చెన్నై: ఉద్యోగవిరమణ చేసిన వారు, వయసుపైబడిన వృద్ధులు కృష్ణా..రామా అనుకుంటూ ప్రశాంత జీవనాన్ని గడిపేందుకు మొగ్గుచూపుతారు. కానీ ఈ మధ్యకాలంలో కొందరు... వయసులో ఉన్నప్పుడు చేయలేనివి, కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ ఒత్తిడితో తాము కోల్పోయిన వాటిని సెకండ్ ఇన్నింగ్స్‌లో మొదలు పెట్టి తమ కోరికలు తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తమిళనాడుకు చెందిన ఓ తాతయ్య గేట్ పరీక్ష రాసి ఔరా అనిపించాడు.
సాధారణంగా ఇరవై ఏళ్లు లేదా ముఫై ఏళ్లలోపు విద్యార్థులు గేట్ పరీక్షను క్లియర్ చేసేందుకు ఎంతో కష్టపడుతుంటారు. అటువంటిది మనవళ్లు ఉన్న 67 ఏళ్ల శంకరపాండియన్ ఈ ఏడాది గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(గేట్)–21లో ఉత్తీర్ణత సాధించి సంచలనం సృష్టించారు.తమిళనాడుకు చెందిన పాండియన్ హిందూ కాలేజీలో మ్యాథమేటిక్స్ టీచర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆ తరువాత తన చిరకాల కోరికైన గేట్ పరీక్ష కోసం సన్నద్దమయ్యి విజయం సాధించారు.
ఈ ఏడాది గేట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారిలో పాండియన్ అతిపెద్ద వయస్కుడు. ఎక్కువమంది విద్యార్థులు తమ స్పెషలైజేషన్ సబ్జెక్టు ఆధారంగా ఒక్క పేపర్‌ను ఎంచుకుంటారు. పాండియన్ రెండు పేపర్లు తీసుకుని మంచి మార్కులు సాధించారు. మ్యాథమేటిక్స్‌లో 338 మార్కులు, కంప్యూటర్ సైన్స్‌లో 482 మార్కులు సాధించి గేట్ పరీక్ష పాసయ్యాడు. రెండు పేపర్లను ఒకేరోజు రెండు షిప్టుల్లో రాసి ఉత్తీర్ణత సాధించడం విశేషం. వర్చువల్ రియాల్టీలో పరిశోధనలు చేయడం కోసమే గేట్ పరీక్ష రాశానని పాండియన్ చెప్పారు.
అగ్మెంటెడ్ రియాల్టీ(ఏఆర్)లో పరిశోధనలు చేస్తానని, ముఖ్యంగా ‘స్పెసిఫిక్ ప్రాబ్లం అకల్‌షన్’పై దష్టి కేంద్రీకరిస్తానని ఆయన చెప్పారు. కాగా రియల్ వరల్డ్ ఆబెకట్ట్స్‌కు హోలోగ్రామ్స్ తయారు చేయడంలో ఈ టెక్నాలజీ తోడ్పడుతుంది.పాండియన్ మాట్లాడుతూ.. ‘‘ఈ ఏడాది గేట్ పరీక్షలో ఫెయిల్ అయినా మరోసారి కచ్చితంగా గేట్ పరీక్ష రాసేవాడిని. ఫెయిల్ అవుతానన్న భయం నాకులేదు. ఇది చాలా పోటీతోకూడుకున్న పరీక్ష.
గేట్‌పరీక్షకు హాజరయ్యేవారిలో కేవలం 17 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధిస్తారు. నేను డిగ్రీ కోసమో, మంచి ప్యాకేజీ ఇచ్చే జాబ్ కోసమో ఈ పరీక్ష రాయలేదు. అగ్మెంటెడ్ రియాల్టీలో కొత్త విషయాలను తెలుసుకునేందుకు పరిశోధనలు చేసి నా జ్ఞానాన్ని మరింత పెంచుకోవాలనుకున్నాను. అందుకే ఎటువంటి టెన్షన్ పడకుండా 30 రోజుల్లో కాన్సెప్ట్స్ నేర్చుకుని... చాలా ఆనందంగా ఈ పరీక్ష ను రాశాను. 35 ఏళ్ల క్రితం ఒకసారి 1987 లో గేట్ పరీక్ష రాసాను. అప్పుడు ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సీటు వచ్చింది.
అప్పటి గేట్ పేపర్‌కు ఇప్పటి పేపర్‌కు చాలా తేడా ఉంది. అప్పట్లో పరీక్ష రాస్తే ఫలితాలు రావడానికి నెలలు పట్టేది. ఇప్పుడు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించడం వల్ల త్వరగానే ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటి పరీక్షల వ్యవస్థ సౌకర్యంగానే గాక వేగంగా కూడా ఉంది’’ అని ఆయన చెప్పారు. ‘‘పరీక్ష రాయడానికి హాలులోకి వెళ్లినప్పుడు పేరెంట్స్ వెయిటింగ్ హాల్ అటువైపు ఉంది వెళ్లండని సిబ్బంది చెప్పారు. నన్ను చూసినవారంతా పరీక్ష రాయడానికి వచ్చానని అనుకోలేదు’’ అని పాండియన్ నవ్వుతూ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment