gate exam
-
67 ఏళ్ళ వయసులో ‘గేట్’ సాధించాడు!
చెన్నై: ఉద్యోగవిరమణ చేసిన వారు, వయసుపైబడిన వృద్ధులు కృష్ణా..రామా అనుకుంటూ ప్రశాంత జీవనాన్ని గడిపేందుకు మొగ్గుచూపుతారు. కానీ ఈ మధ్యకాలంలో కొందరు... వయసులో ఉన్నప్పుడు చేయలేనివి, కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ ఒత్తిడితో తాము కోల్పోయిన వాటిని సెకండ్ ఇన్నింగ్స్‌లో మొదలు పెట్టి తమ కోరికలు తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తమిళనాడుకు చెందిన ఓ తాతయ్య గేట్ పరీక్ష రాసి ఔరా అనిపించాడు. సాధారణంగా ఇరవై ఏళ్లు లేదా ముఫై ఏళ్లలోపు విద్యార్థులు గేట్ పరీక్షను క్లియర్ చేసేందుకు ఎంతో కష్టపడుతుంటారు. అటువంటిది మనవళ్లు ఉన్న 67 ఏళ్ల శంకరపాండియన్ ఈ ఏడాది గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(గేట్)–21లో ఉత్తీర్ణత సాధించి సంచలనం సృష్టించారు.తమిళనాడుకు చెందిన పాండియన్ హిందూ కాలేజీలో మ్యాథమేటిక్స్ టీచర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆ తరువాత తన చిరకాల కోరికైన గేట్ పరీక్ష కోసం సన్నద్దమయ్యి విజయం సాధించారు. ఈ ఏడాది గేట్లో ఉత్తీర్ణత సాధించిన వారిలో పాండియన్ అతిపెద్ద వయస్కుడు. ఎక్కువమంది విద్యార్థులు తమ స్పెషలైజేషన్ సబ్జెక్టు ఆధారంగా ఒక్క పేపర్‌ను ఎంచుకుంటారు. పాండియన్ రెండు పేపర్లు తీసుకుని మంచి మార్కులు సాధించారు. మ్యాథమేటిక్స్‌లో 338 మార్కులు, కంప్యూటర్ సైన్స్‌లో 482 మార్కులు సాధించి గేట్ పరీక్ష పాసయ్యాడు. రెండు పేపర్లను ఒకేరోజు రెండు షిప్టుల్లో రాసి ఉత్తీర్ణత సాధించడం విశేషం. వర్చువల్ రియాల్టీలో పరిశోధనలు చేయడం కోసమే గేట్ పరీక్ష రాశానని పాండియన్ చెప్పారు. అగ్మెంటెడ్ రియాల్టీ(ఏఆర్)లో పరిశోధనలు చేస్తానని, ముఖ్యంగా ‘స్పెసిఫిక్ ప్రాబ్లం అకల్షన్’పై దష్టి కేంద్రీకరిస్తానని ఆయన చెప్పారు. కాగా రియల్ వరల్డ్ ఆబెకట్ట్స్కు హోలోగ్రామ్స్ తయారు చేయడంలో ఈ టెక్నాలజీ తోడ్పడుతుంది.పాండియన్ మాట్లాడుతూ.. ‘‘ఈ ఏడాది గేట్ పరీక్షలో ఫెయిల్ అయినా మరోసారి కచ్చితంగా గేట్ పరీక్ష రాసేవాడిని. ఫెయిల్ అవుతానన్న భయం నాకులేదు. ఇది చాలా పోటీతోకూడుకున్న పరీక్ష. గేట్పరీక్షకు హాజరయ్యేవారిలో కేవలం 17 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధిస్తారు. నేను డిగ్రీ కోసమో, మంచి ప్యాకేజీ ఇచ్చే జాబ్ కోసమో ఈ పరీక్ష రాయలేదు. అగ్మెంటెడ్ రియాల్టీలో కొత్త విషయాలను తెలుసుకునేందుకు పరిశోధనలు చేసి నా జ్ఞానాన్ని మరింత పెంచుకోవాలనుకున్నాను. అందుకే ఎటువంటి టెన్షన్ పడకుండా 30 రోజుల్లో కాన్సెప్ట్స్ నేర్చుకుని... చాలా ఆనందంగా ఈ పరీక్ష ను రాశాను. 