గంటకు 160 కిలోమీటర్లు
దేశంలో అత్యంత వేగమైన రైలు గతిమాన్ షురూ
♦ గంటన్నరలో ఢిల్లీ నుంచి ఆగ్రాకు
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత వేగమైన రైలు గతిమాన్ ఎక్స్ప్రెస్ పట్టాలెక్కింది. రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు మంగళవారం ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో పచ్చజెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు. శుక్రవారం మినహాయించి వారానికి ఆరు రోజులు హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ నుంచి ఆగ్రా కంటోన్మెంట్ స్టేషన్ వరకు ఈ రైలు నడుస్తుంది. నిజాముద్దీన్ స్టేషన్లో ఉదయం 8.10కి బయలుదేరి ఆగ్రాకు 9.50కి చేరుతుంది. తిరిగి ఆగ్రాలో సాయంత్రం 5.50కి ప్రారంభమై నిజాముద్దీన్ స్టేషన్కు రాత్రి 7.30కి చేరుకుంటుంది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈ ట్రైన్లో సకల సౌకర్యాలు ఉన్నాయి.
రెండు ఎగ్జిక్యూటివ్ ఏసీ చైర్కార్ బోగీలు, 8 ఏసీ చైర్ కార్ బోగీలు ఉన్నాయి. ప్రతీసీట్లో పుష్బ్యాక్ సీటింగ్ సౌకర్యం ఉంది. అలాగే సీటు వె నుక ఎల్సీడీ టీవీ అమర్చారు. బయో టాయిలెట్స్, ఫ్రీ మల్టీమీడియా సర్వీసెస్ ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ ఏసీ చైర్కార్ టికెట్ ధర రూ. 1,500, ఏసీ చైర్ కార్ టికెట్ ధర రూ. 750గా నిర్ణయించారు. కాగా ఇదే తరహా ట్రైన్లను కాన్పూర్-ఢిల్లీ, చండీగఢ్-ఢిల్లీ, హైదరాబాద్- చెన్నై, నాగ్పూర్ -సికింద్రాబాద్ తదితర 9 రూట్లలో ప్రారంభించేందుకు రైల్వే అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.