పారు.
అందరికీ వంట గ్యాస్..
తెలంగాణలో 86 లక్షల వంట గ్యాస్ వినియోగదారులు ఉండగా.. అందులో 74 లక్షల కనెక్షన్లు మాత్రమే క్రియాశీలంగా ఉన్నాయని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. రెండేళ్లలో రాష్ట్రంలో వందశాతం కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు ఉండేలా చూస్తామన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో సీఎన్జీతో 21వేల వాహనాలు, పీఎన్జీతో వెయ్యి వరకు వాహనాలు నడుస్తున్నాయని.. భవిష్యత్తులో ఇవి బాగా పెరగాల్సి ఉందని చెప్పారు.
హైదరాబాద్‌లో మోనోటెర్మినల్ కేంద్రం ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని, అందుకు రూ.500 కోట్లు కేటాయించామని చెప్పారు. తెలంగాణలో మరో రెండు గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రాలను నెలకొల్పనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో నాలుగు కేంద్రాలున్నాయని పేర్కొన్నారు. కాగా శుక్రవారం ప్రధాన్ పుట్టినరోజు కావడంతో కిషన్‌రెడ్డి, డా.లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.