35 ఏళ్ల క్రితం ఒకసారి 1987 లో గేట్ పరీక్ష రాసాను. అప్పుడు ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సీటు వచ్చింది. అప్పటి గేట్ పేపర్‌కు ఇప్పటి పేపర్‌కు చాలా తేడా ఉంది. అప్పట్లో పరీక్ష రాస్తే ఫలితాలు రావడానికి నెలలు పట్టేది. ఇప్పుడు ఆన్లైన్ పరీక్షలు నిర్వహించడం వల్ల త్వరగానే ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటి పరీక్షల వ్యవస్థ సౌకర్యంగానే గాక వేగంగా కూడా ఉంది’’ అని ఆయన చెప్పారు. ‘‘పరీక్ష రాయడానికి హాలులోకి వెళ్లినప్పుడు పేరెంట్స్ వెయిటింగ్ హాల్ అటువైపు ఉంది వెళ్లండని సిబ్బంది చెప్పారు. నన్ను చూసినవారంతా పరీక్ష రాయడానికి వచ్చానని అనుకోలేదు’’ అని పాండియన్ నవ్వుతూ చెప్పారు. -
గేట్ ర్యాంక్ హోల్డర్.. పకోడా వ్యాపారం
డెహ్రడూన్ : గేట్ ఎగ్జామ్ ఎంత కష్టంగా ఉంటుందో ఇంజనీరింగ్ చదివే వారికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గేట్ ర్యాంక్‌తో డైరెక్ట్‌గా ప్రభుత్వ ఉద్యోగంలో చేరే అవకాశం ఉండటంతో దానికి ఓ రేంజ్లో క్రేజ్ ఉంటుంది. దేశ వ్యాప్తంగా లక్షల మంది పోటీ పడే ఈ ఎగ్జామ్‌లో మంచి ర్యాంక్ సాధించడం కోసం విద్యార్థులు ఇంజనీరింగ్ మొదటి ఏడాది నుంచే కోచింగ్ వంటి వాటికి వెళ్తూ చాలా కష్టపడుతుంటారు. ఒక్క సారి గేట్లో ర్యాంక్ వచ్చిందంటే.. ఇక జీవితం సెటిల్ అయినట్లే అనుకుంటారు. అలాంటిది గేట్లో అత్యుత్తమ ర్యాంక్ సాధించిన ఓ కుర్రాడు దాన్ని వదిలేసుకుని ప్రస్తుతం పకోడాలు అమ్ముతున్నాడంటే ఆశ్చర్యం కలగక మానదు. వివరాలు.. సాగర్ షా అనే కుర్రాడు ఉత్తరాఖండ్‌లో ఇంజనీరింగ్ విద్య పూర్తి చేశాడు. తరువాత ఎంటెక్‌లో చేరడం కోసం గేట్ ఎగ్జామ్ రాశాడు. దానిలో అత్యుత్తమ ర్యాంక్ సాధించాడు. అయితే ఎంటెక్ పేరుతో మరో రెండేళ్లు కుటుంబానికి భారంగా మారకూడదని భావించాడు. దాంతో కుటుంబ వ్యాపారమైన పకోడి బిజినెస్‌లో చేరి తండ్రికి చేదోడు.. వాదోడుగా నిలుస్తున్నాడు. షాప్‌కు వచ్చే కస్టమర్లకు టీ, పకోడిలు సర్వ్ చేయడమే కాక ఏ మాత్రం మొహమాటపడకుండా పాత్రలను కూడా శుభ్రం చేస్తున్నాడు. ఈ విషయం గురించి సాగర్‌ను ప్రశ్నించగా.. ‘ఇంజనీరింగ్ పూర్తయ్యాక గేట్ ఎగ్జామ్ పాస్ అవ్వాలనేది నా కల. అందుకోసం ఎంతో శ్రమించాను. స్వంతంగానే చదువుకున్నాను. గేట్లో 8 వేల ర్యాంక్ సాధించాను. ఆ ర్యాంక్‌తో నాకు మంచి ఎన్ఐటీలోనే సీటు వస్తుంది. కానీ ఎంటెక్ పేరుతో మరో రెండేళ్ల సమయం వృధా చేయదల్చుకోలేదు. దాని బదులు ఏదో ఒక పని చేసి నా కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలనుకున్నాను. అందుకే మా పకోడా వ్యాపారంలో భాగస్వామినయ్యాన’ని తెలిపారు. పకోడా షాప్ నడపడం కూడా ఓ సవాలే అన్నారు సాగర్. దీన్ని కూడా టెక్నాలజీతో అనుసంధానం చేసి మరింత స్మార్ట్‌గా ఈ బిజిసెస్‌ను ముందుకు తీసుకెళ్లాలన్నదే నా కోరిక అని తెలిపాడు సాగర్. -
గేట్‌కు వచ్చే నెల 1 నుంచే దరఖాస్తులు
సాక్షి,హైదరాబాద్: ఐఐటీ వంటి జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ఎంటెక్‌లో ప్రవేశాల కోసం గ్రాడ్యుయేట్ అప్టిట్యూట్ టెస్టు ఇన్ ఇంజనీరింగ్ (గేట్) నిర్వహణకు ఐఐటీ మద్రాసు చర్యలు చేపట్టింది. ఈ మేరకు సెప్టెంబరు 1 నుంచి దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించేలా షెడ్యూలు జారీ చేసింది. విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు వెబ్‌సైట్‌ను (http:// gate.iitm.ac.in) అందుబాటు లోకి తెచ్చింది. 2019 ఫిబ్రవరి 2, 3, 9, 10 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తామని ప్రకటించింది. ఈసారి గేట్లో స్టాటిస్టిక్స్ పేపరును కూడా కేంద్రం ప్రవేశ పెట్టింది. మొత్తంగా 24 సబ్జెక్టుల్లో ఆన్లైన్లోనే పరీక్షలు నిర్వహించనుంది. ప్రతి విద్యార్థి ఒకే పేపరులో పరీక్ష రాయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజును రూ. 1,500గా నిర్ణయించింది. తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం నల్లగొండ, వరంగల్‌లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్, కర్నూల్, భీమవరం, ఏలూరు, కాకినాడ, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయనగరం, తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, చీరాల, చిత్తూరు, గూడూరు, గుంటూరు, కడప, నెల్లూరు, ఒంగోలు, తిరుపతిలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని మద్రాసు ఐఐటీ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు గేట్‌ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఈసారి గేట్ రాసేందుకు అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉంది. ఇదీ గేట్ షెడ్యూలు.. సెప్టెంబరు 1 నుంచి 21వ తేదీ వరకు: ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ అక్టోబరు 1వరకు: రూ. 500 ఆలస్య రుసుముతో ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ నవంబరు 16 వరకు: పరీక్షల కేంద్రాల మార్పునకు అవకాశం (ప్రత్యేక ఫీజు చెల్లింపుతో) 2019 జనవరి 4: వెబ్సైట్లో అందుబాటులోకి హాల్‌టికెట్లు 2019 ఫిబ్రవరి 2, 3, 9, 10 తేదీల్లో: గేట్ ఆన్లైన్ పరీక్షలు, ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. మార్చి 16: ఫలితాలు వెల్లడి. -
నేడు సాక్షి ఆధ్వర్యంలో గేట్‌పై అవగాహన సదస్సు
కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: ఇంజనీరింగ్ విద్యార్థులకు సాక్షి ఆధ్వర్యంలో శనివారం గేట్ పరీక్షపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ట్రూంఫెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ప్రైవేటు లిమిటెడ్(టైమ్) వారు అందుకు సహకారం అందిస్తున్నారు. కర్నూలు నగరంలోని కలెక్టరేట్లో ఉన్న సునయన ఆడిటోరియంలో మధ్యాహ్నం 1.30 నుండి 3.30 గంటల వరకు సదస్సు కొనసాగనుంది. గేట్ స్కోర్ ఆధారంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో నియామకాలు, తదితర అవకాశాలను టైమ్ గేట్ కోర్సు డెరైక్టర్, బిట్స్‌పిలాని, ఐఐఎం కలకత్తాకు చెందిన పృథ్వీరెడ్డి వివరిస్తారు. ఆసక్తి గల ఇంజనీరింగ్ విద్యార్థులు ఇతర వివరాలకు 72077 02848, 99853 96911 నంబర్లను సంప్రదించాలని సూచించారు.